షర్మిల పార్టీ పెట్టడానికి జగన్ తో గొడవలే కారణమా...?

Update: 2022-12-26 02:43 GMT
వైఎస్ షర్మిల దివంగత నేత వైఎస్సార్ ముద్దుల తనయ. వైఎస్సార్ వారసత్వం కుమారుడికే కాదు కుమార్తెకు కూడా ఉండాలని గట్టిగా నమ్మే వ్యక్తిగా చెప్పుకుంటారు. ఏపీలో తన అన్న పార్టీకి ఆమె కూడా క్రియాశీలకంగా పనిచేశారు. అయితే వైసీపీలో ఆమెకు ఎలాంటి పదవులు లేవు. ఆమె అడగలేదో అన్న ఇవ్వలేదో తెలియదు కానీ షర్మిల కేవలం ప్రచారానికే పరిమితం అయ్యారు.

ఇదిలా ఉంటే జగన్ అధికారంలోకి వచ్చేంతవరకూ షర్మిల తన మనసులో ఏముందో  చెప్పలేదు కానీ అన్న సీఎం అయ్యాక కూడా తనకు ఎలాంటి పదవి లేకపోవడం పట్ల మాత్రం మనస్తాపానికి గురి అయ్యారని అందుకే ఆమె తన రాజకీయాన్ని తాను చూసుకున్నారని అంటారు. అలా ఆమె తెలంగాణాలో   వై ఎస్సార్టీపీని పెట్టారు. దీని మీద కాంగ్రెస్ టీయారెస్ సహా అనేక పార్టీలు ఆమె మీద విమర్శలు సంధించాయి.

అయితే షర్మిల మాత్రం అన్న మీద కోపం ఉంటే తాను ఆంధ్రాలోనే పార్టీ పెట్టేదాన్ని కదా అని గడుసుగా ప్రశ్న వేస్తూ వచ్చారు. తాను తెలంగాణాలో పార్టీ పెట్టడానికి కారణం కేసీయార్ పాలన బాగులేకపోవడమే అని కుండబద్ధలు కొడుతూ వచ్చారు. కేసీయార్ పాలన అధ్వాన్నంగా ఉన్నందువల్లనే తాను పార్టీ పెట్టాను తప్ప అన్న మీదనో మరొకరి మీదనో కోపం కాదు అని చెప్పేశారు.

కానీ ఆ విషయంలో ఎంత వరకూ నిజముందో జనాలు ఆమె అన్న తో వ్యవహరిస్తున్న తీరుని చూసి కూడా అర్ధం చేసుకుంటున్నారు. ఆమె పార్టీ పెట్టాక జగన్ తో కలసి మెలసింది లేదు, ఇద్దరు మధ్య కూడా పెద్దగా మాటా మంతీ లేదు అని కూడా చెబుతారు ఇక లేటెస్ట్ గా పులివెందులలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో కుటుంబం అంతా ఒక చోట చేరినా షర్మిలా రాకపోవడాన్ని కూడా అంతా పాయింట్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలంగాణా ప్రజానీకం మనసులో కూడా ఉందేమో ఏమో తెలియదు కానీ షర్మిల తెలంగాణా రాజకీయం అయితే ఆమె ఊహించినంత కూడా పండలేదు అని అంటారు.

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి షర్మిల పోటీ చేయాలనుకుంటున్నారు. ఇక పాదయాత్ర పేరిట మూడు వేల కిలోమీటర్ల దూరం ఆమె నడిచారు. జనవరి నుంచి మిగిలిన పాదయాత్రను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆమె తెలంగాణాలో ఒక ఫోర్స్ గా నిలుస్తారా లేదా అన్నది కూడ ఆలోచించాల్సి ఉంది. ఏది ఏమైనా షర్మిల పార్టీ పెట్టడానికి అన్న కారణం కాదు అంటున్నా ఏపీ మూలాలు, జగన్ తో వివాదాలే హైలెట్ చేస్తూ టీయారెస్ నేతలు చేస్తున్న ప్రచారం వల్ల మాత్రం షర్మిల విషయంలో జనం పాజిటివ్ గా చూసేందుకు వీలు లేకుండా పోయే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News