విశాఖ బరిలో వైవీ... ?

Update: 2022-04-21 14:53 GMT
విశాఖది విశాల హృదయం. ఎక్కడ నుంచో వచ్చిన నాయకులు అంతా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచి చట్టసభల్లో మెరిసారు. ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటు పురంధేశ్వరి 2009 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అంతకు ముందు నెల్లూరు జిల్లాకు చెందిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి విశాఖ ఎంపీగా గెలిచారు. అదే జిల్లాకు చెందిన టీ సుబ్బరామిరెడ్డి కూడా రెండు సార్లు విశాఖ ఎంపీగా కాంగ్రెస్ తరఫున గెలిచారు.

టీడీపీ నుంచి గోదావరి జిల్లాలకు చెందిన ఎంవీవీఎస్ మూర్తి గెలిస్తే, బీజేపీ నుంచి ఒంగోలుకు చెందిన హరిబాబు ఎంపీ అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిలలకు చెందిన ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ తరఫున ఎంపీగా నెగ్గారు మరి 2024 ఎన్నికల్లో ఎవరు నిలుస్తారు, గెలుస్తారు అన్న చర్చ అయితే ఉంది.

తాజాగా వైసీపీలో సంస్థాగతంగా జరిగిన మార్పు చేర్పులలో భాగంగా కొత్త పేరు ఒకటి ప్రచారంలోకి వస్తోంది. అదేంటి అంటే వైవీ సుబ్బారెడ్డి. ఆయన జగన్ కి సొంత బాబాయి.  ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఉమ్మడి విశాఖ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.

అంటే ఆయన విశాఖ వాసి అయినట్లే. ఇకమీదట విశాఖ సుబ్బారెడ్డిగా కూడా పిలవాలి. ఆయనకు 2014లో ఒంగోలు నుంచి ఎంపీ అయ్యారు. 2019లో టికెట్ దక్కలేదు. 2024లో మరోసారి పోటీకి ఆయన తయారుగా ఉన్నారు. మరి ఒంగోలులో టికెట్ దక్కకపోతే విశాఖ నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం గతంలోనే వచ్చింది. అప్పట్లో అయితే ఆయన రీజనల్ కో ఆర్డినేటర్ కూడా అవుతారు అని ఎవరూ ఊహించలేదు.

ఇపుడు ఆ బాధ్యతలు కూడా ఆయనకే దక్కాయి. దాంతో వైవీ సుబ్బారెడ్డి విశాఖలోనే ఇక మీదట మకాం వేసి అటు పార్టీని పటిష్టం చేయడంతో పాటు ఇటు తన ఫ్యూచర్ పాలిటిక్స్ కి కూడా పదును పెడతారు అని అంటున్నారు. విశాఖ సీటు అంటే వైసీపీ అధినాయకత్వానికి ఒక మోజూ క్రేజూ ఉన్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సతీమణి విజయమ్మ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇపుడు అలా కాదు, వైసీపీ సిటీలో గతం కంటే బలపడింది. పైగా పార్టీ అధికారంలో ఉంది. దాంతో బాబాయ్ ఫీల్డ్ లోకి దిగుతారా అన్న చర్చ మొదలైంది.

మొత్తానికి ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందు వైవీ సుబ్బారెడ్డి విశాఖకు వస్తున్నారు. దాంతో విశాఖ ఎంపీగా ఆయన పోటీ చేయడం ఖాయమనే అంటున్నారు అంతా. చూడాలి మరి ఈ ప్రచారం ఎంత వరకూ నిజమవుతుందో. ఏది ఏమైనా సుబ్బారెడ్డి కేరాఫ్ విశాఖ. ఇదీ ఇప్పటికైతే కన్ ఫర్మ్.
Tags:    

Similar News