వైవీ సార్ : చిక్కులూ...చుక్కలూ ..?

Update: 2022-05-11 00:30 GMT
ఆయన టీటీడీ చైర్మన్ గా దైవధ్యానంలో హ్యాపీగా ఉన్నారు. ఇక చాన్స్ వస్తే గిస్తే మరోమారు ఎగువ సభకో దిగువ సభకో ఎంపీ కావాలని అనుకుంటున్నారు. ఆయన్ని తీసుకువచ్చి ఉమ్మడి విశాఖ జిల్లాకు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా జగన్ చేశారు. ఆయన కంటే ముందు విజయసాయిరెడ్డి ఈ హోదాలో ఉండేవారు. ఆయన చాలా స్పీడ్. ఇక విజయసాయిరెడ్డి మార్క్ పాలిటిక్స్ వేరుగా ఉండేది.

తన నియామకం అయిన పదిహేను రోజులకు విశాఖ విడిది చేసిన వైవీ సుబ్బారెడ్డికి వస్తూనే సౌత్ నియోజకవర్గం నేతలు చుక్కలు చూపించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అయితే వచ్చే ఎన్నికల్లో  తనకు సీటు భరోసా కావాలని గట్టిగానే కోరుతున్నారు. తన సౌత్ లో మరొకరు వేలు పెట్టకూడదని ఆయన భావిస్తున్నారు. అయితే ఆయన వలస వచ్చిన నాయకుడు. ముందు నుంచి ఉన్న వారు చాలా మంది ఉన్నారు.

దాంతో పాత వారికీ కొత్త వారికీ అసలు పొసగదు. ఈ నేపధ్యంలో విజయసాయిరెడ్డి వర్గంగా బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ ఒకరు గట్టిగా సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఆయనే కాదు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చిన నేతల కన్ను కూడా ఆ సీటు మీద ఉంది. ఇవన్నీ తలనొప్పులే. మొత్తానికి దక్షిణం నుంచే ఇబ్బందులు మొదలయ్యాయి.

ఇక అక్కడే కాదు, చాలా చోట్ల వైసీపీలో వర్గాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డికి సాన్నిహిత్యంగా నిన్నటి వరకూ ఉన్న వారు ఇపుడు కాస్తా తగ్గిపోగా, నాడు దూరం జరిగిన వారు వైవీ పక్కన నిలిచేందుకు చూస్తున్నారు. ఇక పెద్దాయనకు ఎవరు ఏ తీరుగా ఉంటారో తెలియని స్థితి. అనకాపల్లిలో చూస్తే మంత్రి అమరనాధ్ కి వ్యతిరేకంగా ఉన్న గ్రూపు వైవీ సుబ్బారెడ్డిని మచ్చిక చేసుకుని చక్రం తిప్పాలనుకుంటోంది.

ఇంకో వైపు చూస్తే ఏజన్సీ నేతల మధ్య కూడా పొరపొచ్చాలు ఉన్నాయి. దాంతో ఈ గ్రూపులను అన్నింటినీ ఏకం చేయాల్సిన పెద్ద బాధ్యత వైవీ మీద పడింది. పైకి అంతా బాగుందని అంతా హాజరై చేతులు పైకి ఎత్తేసినా సెగలూ పొగలూ మాత్రం లోలోపల అలా రగులుతూనే ఉన్నాయి.

ఈ నేపధ్యంలో వైవీ చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోతే మాత్రం అసలు ఏ పని జరగదు అంటున్నారు. ఆయన విశాఖలో మకాం వేసి పార్టీ పొజిషన్ ఏంటి అన్నది మొదటి నుంచి లోతుపాతులు చూసిన మీదటనే ఏమైనా రిపేర్లు చేయగలరు అన్న మాట ఉంది. మొత్తానికి బాబాయ్ అంటూ జగన్ పెద్ద బాధ్యతనే పెట్టేశారా అన్న మాట అయితే వైసీపీలో వినిపిస్తోంది.
Tags:    

Similar News