శ్రీశాంత్ ను ఎందుకు వదిలేశారు?

Update: 2015-07-26 10:16 GMT
రెండేళ్ల కిందట ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకీత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు పక్కాగా ఆధారాలుండటంతో వాళ్లను అరెస్టు చేసి.. కేసులు పెట్టారు పోలీసులు. కానీ ఇప్పుడు దిల్లీ కోర్టు ఆ ముగ్గుర్నీ నిర్దోషులుగా పేర్కొంటూ కేసు నుంచి విముక్తి కల్పించింది. శ్రీశాంత్, చండిలా, అంకీత్ ఫిక్సింగ్ కోసం బుకీలతో మాట్లాడినట్లు రికార్డింగ్స్ ఉన్నాయని పోలీసులు అంటున్నారు. కోర్టులోనూ అవే సమర్పించారు. అయినా కోర్టు కేసు కొట్టేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఐతే శ్రీశాంత్ అండ్ కోను కోర్టు కేసు నుంచి విముక్తుల్ని చేయడానికి ఫిక్సింగ్ నిరోధానికి సరైన చట్టాలు లేకపోవడమే కారణమని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇంతకుముందు అజహరుద్దీన్, అజయ్ జడేజాలు కూడా ఫిక్సింగ్ అభియోగాలు ఎదుర్కొన్నారు. కానీ ఫిక్సింగ్ విషయంలో భారత శిక్షా స్మృతితో సరైన చట్టాలు లేవు. ఆ నేరం ఏ చట్టాల  కిందికీ రాదు. దీంతో అజహరుద్దీన్, జడేజా నిర్దోషులుగా బయటపడ్డారు. ఇప్పుడు శ్రీశాంత్, చండిలా, అంకీత్ లకు వ్యతిరేకంగా ఎంకోకా అనే చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆ చట్టం పరిధిలోకి వచ్చేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు చూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ నేరంపై చర్యలు తీసుకోవడానికి తగిన చట్టాలు లేకపోవడంపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. గత అనుభవాలు, తాజా పరిణామాల్ని బట్టి చూస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి సరైన చట్టం లేకపోవడం వల్లే అందరూ నిర్దోషులుగా బయటపడుతున్నట్లు అర్థమవుతోంది. తాజా తీర్పు నేపథ్యంలో ఫిక్సింగ్ కు పాల్పడినా ఎలాంటి శిక్ష ఉండదనే అభిప్రాయం క్రికెటర్లలో కలిగే ప్రమాదం కూడా ఉంది. ఐతే బీసీసీఐ మాత్రం శ్రీశాంత్, చవాన్ లపై వేసిన జీవిత కాల నిషేధం తొలగించనంటోంది. వాళ్లిద్దరూ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు బీసీసీఐ అంతర్గత విచారణలో స్పష్టం కావడంతో నిషేధం తొలగించనంటోంది. ఐతే దీనిపై వాళ్లిద్దరూ కోర్టుకెళ్తే నిషేధం తొలగిపోయే అవకాశముంది. అజహర్, జడేజా గతంలో ఇలాగే తమ మీద నిషేధం తొలగిపోయేలా చేసుకున్నారు.
Tags:    

Similar News