ఒక లెజెండ్ నిష్క్రమిస్తున్నాడు

Update: 2015-08-05 07:44 GMT
ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు ఓ సిరీస్ ఆడబోతోందంటే వారం పది రోజుల ముందు నుంచే ఉత్కంఠ మొదలయ్యేది. అభిమానుల్లో విశ్లేషణలు మొదలైపోయేవి. మ్యాచ్ లు చూడ్డానికి ఇప్పట్నుంచే సన్నాహాలు చేసుకునేవారు అభిమానులు. పేపర్లలో వచ్చే షెడ్యూుల్ కట్ చేసి పెట్టుకుని మ్యాచ్ ల కోసం ఉత్కంఠగా ఎదురు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు క్రికెట్ డోస్ బాగా ఎక్కువైపోవడం.. జనాలు కూడా ఫుల్ బిజీ అయిపోవడంతో టీమ్ ఇండియా ఏం మ్యాచ్ లు ఆడుతోంది.. ఆడబోతోంది అని జనాలకు పట్టట్లేదు. ఇంకో వారం రోజుల్లో కోహ్లి సేన..  శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ఆడబోతోందన్న సంగతి జనాలకు పట్టట్లేదు. ఐతే మొన్నటి బంగ్లా సిరీస్ ను పట్టించుకోకున్నా.. నిన్నటి జింబాబ్వే సిరీస్ ను చూడకున్నా పర్వాలేదు కానీ.. లంకతో సిరీస్ ను మాత్రం ప్రతి క్రికెట్ అభిమానీ తప్పక చూడాలి. ఎందుకంటే ఈ సిరీస్ తో ఓ లెజెండ్ నిష్క్రమిస్తున్నాడు. ఆ లెజెండ్ మరెవరో కాదు.. కుమార సంగక్కర.

శ్రీలంక క్రికెట్లో సంగక్కర కంటే ముందు దిగ్గజాలున్నారు. అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా, సనత్ జయసూర్య, ముత్తయ్య మురళీధరన్ లతో పాటు.. సంగక్కర సమకాలీనుడు మహేల జయవర్దనే.. వీళ్లందరూ దిగ్గజాలే. కానీ వాళ్లకు, సంగక్కరకు తేడా ఉంది. ఆ ఐదుగురి కెరీర్లో ఎత్తు పల్లాలున్నాయి. వారిలో కెరీర్ పీక్స్ లో ఉండగా వీడ్కోలు తీసుకున్నవాడు మురళీధరన్ మాత్రమే. కాకపోతే అతడి బౌలింగ్ శైలిపై చాలా అభ్యంతరాలున్నాయి, వివాదాలున్నాయి. క్లీన్ బౌలర్ కాదన్న ఆరోపణలున్నాయి. రణతుంగ, డిసిల్వా మరీ సుదర్ఘా కాలమేమీ ఆడలేదు. జయసూర్య చాలా కాలం ఆడాడు కానీ.. రిటైర్మెంట్ కు ముందు అభిమానులకు విసుగు పుట్టించాడు. ఇంకెప్పుడు రిటైరవుతాడు అని తిట్టుకునేలా చేశాడు.

 జయవర్దనే కెరీర్ ఆసాంతం అద్భుతంగా ఆడాడు కానీ.. చివర్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. అతడి రిటైర్మెంట్ ఆశించినట్లు లేదు. కానీ సంగక్కర వీళ్లందరికీ భిన్నం. కెరీర్ ఆరంభంలో నుంచి ఇప్పటిదాకా అతడి ఆట అద్భుతం. టీ20ల నుంచి వీడ్కోలు తీసుకునే మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ తో శ్రీలంకకు ప్రపంచకప్ అందించిన ఘనుడతను. మొన్నటి వన్డే వరల్డ్ కప్ అతడికి వన్డేల్లో చివరి టోర్నీ. అందులోనూ అద్భుతంగా రాణించాడు. టెస్టుల్లోనూ బాగానే ఆడుతున్నాడు. తన చివరి సిరీస్ ను కూడా చిరస్మరణీయం చేసుకునేలా మంచి ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలతో ఉన్నాడు సంగ. బాదడమే బ్యాటింగ్ అనుకునే ఈ రోజుల్లో సంగ లాంటి క్లాస్ బ్యాటింగ్ ను మున్ముందు చూడలేం. కాబట్టి అతడి బ్యాటింగ్ విన్యాసాల్ని ఆస్వాదించడానికి ప్రపంచ క్రికెట్ ప్రియులందరికీ ఇదే చివరి అవకాశం. కాబట్టి ఈ సిరీస్ కోసం వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News