అశ్విన్ టెస్టుల్లో నంబర్ 7.. అత్యధిక వికెట్ల వేటలో మున్ముందుకు

వయసు మీద పడుతున్నా వన్నె తరగనట్లుగా.. లేటుగా వచ్చినా లేటెస్ట్ అన్నట్లు టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు.

Update: 2024-10-24 14:30 GMT

వయసు మీద పడుతున్నా వన్నె తరగనట్లుగా.. లేటుగా వచ్చినా లేటెస్ట్ అన్నట్లు టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదే 500 వికెట్ల మైలురాయిని అందుకున్న తమిళనాడు ప్లేయర్ ఇప్పుడు తన రికార్డును మరింత మెరుగు పర్చుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ తొలి సెషన్ లోనే చకచకా వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియాను నిలబెట్టాడు.

లేటుగా వచ్చినా లేటెస్ట్

అశ్విన్ 2010లో టీమ్ ఇండియాలోకి వచ్చాడు. అప్పటికి అతడి వయసు 24. ప్రస్తుతం 38. ఇంకా రెండేళ్లు టెస్టుల ఆడే చాన్సుంది. అంటే 40 ఏళ్లు వచ్చేదాక కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత 40 ఏళ్ల వయసు వరకు ఆడిన రికార్డును అందుకుంటాడు. కాగా, న్యూజిలాండ్ తో రెండో టెస్టు తొలి సెషన్ లోనే అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈక్రమంలో ఓ ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (2023-25)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ గా అతడు రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్నాడు నాథన్ లయన్. ఆస్ట్రేలియాకు చెందిన లయన్ 187 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌ 188 వికెట్లు సాధించాడు. వీరి తర్వాత ఆస్ట్రేలియా పేసర్లు కెప్టెన్ పాట్ కమిన్స్ (175), మిచెల్ స్టార్క్‌ (147) ఉండడం గమనార్హం. కాగా, న్యూజిలాండ్ తో పుణెలో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ ప్రత్యర్థి కెప్టెన్, ఓపెనర్, టామ్‌ లేథమ్‌ (15)ను తొలుత ఔట్ చేశాడు. అద్భుతమైన బంతితో లేథమ్‌ ను అశ్విన్ ఎల్బీ చేశాడు. వన్ డౌన్ బ్యాటర్ విల్ యంగ్ (18) అశ్విన్‌ బౌలింగ్‌ లో కీపర్ పంత్‌ కు క్యాచ్‌ ఇచ్చాడు.

మళ్లీ లయన్ ను దాటేసి..

న్యూజిలాండ్ తో సిరీస్ ద్వారానే.. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో అత్యధిక వికెట్లు తీసిన లయన్ ను దాటేసిన అశ్విన్ మరో రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానానికి చేరాడు. యంగ్ వికెట్ అశ్విన్ కు టెస్టుల్లో 531వ వికెట్. ఈ వికెట్ ద్వారా అతడు.. లయన్ (530)ను దాటేశాడు. మొత్తంమీద 800 వికెట్లతో శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టాప్ లో అన్నాడు. దివంగగ షేన్ వార్న్ (719, ఆస్ట్రేలియా), జేమ్స్ అండర్సన్ (704, ఇంగ్లండ్), అనిల్ కుంబ్లే (619-భారత్), స్టువర్ట్ బ్రాడ్ (604-ఇంగ్లండ్), గ్లెన్ మెక్ గ్రాత్ (563-ఆస్ట్రేలియా) అశ్విన్ కంటే ముందన్నారు.

కుంబ్లేను దాటేస్తాడా?

టెస్టుల్లో అశ్విన్ ప్రస్తుతం కుంబ్లే కంటే 88 వికెట్ల వెనుక ఉన్నాడు. అయితే, రెండేళ్లయినా ఆడే చాన్సుండడంతో కుంబ్లేను అధిగమించి భారత అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని భావిస్తున్నారు. అయితే, న్యూజిలాండ్ తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో కనీసం మరో ఇన్నింగ్స్ లు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఆసీస్ సిరీస్ లో తుది జట్టులో చోటు కష్టమే. వచ్చే ఏడాది టీమ్ ఇండియా ఎన్ని టెస్టులు ఆడుతుంది? అనేదానిని బట్టి అశ్విన్ వికెట్ల రికార్డు ఆధారపడి ఉంది.

Tags:    

Similar News