348 రోజుల తర్వాత ప్రపంచ చాంపియన్ ను వర్షం ఓడించింది
గత ఏడాది నవంబరు 19న భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకున్న సంతతి తెలిసిందే.
ఒకటీ కాదు రెండు కాదు.. దాదాపు ఏడాది.. భారత్ నుంచి న్యూజిలాండ్ వరకు అనేకమంది ప్రత్యర్థులు.. కానీ ఒక్క సారీ ఓడిపోలేదు.. ఐర్లాండ్ వంటి పసి కూన, ఇంగ్లాండ్ వంటి గట్టి జట్టు వరకు దేనికీ తలొంచలేదు. కానీ, ఏదో తెలుగు సామెత చెప్పినట్లు.. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కుప్పకూలినట్లు జరిగింది.
14 వరుస విజయాల తర్వాత
గత ఏడాది నవంబరు 19న భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకున్న సంతతి తెలిసిందే. అది కూడా ఓటమి ఎరుగకుండా ఫైనల్ చేరిన భారత జట్టును ఓడించింది. దీంతో రోహిత్ శర్మ టీమ్ కు కల నెరవేరలేదు. వాస్తవానికి ఈ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా వరుసగా రెండు ఓటములు ఎదుర్కొంది. అవి కూడా రెండు స్టార్టింగ్ మ్యాచ్ లే. ఆ వెంటనే పుంజుకొని సెమీస్ కు చేరింది. అఫ్ఘానిస్థాన్ పై భారత అల్లుడు ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ అద్భుత, అజేయ డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఫైనల్లో అత్యంత కట్టుదిట్టంగా ఆడి భారత్ ను ఓడించింది. ఇక అప్పటినుంచి ఆ జట్టు వన్డేల్లో ఓటమి అనేది ఎరుగలేదు. వరుసగా 14 మ్యాచ్ లలో గెలిచింది.
వాన ఓడించింది
ఆస్ట్రేలియా ప్రస్తుతం ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ఆడుతోంది. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో తొలి రెండు వన్డేలను సునాయాసంగా గెలిచేసింది. బుధవారం రాత్రి జరిగిన మూడో వన్డేలోనూ మంచి స్కోరే (304) చేసింది. అయితే, ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతూ నాలుగు వికెట్లే కోల్పోయి 254 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం చూడగా అప్పటికి (37.4 ఓవర్లకు) ఆ జట్టు చేయాల్సింది 209 పరుగులే. దీంతో ఇంగ్లండ్ 45 పరుగుల తేడాతో గెలిచినట్లైంది.
మ్యాచ్ జరిగి ఉంటే..
ఒకవేళ వాన రాకుంటే ఆస్ట్రేలియాదే గెలుపా? అంటే అది చెప్పలేం. ఎందుకంటే ఇంగ్లండ్ మంచి దూకుడు మీద ఉంది. 37.4 ఓవర్లలో 254 పరుగులు చేసింది. చేతిలో ఆరు వికెట్లున్నాయి. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 94 బంతుల్లోనే 110 పరుగులు చేసి మాంచి జోరు మీద ఉన్నాడు. లివింగ్ స్టన్ వంటి బ్యాట్స్ మన్ 20 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. ఈ లెక్కన చూస్తే ఇంగ్లండ్ కే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ.. ఆస్ట్రేలియాను నమ్మలేం. మ్యాచ్ లో ఏ దశలో అయినా పుంజుకోగలదు. కానీ, వరుణుడు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. అలా.. 348 రోజుల తర్వాత వన్డేలో వరుణుడు ఓడించాడు.