టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ నయా చరిత్ర.. పాక్ కు ఘోర పరాభవం

పాకిస్థాన్ తో రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లా 2-0తో గెలిచింది.

Update: 2024-09-03 10:46 GMT

స్వదేశంలో ఎటుచూసినా అల్లర్లు.. జట్టంతా ఒకచోట చేరి కనీసం ప్రాక్టీస్ చేసుకుందామన్నా వీలు కాని పరిస్థితి.. కొందరు క్రికెటర్లు విదేశాల్లో ఆడుతున్నారు.. దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ పరారయ్యాడు.. ఆయన ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఎంపీగా ఉన్న స్టార్ క్రికెటర్ పై తీవ్ర విమర్శలు.. మరో ఎంపీ, మాజీ కెప్టెన్ ఇంటికి నిప్పు.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ దేశ క్రికెట్ జట్టు ఏం చేయగలుగుతుంది..? కానీ, ఆ జట్టు అద్భుతం చేసింది. చరిత్రకెక్కింది..

పాకిస్థాన్ ను పాకిస్థాన్ లో మట్టికరిపించి..

ఎంత చెత్త జట్టయినా.. స్వదేశంలో కాస్త బలంగానే ఉంటుంది. కానీ.. పాకిస్థాన్ మాత్రమే అత్యంత బలహీనంగా ఉంటుంది అని చెప్పాలేమో..? వాస్తవానికి పాకిస్థాన్ లో మంచి ఆటగాళ్లున్నారు. అయితే, అందరూ ఒకేసారి ఫామ్ కోల్పోయారు. అందులోనూ జట్టులో లుకలుకలు. ఇంకేం..? ఆ దేశ క్రికెట్ జట్టు అత్యంత అధ్వాన స్థితికి చేరింది. తాజాగా ముగిసిన టెస్టు సిరీస్ లో 0-2 తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. పాక్ కంటే బంగ్లా బలహీనమైన జట్టు. టెస్టుల్లో ఈ తేడా ఇంకా ఎక్కువ. పైగా బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో తీవ్ర అలర్లు, ప్రభుత్వం కూలిపోయి.. ప్రధాని పారిపోయిన సమయంలో పాకిస్థాన్ లో అడుగుపెట్టింది. స్టార్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్, మరో మాజీ కెప్టెన్ మొష్రఫె మొర్తజాలు అధికారం కోల్పోయిన అవామీ లీగ్ పార్టీ ఎంపీలు. వీరిపై ఆ దేశ ప్రజలు మండిపడుతున్నారు. దీంతోపాటు అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనలేకపోయింది. ఈ నేపథ్యంలో ముందుగానే పాకిస్థాన్ వెళ్లి ప్రాక్టీస్ చేసింది. ఇంతటి సంక్షోభంలో అడుగుపెట్టిన ఆ జట్టు ఏకంగా క్లీన్ స్వీప్ చేసింది.

మొన్న 10 వికెట్లు.. నేడు సిరీస్

పాకిస్థాన్ తో రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లా 2-0తో గెలిచింది. రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు తొలి టెస్టులో పాక్ ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది బంగ్లా. స్వదేశంలో పాకిస్థాన్ పై ఈ ఘనత సాధించిన తొలి జట్టు బంగ్లానే కావడం విశేషం. వాస్తవానికి తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 460 పైగా పరుగుల చేసిన పాక్.. 6 వికెట్లు మాత్రమే కోల్పోయింది. అప్పటికి స్టార్ బ్యాటర్ రిజ్వాన్ 170 ప్లస్ నాటౌట్ గా ఉన్నాడు. కానీ, గొప్పలకు పోయి డిక్లేర్ చేసింది. బంగ్లా కూడా కాస్త ఇబ్బంది పడినా ముష్ఫికుర్ రహీమ్ (191) వీరోచిత ఇన్నింగ్స్ తో గాడిన పడింది. ఆపై పాక్ ను రెండో ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసింది. రెండో టెస్టులో పాక్ మొదటినుంచే తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 274 పరుగులే చేసింది. రెండో ఇన్నింగ్స్ లో మరీ పేలవంగా 172కే ఆలౌటైంది. 185 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పయి ఛేదించింది. దీంతో 2-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

కొసమెరుపు: 25 ఏళ్లుగా టెస్టు క్రికెట్ ఆడుతున్న బంగ్లాదేశ్ ఇప్పటివరకు పాకిస్థాన్ పై గెలిచింది రెండు టెస్టులే. ఆ రెండూ కూడా ఇవే.

Tags:    

Similar News