భారత క్రికెట్లో అత్యద్భుతం.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్.. విశేషాలేవి
బెంగళూరులో 2000లో మొదలైంది నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ). ప్రసిద్ధిగాంచిన చిన్నస్వామి స్టేడియం ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేశారు.
40 ఎకరాల విస్తీర్ణం.. ప్రాక్టీస్ కోసం 45 ఔట్ డోర్ నెట్ పిచ్ లు.. 13 పిచ్ లు ముంబై ఎర్ర మట్టితో.. 11 పిచ్ లు మాండ్యా మట్టితో.. 9 పిచ్ లు ఒడిషాలోని కలహండి నల్ల మట్టితో.. ఎంత వర్షం పడినా నీరంతా త్వరగా పోయేలా డ్రైనేజీ.. ఇదేదో ఒక దేశం మొత్తంలోని వసతులు కాదు.. కేవలం ఒకే ఒక సెంటర్ లోని ఏర్పాట్లు.. అత్యద్భుతం అనదగ్గ ఇలాంటిది ఎక్కడ సాధ్యమైందో తెలుసా?
పేరు మారింది.. అహో అనదగ్గట్లుగా..
బెంగళూరులో 2000లో మొదలైంది నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ). ప్రసిద్ధిగాంచిన చిన్నస్వామి స్టేడియం ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేశారు. భారత ఆటగాళ్లు ఎవరు గాయాలపాలైనా.. కొత్త ప్రతిభను మరింత సానబెట్టాలన్నా.. ఇంతకాలం ఇక్కడకే పంపేవారు. అలాంటి ఎన్‌సీఏ ఇప్పుడు రూపు పూర్తిగా మార్చకుంది. అత్యాధునిక వసతులతో ఈ తరం క్రికెట్ అవసరాల కోసం దీనిని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (బీసీఈ)గా మార్చారు. బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో 40 ఎకరాల్లో ఉందింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా శనివారం దీనిని ప్రారంభించారు.
మూడు స్టేడియాలతో..
బీసీఈలో మొత్తం మూడు స్టేడియాలు ఉన్నాయి. ఇక పిచ్ లను ఎర్ర మట్టి, నల్ల మట్టితో రూపొందించారు. ఐసీసీ స్టాండర్స్ కు తగ్గట్లు, దేశవాళీ మ్యాచ్ లు కూడా నిర్వహించేలా వీటిని తయారు చేశారు. అంతేకాదు.. విదేశాల్లో టీమ్ ఇండియా విజయాలు సాధించేలా.. అక్కడి పిచ్ లకు అలవాటు పడేందుకు బీసీఈ పిచ్ లను సిద్ధం చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ లలో పిచ్ లు పేస్, బౌన్స్, స్వింగ్ లతో ఉంటాయి. వీటికి స్వదేశంలోనే అలవాటు పడేలా బీసీఈ పిచ్ లను తయారు చేశారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో మన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేయనున్నారు.
యువ క్రికెటర్ల కోసం..
బీసీఈలో యువ క్రికెటర్లకు ప్రపంచ స్థాయి శిక్షణ అందనుంది. టాలెంట్ ను మెరుగుపర్చుకునేలా సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి ఫ్లడ్ లైట్లతో కూడినప్రధాన స్టేడియంలోని 13 పిచ్ లను ముంబై ఎర్రమట్టితో తయారు చేశారు. ఎంత వర్షం పడినా నీరు నిలవకుండా ఉండేలా డ్రైనేజీ సిస్టమ్ ఉంది. మరో రెండు మైదానాలను ప్రాక్టీస్ కోసం ఉపయోగించనున్నారు. ఇందులో 11 పిచ్ లను కర్ణాటక మాండ్యా మట్టితో, 9 పిచ్ లను ఒడిశాలోని కలహండీ నల్ల మట్టితో సిద్ధం చేశారు.
ప్రాక్టీస్ కు 45 నెట్ పిచ్ లు
ఒకట రెండు కాదు.. కుర్రాళ్లు, ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం బీసీఈలో 45 ఔట్ డోర్ నెట్ పిచ్ లున్నాయి. ఫీల్డింగ్ ప్రాక్టీస్ కే ప్రత్యేక ప్రదేశం ఉంది. ఆరు ఔట్ డోర్ రన్నింగ్ సింథటిక్ ట్రాక్ లతో పాటు.. ఇండోర్ ప్రాక్టీస్ కు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా నుంచి టర్ఫ్ లు తెప్పించడం విశేషం. ఇవే కాదు.. బీసీఈలో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ ల్యాబ్, జిమ్ లను చూస్తే కళ్లు చెదరలాల్సిందే. బీసీఈని భవిష్యత్ లో ఒలింపిక్ అథ్లెట్లూ వాడుకోవచ్చు.
మన హైదరాబాదీనే చీఫ్
ఎన్సీఏకు 2021 నుంచి హైదరాబాదీ స్టయిలిష్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ గా ఉన్నాడు. బీసీఈకీ లక్ష్మణ్ చీఫ్ గా వ్యవహరించనున్నాడు. భారత ఆటగాళ్ల నైపుణ్యాలు మరింత మెరుగయ్యేలా బీసీఈలోని ప్రపంచ స్థాయి సౌకర్యాలు తోడ్పడతాయని చెప్పాడు. భవిష్యత్ ఆటగాళ్లే కాదు ప్రస్తుత క్రికెటర్లూ లబ్ధి పొందుతారని చెప్పాడు. వచ్చే సిరీస్ ల సవాళ్లకు సన్నద్ధం కావొచ్చన్నాడు. బీసీఈతో ఆటగాళ్లందరి కల నిజమైందన్నాడు.