ఇండియన్ (మనీ) ప్రీమియర్ లీగ్.. బీసీసీఐకి ‘డబ్బుల్’ బొనాంజా

ఏ ముహూర్తాన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్టార్టయిందో కానీ.. అప్పటినుంచి ప్రపంచ క్రికెట్ లో భారత ఆధిపత్యానికి ఎదురులేకుండా పోయింది.

Update: 2024-08-20 17:30 GMT

ఏ ముహూర్తాన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్టార్టయిందో కానీ.. అప్పటినుంచి ప్రపంచ క్రికెట్ లో భారత ఆధిపత్యానికి ఎదురులేకుండా పోయింది. అంతకుముందు వరకు ప్రపంచ క్రికెట్ పై ఇంగ్లండ్, ఆస్ట్రేలియాదే పెత్తనం. వారి అహంకారాన్ని.. పొగరును భరించాల్సి వచ్చేది. మైదానంలో ఆటగాళ్లే కాదు.. వ్యాఖ్యాతలు కూడా దీనికితగ్గట్లే ఉండేవారు. కానీ, ఐపీఎల్ వచ్చాక కథంతా మారిపోయింది. ఇంగ్లిష్ వాళ్లు కనుక్కున్న క్రికెట్ ను ఇంగ్లిష్ వాళ్లే టి20లుగా మార్చారు. అలాంటి ఇంగ్లిష్ వాళ్లు ఏలే రోజుల నుంచి.. భారత్ ఆధిప్యతం చెలాయించే రోజులు వచ్చాయి. ఇక ఐపీఎల్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డగా మార్చేసింది. ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు కూడా బోర్డు ప్రతిష్ఠను నిలిపేలా అత్యున్నతంగా ఎదిగింది.

క్యాష్ రిచ్ లీగ్..

కరీబియన్ దీవుల నుంచి బంగ్లాదేశ్ వరకు ఎన్నో టి20 లీగ్ లు ఉండొచ్చు.. ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్ వరకు లీగ్ లు జరుగుతుండొచ్చు.. కానీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఇవేవీ సాటిరావు. ప్రేక్షకాదరణ, ఆదాయం, క్రికెట్ ప్రమాణాలు, టీవీ, ఓటీటీ వ్యూయర్ షిప్.. వేటిలోనూ ఐపీఎల్ కు దగ్గరగా ఉన్న లీగ్ లు కూడా లేవంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఐపీఎల్ రూ.లక్ష కోట్ల విలువైన లీగ్ కాబట్టి. కాగా, ఐపీఎల్ ద్వారా వచ్చే సొమ్ముతో బీసీసీఐకి మిగులులో భారీగా కలిసి వచ్చింది. 2022 సీజన్‌ తో పోలిస్తే 2023 ఎడిషన్‌ ‘మిగులు సంపాదన’లో 116 శాతం పెరుగుదల నమోదైంది. ఐపీఎల్ 2022లో రూ.2,367 కోట్లు కాగా.. తర్వాతి సంవత్సరానికి రూ.5,120 కోట్లకు చేరింది. 2023 ఎడిషన్‌ ఆదాయం రూ.11,769 కోట్లు. అంటే.. ఏడాదిలో 78 శాతం ఎక్కువ కావడం గమనార్హం. కాగా ఖర్చులు కూడా 66 శాతం పెరిగి రూ.6,648 కోట్లకు చేరడం చెప్పుకోదగ్గ అంశం.

లీగ్ ప్రసార హక్కులతోనే కోట్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల వేలం సందర్భంగా ఎలాంటి పోటీ ఉంటుందో అందరూ చూశారు. ఇక స్పాన్సర్ షిప్ ఒప్పందాల గురించి చెప్పాల్సిన పనే లేదు. వీటి కారణంగానే భారీగా మిగులు కనిపించింది. 2023-27 ఐదేళ్ల వ్యవధికి గాను మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి ఇప్పటికే రూ.48,390 కోట్లు వచ్చాయి. ఐపీఎల్ టీవీ హక్కులను స్టార్‌ స్పోర్ట్స్ దక్కించుకుంది. దీని ద్వారా రూ.23,575 కోట్లు, డిజిటల్ ప్లాట్‌ ఫాం (జియో సినిమా)తో రూ.23,758 కోట్లు వచ్చాయి. కాగా, ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ హక్కులను టాటా సన్స్ రూ.2,500 కోట్లకు పొందింది.

ఐపీఎల్ 2025 సీజన్ కు ముందుగా మెగా వేలం జరగనుంది. ఆటగాళ్ల రిటెన్షన్ నిబంధనపై స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రాంచైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని చూస్తూ.. బీసీసీఐకి ప్రతిపాదించాయి.

Tags:    

Similar News