టీమిండియా రూ.125 కోట్ల వరల్డ్ కప్ ప్రైజ్ మనీలో ఏ ఆటగాళ్లకు ఎంతెంత ఇస్తారంటే..

భారత జట్టు 17 ఏళ్ల తర్వాత టి20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. 2011 తర్వాత ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.

Update: 2024-07-08 16:30 GMT

భారత జట్టు 17 ఏళ్ల తర్వాత టి20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. 2011 తర్వాత ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. 2013 అనంతరం తొలి ఐసీసీ ట్రోఫీ అందుకుంది. దీంతోనే దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. లక్షలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి అద్భుత విజయాన్ని ఆస్వాదించారు. దీంతోనే బీసీసీఐ కూడా భారత జట్టుకు రూ.125 కోట్ల భారీ నగదు నజరానా ప్రకటించింది. వాస్తవానికి ప్రపంచ కప్ విజేత ప్రైజ్ మనీ రూ.25 కోట్లే. అంతకు ఐదు రెట్లు నజరానా దక్కింది. ఇది ఏమాత్రం ఊహించని మొత్తం కావడం గమనార్హం.

ఎవరికి ఎంత?

టీమిండియా జూన్ 29న జరిగిన ఫైనల్లో అద్భుత విజయం సాధించింది. అయితే, బార్బడోస్ లో వాతావరణం సరిగా లేకపోవడంతో గురువారం తెల్లవారుజామున కానీ భారత్ చేరుకోలేకపోయింది. అనంతరం ముంబైలో భారీ ర్యాలీగా వాంఖడే స్టేడియానికి వెళ్లింది. అక్కడ జట్టుకు రూ.125 కోట్ల నగదు నజరానా చెక్కును బీసీసీఐ కార్యదర్శి జై షా అందించారు. మరి ఈ మొత్తాన్ని ఎలా కేటాయిస్తారు? అని సాధారణ అభిమానికి పెద్ద అనుమానమే వచ్చింది. కాగా, ప్రపంచకప్‌లో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, రిజర్వ్‌ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మొత్తం 42 మంది పాల్గొన్నారు. వీరిలో 15 మంది జట్టు సభ్యులు. ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్, 15 మంది ఆటగాళ్లు రూ.5 కోట్లు చొప్పున అందుకోనున్నారు.

ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే..

ప్రపంచ కప్ జట్టులో ఉన్నప్పటికీ.. ఒక్క మ్యాచ్ లోనూ అవకాశం రాని ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ , స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కు కూడా రూ.5 కోట్లు దక్కనున్నాయి. జట్టు కూర్పు రీత్యా వీరికి చాన్స్ ఇవ్వని సంగతి తెలిసిందే. కాగా, ట్రావెల్ రిజర్వ్‌ ఆటగాళ్లుగా రింకూ సింగ్, శుభ్‌ మన్ గిల్, అవేశ్‌ ఖాన్‌, ఖలీల్ అహ్మద్‌ లను తీసుకెళ్లారు. వీరూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా రూ.కోటి చొప్పున అందజేయనున్నారు.

చీఫ్ సెలక్టర్, కోచింగ్ స్టాఫ్ కు కూడా..

భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్‌ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే లకు రూ.2.5 కోట్లు ఇవ్వనున్నారు. అంతేకాదు.. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌, సెలక్షన్ కమిటీ సభ్యులకు రూ.కోటి చొప్పున ఇవ్వనున్నారు. సహాయక సిబ్బందిలో ఉన్న ముగ్గురు ఫిజియోథెరపిస్టులు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌ లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు అందజేస్తారు.

Tags:    

Similar News