15 కోట్ల మోసం కేసు.. ధోనీకి బీసీసీఐ అల్టిమేటం.. 20 రోజులే గడువు
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పెద్దల మాట.. కాస్త సంపాదన ఉండగానే దానిని ఇతర చోట్ల పెట్టుబడి పెట్టాలనేది దీని అర్ధం.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పెద్దల మాట.. కాస్త సంపాదన ఉండగానే దానిని ఇతర చోట్ల పెట్టుబడి పెట్టాలనేది దీని అర్ధం. ఇక భారత క్రికెటర్లు ఈ విషయంలో చాలా ముందుచూపుతోనే ఉన్నారని తెలుస్తుంది. ఓవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా వచ్చిపడే కోట్లకు కోట్లు డబ్బు.. మరోవైపు బీసీసీఐ ఏటా కాంట్రాక్టుల ద్వారా ఇచ్చే డబ్బు.. ఇంకోవైపు అడ్వర్టయిజ్ మెంట్ల ద్వారా వచ్చే రూ.పదుల కోట్లు.. ఏదైనా టోర్నమెంటు గెలిస్తే అదనంగా ఇంకా కోట్లకు కోట్లు.. ఇలా వచ్చి పడే మొత్తాన్ని భారత క్రికెటర్లు వివిధ రూపాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఓ దిగ్గజ క్రికెటర్ అయితే ఏపీలోని నెల్లూరు జిల్లాలో భూములు కొన్నాడు. మరికొందరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టారు.
అకాడమీ పెట్టబోయి..
భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన ధోనీ.. ఓ దశలో సంపాదనలో అందరికంటే ముందున్నాడు. రెండు ప్రపంచ కప్ లు (టి20, వన్డే) అందించిన సమయంలో అతడే సూపర్ స్టార్. ఇక ధోనీకి ఏటా సంపాదన రూ.వందకోట్ల వరకు ఉండొచ్చని చెప్పేవారు. మొత్తం మీద వెయ్యికోట్ల పైనే సంపాదించాడని చెబుతారు. అయితే, ధోనీ తెలివైన క్రికెటరే కాదు.. పెట్టుబడిదారు కూడా. ఈ క్రమంలో అతడు ప్రచారకర్తగా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవహారం ఆ మధ్య కలకలం రేపింది. ఇప్పుడు క్రికెట్ అకాడమీ విషయమై వివాదం బయటకు వచ్చింది. ధోనీపై ఏకంగా రూ.15 కోట్లకు మోసం (చీటింగ్) కేసు నమోదైంది.
క్రికెట్ అకాడమీ నెలకొల్పే విషయంలో ధోనీ తనను మోసం చేశాడంటూ ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజేశ్ కుమార్ మౌర్య ఫిర్యాదు చేశాడు. అయితే, ఇదే అంశంలో ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమానులైన మిహిర్, సౌమ్యా దాస్ గతంలో తనను మోసం చేశారని ధోనీ కేసు పెట్టాడు. అయితే, ఈ వ్యవహారంలో ధోనీనే తనను చీట్ చేశారంటూ ఆర్కాలో మరో భాగస్వామి రాజేశ్ ఆరోపిస్తున్నాడు. కేసు పెట్టిన నేపథ్యంలో ఈనెల 30లోగా స్పందించాలంటూ బీసీసీఐ ఎథిక్స్ కమిటీ మాజీ కెప్టెన్ ధోనీని కోరింది. కాగా, రాజేశ్ కుమార్ ది యూపీలోని అమేఠీ. ఇతడు నేరుగా బీసీసీఐకే ఫిర్యాదు చేశాడు. దీంతో ఎథిక్స్ కమిటీ రూల్- 36 కింద ఫిర్యాదు తీసుకుని ఆగస్టు 30లోగా వివరణ కోరింది.
మూడేళ్ల కిందట ఒప్పందం
రాజేశ్ చెబుతున్న అకాడమీని ధోనీ పేరుతోనే నెలకొల్పాలని అనుకున్నారు. ఈ మేరకు ఆర్కా స్పోర్ట్స్ 2021లో ధోనీతో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన డబ్బును ఆర్కా సంస్థ చెల్లించలేదని ధోనీ రాంచీ సివిల్ కోర్టుకెళ్లాడు. రూ.15 కోట్ల తనకు ఎగ్గొట్టారని.. ఆర్కా స్పోర్ట్స్ యజమాని సౌమ్యా దాస్ పై ధోనీ కేసు పెట్టాడు. ఇది ఇంకా విచారణలో ఉంది. ఇప్పుడు ఫిర్యాదు చేసిన రాజేశ్ కుమార్ ది కూడా ఈ సంస్థనే. దీన్నిబట్టి ఆర్కా స్పోర్ట్స్-ధోనీ మధ్యన పెద్ద వివాదమే జరిగేలా ఉంది.
బీసీసీఐ నోటీసు ఎందుకు?
ధోనీ 2019లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. దీంతోనే బీసీసీఐ అతడికి నోటీసులిచ్చింది. మరోవైపు ధోనీ.. బీసీసీఐ కాంట్రాక్టుల్లో లేకున్నా.. మాజీ కెప్టెన్, ఆటగాడిగా పింఛను ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఆ లెక్కన బీసీసీఐతో సంబంధం తెంచుకోలేనేది. భవిష్యత్ లో కోచ్, చీఫ్ సెలక్టర్, బీసీసీఐ చీఫ్ ఏది కావాలన్నా ఎలాంటి ఇబ్బందీ ఉండకూడదు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడడంపై సందిగ్ధత నెలకొంది. ఈ ఏడాదే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకొన్నాడు. చెన్నై వచ్చే సీజన్ కు ధోనీని.. అన్ క్యాప్‌డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకోవాలని చూస్తోంది. ధోనీ మాత్రం.. మెగా వేలం నిబంధనలు వచ్చాక నిర్ణయాన్ని ప్రకటించాలని భావిస్తున్నాడు.