13 ఏళ్లకే గొప్ప బైక్ రైసర్.. ఘోర ప్రమాదంతో దుర్మరణం

అతడి వయసు 13 ఏళ్లే.. మొన్ననే పుట్టిన రోజు జరుపుకొన్నాడు. దీనికి కొద్దినెలల ముందే గొప్ప ఘనతను సాధించాడు.

Update: 2023-08-06 11:01 GMT

అతడి వయసు 13 ఏళ్లే.. మొన్ననే పుట్టిన రోజు జరుపుకొన్నాడు. దీనికి కొద్దినెలల ముందే గొప్ప ఘనతను సాధించాడు. మరెంతో గొప్ప భవిష్యత్ ఉన్నవాడిగా కనిపించాడు. కానీ బ్యాడ్ లక్ అంతడిని ‘‘రేస్ బైక్ వేగంతో’’ వెంటాడింది. అనూహ్యంగా జరిగిన ఘోర ప్రమాదంతో ప్రాణాలు తోడేసింది. ఇదంతా బైక్ రేసర్ శ్రేయాస్ హరీష్ గురించి. రేసింగ్ వర్గాల్లో ఎంతో సంచలనం రేపిన శ్రేయాస్ అకాల మరణం అందరినీ హతాశులను చేసింది. ఎన్నో ట్రాక్ లపై విజయవంతంగా రేసుల్లో పాల్గొన్న అతడు.. అదే తరహా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఇంతకూ ఎవరీ శ్రేయాస్ అంటే..

పదేళ్ల వయసుకు మనలో చాలామంది మామూలు బైక్ ను కూడా పట్టుకుని ఉండం. కానీ, అతడు పిల్లాడుగా ఉన్నప్పుడే ఆ పనిచేశాడు. 13 ఏళ్లకే బైక్ రైసర్ అయ్యాడు. అంతేకాదు.. టూ వీలర్ రేసింగ్ ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరిన తొలి భారతీయుడిగా అరుదైన ఘనతను సాధించాడు. ఈ చాంపియన్ షిప్ జరిగింది కూడా స్పెయిన్ లో కావడం గమనార్హం. ఇక శ్రేయాస్ బైక్ రేసర్ గా ఎన్నో ఘనతలను సాధించడం ఖాయమని అందరూ అనుకుంటుండగా జరిగిందో ఘోరం.

ఎక్కడో గెలిచి.. సొంతగడ్డపై తనువు చాలించి..

కొప్పారం శ్రేయాస్ ది బెంగళూరు. మే 26న 13వ ఏట అడుగుపెట్టాడు. విదేశాల్లో జరిగిన బైక్ రేసింగ్ లలో సత్తా చాటిన అతడు స్వదేశంలో సొంత గడ్డపై జరిగిన రేసింగ్ లో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోవడం విధి విచిత్రం. కాగా, శనివారం చెన్నైలో జరిగిన నేషనల్ మోటార్ రేసింగ్ చాంపియన్ షిప్ ట్రాక్ పై జరిగిన ప్రమాదంలో చనిపోయాడు.

ది బెంగళూరు కిడ్..

శ్రేయాస్ ను అందరూ ద బెంగళూరు కిడ్ గా పిలుస్తుంటారు. 200 సీసీ మోటార్ బైక్ రైడింగ్ చేస్తుండగా పట్టు తప్పడంతో ప్రాణాలు కోల్పోయాడు. హెల్మెట్ ధరించినా మూడో రౌండ్ లో ఉండగా పడిపోయింది. అయితే ఇక్కడే అతడిని మరింత బ్యాడ్ లక్ వెంటాడింది. శ్రేయాస్ వెనుక ఉన్న రేసర్ వేగాన్ని నియంత్రించకలేపోయాడు. శ్రేయాస్ ను ఢీకొట్టాడు. దీంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా శ్రేయాస్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ తీవ్ర విషాద ఘటనతో రేసులన్నిటినీ నిలిపివేశారు. కేవలం వారం కిందట తన 13వ పుట్టిన రోజును ఎంతో ఘనంగా జరుపుకున్న శ్రేయాస్ అంతలోనే అందరికీ దూరమయ్యాడు. బైక్ మీద అత్యద్భుత నియంత్రణ ఉన్నవాడిగా అతడిని అందరూ గుర్తిస్తారు. కాగా, శ్రేయాస్ ఎఫ్ఐఎం మినీ-జీపీ ఇండియాతో కెరీర్ మొదలుపెట్టాడు. నిరుడు ఈ చాంపియన్ షిప్ ను గెలిచాడు కూడా. జాతీయ చాంపియన్ షిప్ లోనూ పాల్గొన్నాడు. రెండుసార్లు పోడియం ఫినిష్ లో నిలిచాడు. దేశంలో అద్భుత ప్రతిభ ఉన్న రేసర్ గా నిపుణులు అతడిని గుర్తించారు. జాతీయ చాంపియన్ షిప్, మరో రెండు టోర్నీల్లో పోడియం ఫినిష్ అందుకోవడంతో టీవీఎస్ సంస్థ అతడికి శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రేస్ లలో పాల్గొనేందుకు ఓ టీవీఎస్ బైక్ నూ అందించింది. కానీ విధి మాత్రం మరోలా తలచింది.

Tags:    

Similar News