రెండు చేతులతో బౌలింగ్‌ ఐసీసీ ఆర్టికల్‌ 21.1.1 రూల్ ఏమి చెబుతుంది?

ఈ సమయంలో... శ్రీలంక బౌలర్ కమిందు మెండీస్ బౌలింగ్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-07-28 06:34 GMT

శ్రీలంకలో జరుగుతున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లో భారత్ శుభారంభం చేసింది. ఇందులో భాగంగా... తొలి మ్యాచ్ లో శ్రీలంకపై 43 పరుగుల తేడాతో టీంఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 213 పరుగుల స్కోరు చేయగా.. లక్ష్య చేధనలో శ్రీలంక 170 పరుగులకే పరిమితమైంది. ఈ సమయంలో... శ్రీలంక బౌలర్ కమిందు మెండీస్ బౌలింగ్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు అదరగొట్టడంతో పాటు.. మొదట్లో కాస్త తడబడినా, తర్వాత పుంజుకున్న బౌలర్ల పెర్ఫార్మెన్స్ తో శుభారంభం దక్కింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. ఇదే సమయంలో... రిషబ్ పంత్ (33 బంతుల్లో 49), యశస్వీ జైస్వాల్ (21 బంతుల్లో 40), శుభ్ మన్ గిల్ (16 బంతుల్లో 34) ఆకట్టుకున్నారు.

అనంతరం ఓపెనర్లు నిశాంక (48 బంతుల్లో 79), కుశాల్ మెండిస్ (27 బంతుల్లో 45) మెరుపులతో మొదలుపెట్టగా లంకకు విజయావకాశాలు ఉన్నాయనే చర్చ మొదలైంది. అయితే... భారత్ బౌలర్లు మొదట్లో కాస్త తడబడినా.. తర్వాత పుంజుకున్నారు. ఇందులో భాగంగా... అక్షర్ రియాన్ పరాగ్ (3/5), పటేల్ (2/38), అర్ష్ దీప్ (2/24) సత్తా చాటారు. అయితే వీరందరికంటే ఎక్కువగా... శ్రీలంక బౌలర్ కమిందు మెండీస్ హాట్ టాపిక్ గా మారాడు.

అవును... ఒకే ఓవర్లో రెండు చేతులతోనూ బౌలింగ్ చేస్తూ శ్రీలంక బౌలర్ కమిందు మెండీస్ షాకిచ్చాడు! ఇందులో భాగంగా 10వ ఓవర్ లో బంతిని అందుకున్న కమిందు.. సూర్య కుమార్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేయగా.. రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రైట్ ఆర్మ్ బౌలింగ్ చేశాడు. దీంతో... ఒకే ఓవర్ లో రెండు చేతులతోనూ బౌలింగ్ చేసినట్లయ్యింది. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఐసీసీ రూల్స్ ఏమి చెబుతున్నాయి?:

ఐసీసీ ఆర్టికల్ 21.1.1. రూల్ ప్రకారం ఏ బౌలర్ అయినా బౌలింగ్ వేసే ముందు తన శైలి ఏమిటనేది అంపైర్ కు తెలియజేయాలి. ఏ బంతితో అయినా అతడు బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది కానీ... అంపైర్ కు మాత్రం ముందే చెప్పాలి. ఇదే సమయంలో... స్టంప్ కు ఎటువైపు నుంచి వేస్తున్నది కూడా తెలియపరచాలి. అప్పుడు ఎంపైర్ ఆ విషయాన్ని బ్యాటర్ కు తెలియజేస్తాడు.

అలా కాకుండా.. బౌలర్ తన బౌలింగ్ శైలిని మార్చుకొన్న విషయాన్ని అంపైర్ కు చెప్పకుండా బంతిని వేస్తే మాత్రం దానిని "నో బాల్"గా ప్రకటిస్తారు. అయితే... శనివారం భారత్ - శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో కమిందు మెండీస్ తన నిర్ణయాన్ని అంపైర్ కు తెలిపాడు. అందుకే దాన్నిసరైన బంతిగానే ప్రకటించారు అంపైర్. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.



Tags:    

Similar News