టెస్టు చాంపియన్ షిప్ రేస్ నుంచి టీమ్ ఇండియా ఔట్..ఆ 2 జట్లే ఫైనల్ కు

ఇక మిగిలింది ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్. అసలు సిసలు క్రికెట్ అయిన సంప్రదాయ ఫార్మాట్ లో విజేతగా నిలిస్తే ఆ మజానే వేరు.

Update: 2024-12-30 09:36 GMT

వన్డేల్లో చాంపియన్ గా నిలిచి 14 ఏళ్లు అవుతోంది.. మరో మూడేళ్ల వరకు ప్రపంచ కప్ లేదు.

టి20ల్లో ప్రపంచ విజేత అయినా.. పొట్టి ఫార్మాట్ కాబట్టి అది పెద్దగా లెక్క లోకి రాదు.

ఇక మిగిలింది ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్. అసలు సిసలు క్రికెట్ అయిన సంప్రదాయ ఫార్మాట్ లో విజేతగా నిలిస్తే ఆ మజానే వేరు.

ఇప్పటికే రెండుసార్లు దీనిని సాధించే దిశగా చివరి వరకు పోరాడింది టీమ్ ఇండియా. కానీ, ఫైనల్స్ లో ఓసారి న్యూజిలాండ్, మరోసారి ఆస్ట్రేలియా దెబ్బకొట్టాయి.

ఈసారి మాత్రం ఆ అవకాశమే లేకుండా పోయింది. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) రేస్ నుంచి టీమ్ ఇండియా దాదాపు ఔట్.. టెక్నికల్ గా మాత్రమే మన జట్టు పోటీలో ఉంది.

ఆ 2 జట్లే ఫైనల్ కు?

దురదృష్టానికి మారు పేరుగా నిలిచే దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కు చేరింది. మిగిలింది రెండో ప్రత్యర్థి ఎవరనేదే? అది ఆస్ట్రేలియానా? టీమ్‌ ఇండియానా? అనేది తేలాల్సి ఉంది. కానీ, భారత జట్టు ఆశలు ఆవిరవుతున్నాయి. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా మెల్ బోర్న్ లో జరిగిన నాలుగో టెస్టులో ఓడడంతో భారత్ ఫైనల్‌ చేరడం సంకిష్టంగా మారింది.

పాకిస్థాన్‌ తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో నెగ్గడంతో డబ్ల్యూటీసీ సైకిల్ లో ఆ జట్టు 66.67 శాతం పాయింట్లతో టాప్ నిలిచి ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. సోమవారం భారత్ పై విజయంతో ఆస్ట్రేలియాకు ఫైనల్‌ చేరేందుకు అవకాశాలు బాగా మెరుగయ్యాయి. ఆసీస్ 61.46 పర్సంటేజీతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

బీజీటీలో చివరి, ఐదో టెస్టు మాత్రమే భారత్ ఆడాల్సి ఉన్న మ్యాచ్‌. బాక్సింగ్‌ డే టెస్టులో ఓటమితో మన జట్టు 52.78 శాతంతో మూడో స్థానానికి పడిపోయింది. చివరి టెస్టులో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరడం కష్టమే.

ఆస్ట్రేలియాను లంక ఓడిస్తే..

రెండు టెస్టుల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జనవరి-ఫిబ్రవరిలో శ్రీలంకలో పర్యటించనుంది. ఒకవేళ లంక 2-0తో గెలిస్తే భారత్ కు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి. ఆస్ట్రేలియాపై భారత్‌ చివరి టెస్టులో గెలిస్తే పర్సంటేజీ 55.26కి చేరుతుంది. ఇక ఆస్ట్రేలియా 0-2తో శ్రీలంక చేతిలో ఓడితే 53.51 శాతానికే పరిమితం అవుతుంది. రెండు మ్యాచ్‌లు డ్రా అయితే.. అప్పుడు మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ కు వెళ్తుంది.

ఓడితే ఇక అంతే..

బీజీటీలో చివరి టెస్టులో భారత్‌ గెలిచినా.. శ్రీలంకపై ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌ లో విజయం సాధించినా పరిస్థితులు మారుతాయి. టీమ్‌ ఇండియా ఫైనల్ అవకాశాలు గల్లంతే. బీజీటీలోని చివరి టెస్టులోనూ ఆస్ట్రేలియాపై భారత్‌ ఓడితే, లేదా మ్యాచ్ డ్రా అయినా.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే.

Tags:    

Similar News