మాటామాటా.. టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో డిష్యుం డిష్యుం
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సిరీస్ లోని చివరి, ఐదో టెస్టు ఆడడం లేదనే వార్తలు వస్తున్నాయి.
ఏదైనా సిరీస్ లేదా టోర్నమెంట్ సవ్యంగా సాగిపోతున్నప్పుడు లోపాలు కనిపించవు. ఆటగాళ్ల వైఫల్యాలూ చర్చకు రావు.. కానీ, ఎప్పుడైతే ఓటములు పలకరించాయో.. అప్పట్నుంచే విమర్శలు వస్తుంటాయి. తాజాగా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో టీమ్ ఇండియా వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడడం.. కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా విఫలం అవుతుండడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సిరీస్ లోని చివరి, ఐదో టెస్టు ఆడడం లేదనే వార్తలు వస్తున్నాయి. కాగా, దీనికిముందు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగిందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రోహిత్ కాదు గంభీర్
సాధారణంగా మ్యాచ్ కు ముందు మీడియా ప్రెస్ మీట్ కు జట్టు కెప్టెన్ వస్తాడు. కానీ, సిడ్నీ (చివరి) టెస్టుకు ముందు హెడ్ కోచ్ గంభీర్ ప్రెస్ మీట్ కు హాజరయ్యాడు. దీనిపై ప్రశ్నించగా.. ఎవరు పాల్గొన్నా ఒకటే అన్నట్లుగా గంభీర్ మాట్లాడాడు. గంభీర్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి.
మెల్ బోర్న్ లో జరిగిన నాలుగో టెస్టులో ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో చర్చలు వేడెక్కాయని, కెప్టెన్ రోహిత్ శర్మ, గంభీర్ మధ్య వాడివేడి వాగ్వాదం జరిగిందనే కథనాలు వచ్చాయి. దీనిపై మీడియా ప్రశ్నించగా అవన్నీ వదంతులేనని గంభీర్ ఖండించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగే చర్చలు జట్టులోని ఆటగాళ్ల పనితీరుపైనే ఉంటాయని, ఏం మాట్లాడుకున్నదీ బయటకు రావడం సరికాదని గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఐదో టెస్టులో రోహిత్ ఆడతాడా ? అన్నదానిపైనా గంభీర్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. తుది జట్టు ఎంపిక అనేది మ్యాచ్ ప్రారంభానికి ముందు పిచ్ పరిస్థితులను బట్టి ఉంటుందన్నాడు.
గంభీర్ మొదటి చాయిస్ కాదా?
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ మొదటి చాయిస్ కాదనే వాదన కొత్తగా బయటకు వచ్చింది. హైదరాబాదీ స్టయిలిష్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను తొలుత కోచ్ ను చేయాలని భావించారు. కానీ, గంభీర్ వైపు మొగ్గారు. అయితే, తాజాగా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ, చాంపియన్స్ ట్రోఫీల్లోనూ టీమ్ ఇండియా విఫలమైతే గంభీర్ కు డేంజర్ బెల్స్ మోగినట్లే. అతడిని టి20 కోచ్ గానే పరిమితం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.