ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్... హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏమి చెబుతున్నాయి?

ఈ క్రమంలో ఇటీవల అహ్మదాబాద్‌ లో గుజరాత్ టైటాన్స్‌ తో ఆడిన మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు

Update: 2024-04-20 04:09 GMT

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మ్యాచ్ నెంబర్ 35 ఢిల్లీ క్యాపిటల్స్ - సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంగా పిలువబడే అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ సీజన్ లో 7 మ్యాచ్‌ లు ఆడిన ఢిల్లీ మూడింట గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉండగా.. మరోవైపు ఆడిన 6 మ్యాచ్‌ లలో 4 ఇంట గెలిచి 4వ స్థానంలో నిలిచింది హైదరాబాద్. పైగా రెండు జట్లూ తమ చివరి మ్యాచ్ లు గెలిచిన ఉత్సాహంలో బరిలోకి దిగుతున్నాయి.

ఈ క్రమంలో ఇటీవల అహ్మదాబాద్‌ లో గుజరాత్ టైటాన్స్‌ తో ఆడిన మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. కేవలం 89 పరుగులకే గుజరాత్ ను పరిమితం చేసి 9 ఓవర్లలోపు లక్ష్యాన్ని ఛేదించారు. ఈ అద్భుతమైన విజయం వారి ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేర్చింది. ఇదే క్రమంలో ఢిల్లీ నెట్ రన్ రేట్‌ కూడా బాగా పెరిగింది. దీంతో ఈ రోజు మ్యాచ్ లోనూ ఢిల్లీ బౌలర్లు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతున్నారు!

ప్రస్తుతానికి ఢిల్లీ బ్యాటర్స్ లో పంత్ 7 మ్యాచ్ లలో 210 పరుగులు చేయగా.. స్టబ్స్ 189 పరుగులు చేశాడు. ఇక డేవిడ్ వార్నర్ ఆరు మ్యాచ్ లలో 166 పరుగులు చేశాడు. బౌలర్స్ విషయానికొస్తే ఖలీల్ అహ్మద్ 7 మ్యాచ్ లు ఆడి 10 వికెట్లు తీయగా.. ముకేష్ కుమార్ 4 మ్యాచ్ లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు.

ఇక సన్ రైజర్స్ విషయానికొస్తే... ఈ పోటీలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన హైదరాబాద్... బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్‌ లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఐపీఎల్ లో చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన తమ రికార్డును కూడా బద్దలు కొట్టింది. ట్రావిస్ హెడ్, క్లాసెన్‌ లు బౌలర్లను అక్షరాలా మైదానం నుండి పగులగొట్టడం ద్వారా నాయకత్వం వహించారు. హెడ్ 8 సిక్సర్లు బాదగా, క్లాసెన్ ఏడు సిక్సర్లు కొట్టాడు.

హైదరాబాద్ బ్యాటర్స్ లో క్లాసెన్ 6 మ్యాచ్ లలో 253 పరుగులు సాధించగా.. హెడ్ 5 మ్యాచ్ లలో 235 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ పాట్ కమిన్స్ 6 మ్యాచ్ లు ఆడి 9 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ 4 మ్యాచ్ లలో 6 వికెట్లు తీశాడు.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ, హైదరాబాద్ జట్లు ఇప్పటివరకూ 23 మ్యాచ్‌ ల్లో తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 11 సార్లు విజేతగా నిలవగా, హైదరాబాద్ 12 మ్యాచ్‌ ల్లో విజయం సాధించింది. ఇక సన్ రైజర్స్ పై ఢిల్లీ అత్యధిక స్కోరు 207 కాగా, ఢిల్లీపై సన్‌ రైజర్స్ అత్యధిక స్కోరు 219 గా ఉంది.

Tags:    

Similar News