తొలి వన్డే డబుల్ సెంచరీ.. ఆపై ప్రఖ్యాత స్టేడియంలో 14 ఏళ్లకు మ్యాచ్

అయితే, తొలిసారి చరిత్రకు వేదికగా నిలిచిన ఆ స్టేడియంలో పద్నాలుగున్నర ఏళ్లుగా ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు.

Update: 2024-10-06 21:30 GMT

టెస్టుల్లో డబుల్ సెంచరీ చేయడమే పెద్ద విశేషం.. ఇక వన్డేల్లో డబుల్ సెంచరీనా? చాన్సే లేదు.. అనుకుంటున్న రోజుల్లో.. అది కూడా ప్రపంచ దిగ్గజ బ్యాట్స్ మన్ బ్యాట్ నుంచి ఓ చరిత్ర నమోదైంది.. ఇక ఆ తర్వాత 13 సార్లు రిపీట్ అయింది. అయితే, తొలిసారి చరిత్రకు వేదికగా నిలిచిన ఆ స్టేడియంలో పద్నాలుగున్నర ఏళ్లుగా ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు.

అదో అనుభూతి..

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్. సంస్థానాధీశుల నగరం ఇది. ఒకప్పుడు గ్వాలియర్ మహరాజులే భారత్ లో క్రికెట్ ప్రోత్సహించారు. అలాంటి నగరంలో క్రికెట్ మ్యాచ్ అంటే ఒకప్పుడు ఏదో తెలియని భావనతో గూస్ బంప్స్ వచ్చేవి. అలాంటి గ్వాలియర్ లో 2010 ఫిబ్రవరిలో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తొలి వన్డే డబుల్ సెంచరీని నమోదు చేశాడు. అప్పట్లో డేల్ స్టెయిన్ బౌలింగ్ సచిన్ డబుల్ సెంచరీ మార్క్ కు చేరగానే అందరూ అహో అని కీర్తించారు. ఇక సచిన్ చూపించిన మార్గంలో చెలరేగి ఆడి 10 మంది ఆటగాళ్లు వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టారు. మొత్తం 14 డబుల్ సెంచరీల్లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మనే మూడు కొట్టడం గమనార్హం. చిత్రం ఏమంటే సచిన్ తొలిసారి డబుల్ సెంచరీ కొట్టిన గ్వాలియర్ లో మళ్లీ అప్పటి నుంచి మ్యాచ్ జరగలేదు.

ఆ స్టేడియం ఇదే..

సచిన్ డబుల్ రికార్డ్ సాధించినది గ్వాలియర్‌ మున్సిపల్‌ శాఖకు చెందిన రూప్‌ సింగ్‌ స్టేడియంలో. ఇక్కడ మొత్తం 12 వన్డేలు జరిగాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తమ సొంత స్టేడియం నిర్మాణం వైపు మొగ్గింది. గ్వాలియర్ నగరం శివార్లలో 30 ఎకరాల్లో కొత్తగా అద్భుత వసతులుతో మైదానాన్ని నిర్మించింది. దాదాపు 30 వేలమంది పట్టే ఈ స్టేడియానికి ‘మాధవ్‌రావ్‌ సింధియా క్రికెట్‌ స్టేడియం’గా పేరు పెట్టారు. ఈయన ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి. సింధియాలు భారత క్రికెట్ కు ప్రోత్సాహం అందించినవారిలో ముఖ్యులు. ఇప్పుడు ఇదే మైదానంలో భారత్.. బంగ్లాదేశ్ తో టి20 మ్యాచ్ ఆడనుంది. అదీ గ్వాలియర్ క్రికెట్ చరిత్ర.

Tags:    

Similar News