అదీ గంభీర్ అంటే.. హెడ్ కోచ్ గా బోర్డుపై తొలిసారే గట్టి ముద్ర!

మొన్నటి ప్రపంచ కప్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఈసారి కెప్టెన్ చేస్తారనే అందరూ అనుకున్నారు.

Update: 2024-07-19 09:56 GMT

మొన్నటివరకు సూర్య కుమార్ యాదవ్ అసలు టి20 కెప్టెన్సీ రేసులోనే లేడు.. ఇప్పుడు మరో రెండేళ్ల వరకు అతడే కెప్టెన్. శ్రేయస్ అయ్యర్ కు అసలు బీసీసీఐ కాంట్రాక్టే లేదు.. కానీ ఇప్పుడు అతడు వన్డే జట్టులో సభ్యుడు. శుభ్ మన్ గిల్ ఏ ఫార్మాట్ లోనూ వైస్ కెప్టెన్ కాదు.. ఇప్పుడు టి20ల్లో చోటే కాదు.. వన్డేలకూ వైస్ కెప్టెన్. ఇలా చెప్పుకొంటూ పోతే ఒకటేమిటి.. శ్రీలంకతో టి20, వన్డే సిరీస్ లకు ఎంపికచేసిన టీమ్ ఇండియాలో నాలుగైదు మార్పులు కనిపిస్తాయి. ఇదంతా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రాకతోనే అనడంలో సందేహం లేదు.

హార్దిక్ కాదు సూర్య

మొన్నటి ప్రపంచ కప్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఈసారి కెప్టెన్ చేస్తారనే అందరూ అనుకున్నారు. కానీ, గంభీర్ మాత్రం వేరుగా ఆలోచించాడు. 360 డిగ్రీ బ్యాటర్ సూర్యకుమార్ ను కెప్టెన్ చేశాడు. అయితే, అతడిని వన్డే జట్టులోకి మాత్రం పరిగణించలేదు. స్వదేశంలో 2026లో జరిగే టీ20 ప్రపంచ కప్‌ వరకు సూర్యనే కెప్టెన్. గిల్ వైస్ కెప్టెన్ గా ఉంటాడు. ఇక టి20 ప్రపంచ కప్ లో రిజర్వ్ ప్లేయర్ గా ఉన్న గిల్.. టి20లకు తగిన వేగంతో ఆడడం లేదనే విమర్శలున్నాయి. కానీ, ప్రతిభావంతుడు కావడంతో అతడికి గంభీర్ పెద్ద బాధ్యతలు అప్పగించాడు. టి20లతో పాటు వన్డేల్లోనూ వైస్ కెప్టెన్సీ ఇచ్చాడు. అంటే.. హార్దిక్ కు టి20ల్లో కెప్టెన్సీ, వన్డేల్లో వైస్ కెప్టెన్సీ కూడా పోయింది. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ నాటికి గిల్ ను కెప్టెన్ చేయాలని గంభీర్ ప్రణాళికల్లో ఉన్నాడు.

టీ20 ప్రపంచ కప్‌ లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. కానీ, లంకతో టి20 సిరీస్‌ లో అతడికి చోటు దక్కలేదు. వన్డేల్లోకి మాత్రం తీసుకున్నారు. రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిషేక్ శర్మ ఇద్దరూ ఓపెనర్లు కావడంతో చోటివ్వలేదు. అయితే ఐపీఎల్‌ లో రాణించిన రియాన్ పరాగ్‌, రవి బిష్ణోయ్‌ లను ఎంపిక చేశాడు.

గతంలో ఐపీఎల్‌ జట్టు కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ కు మెంటార్‌ గా పనిచేసిన గంభీర్.. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ తో పాటు డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్, పేసర్ హర్షిత్ రాణాలను లంక సిరీస్‌ కు ఎంపిక చేశాడు. సూర్య కూడా ఒకప్పుడు కోల్ కతాకు ఆడినవాడే. అయ్యర్ లాగే నిరుడు బోర్డును ధిక్కరించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ను మాత్రం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పట్టించుకోలేదు.

సీనియర్లు ఆడేలా..

టి20 ప్రపంచ కప్ తో టి20లకు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు లంకతో వన్డే సిరీస్ కు విశ్రాంతా తీసుకుందామని భావించారు. కానీ, గంభీర్ ఏం చెప్పాడో కానీ.. రోహిత్, కోహ్లి ఇద్దరూ లంకతో వన్డేలకు అందుబాటులోకి వచ్చారు.

Tags:    

Similar News