గంభీర్ తో వేగడం కష్టమే.. బీసీసీఐకి తలనొపులు తప్పవేమో?

గంభీర్ దేశానికే ప్రాధాన్యం ఇస్తాడు. అందులో ఎలాంటి సందేహ లేదు. మరోవైపు బ్యాట్స్ మన్ గా అతడిది దూకుడైన తీరు

Update: 2024-07-16 11:28 GMT

భారత క్రికెట్ జట్టు.. మరీ ముఖ్యంగా టి20 జట్టు ప్రస్తుతం సంధి దశలో ఉందనే చెప్పాలి.. ఓవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇంకోవైపు మేటి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ముగ్గురూ అంతర్జాతీయ టి20ల నుంచి రిటైరయ్యారు. వీరి స్థానాలను భర్తీ చేయడం అంత సులభం ఏమీ కాదు. మరోవైపు హెడ్ కోచ్ గా ద్రవిడ్ వంటి దిగ్గజం టర్మ్ కూడా ముగిసింది. అంటే.. టి20ల్లో భారత జట్టు దాదాపు ప్రధాన మార్పులతో బరిలో దిగనుంది. స్టార్ ఆటగాళ్లను భర్తీ చేయగల సామర్థ్యం కొందరిలో ఉందనుకుందాం.. హెడ్ కోచ్ గా మాత్రం వస్తున్నది మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. అసలే కోపిష్టిలా కనిపించే గంభీర్ ముక్కుసూటితనంతో ఏం చేస్తాడో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కోచింగ్ స్టాఫ్ ను మార్చమంటూ.

గంభీర్ దేశానికే ప్రాధాన్యం ఇస్తాడు. అందులో ఎలాంటి సందేహ లేదు. మరోవైపు బ్యాట్స్ మన్ గా అతడిది దూకుడైన తీరు. ఇదే తీరు మైదానంలోనూ చూపేవాడు. దీంతోనే కాస్త సమస్య వచ్చేది. మరిపుడు అతడు హెడ్ కోచ్. కేవలం 42 ఏళ్ల వయసుకే రిటైరైన ఎనిమిదేళ్ల లోపునే పెద్ద బాధ్యతలు నెత్తికెత్తుకున్నాడు. కాగా, కోచింగ్ లో టీమ్ ఇండియాకు ప్రస్తుతం ఉన్న సహాయ సిబ్బందిని మార్చాలని గంభీర్ కోరుతున్నాడు. పూర్తిగా కొత్త కోచింగ్ స్టాఫ్ తో బరిలో దిగాలనేది అతడి ఉద్దేశం. మరి ఈ డిమాండ్ కు బీసీసీఐ ఏ మేరకు ఒప్పుకొన్నదో తెలియాల్సి ఉంది.

లంకతో సిరీస్ నుంచి..

గంభీర్ ఈ నెలాఖరులో శ్రీలంకతో జరిగే వన్డే, టి20 సిరీస్ నుంచి హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఇటీవలే అంతర్జాతీయ టి20ల నుంచి రిటైరైన రోహిత్, కోహ్లి, జడేజాతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా లంకతో సిరీస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత కారణాలతో లంకతో వన్డే సిరీస్‌ కు దూరంగా ఉంటానని హార్దిక్‌ పాండ్యా బీసీసీఐకి చెప్పాడు. అయితే, రోహిత్, కోహ్లీ, జడేజా, బుమ్రాలను శ్రీలంకతో వన్డే సిరీస్‌ కు అందుబాటులో ఉండాలని గంభీర్‌ కోరినట్లు తెలుస్తోంది. రోహిత్ నిరాకరిస్తే కేఎల్ రాహుల్‌ కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించాలని గంభీర్‌ భావిస్తున్నాడట. ఐపీఎల్ లో లక్నో జట్టు సారథిగా ఉన్న రాహుల్ వైపు మొగ్గుచూపుతున్నాడన్నమాట. అయితే, గంభీర్ తీరే కాస్త చర్చనీయాంశం అవుతోంది. సీనియర్లు దూరంగా ఉంటామంటే.. వారిని ఆడాల్సిందేనంటూ గంభీర్ కోరడం దీనినే సూచిస్తోంది.

మూడున్నరేళ్లు ఎలానో?

గంభీర్ కు రూ.12 కోట్లు ఏటా వేతనం. ఇంకా అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి. మూడున్నరేళ్లు కాంట్రాక్టు. అంటే వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు అన్నమాట. మరి ఇన్నాళ్లు గంభీర్ టర్మ్ కొనసాగుతుందా? అంటే చెప్పలేం. అందులోనూ సీనియర్లు కోహ్లి, రోహిత్ తో అతడు సమన్వయం చేసుకోవాల్సి ఉంది. వీరితోపాటు జడేజా కూడా వచ్చే మూడేళ్లలో రిటైర్ అవుతాడు. ఓ విధంగా భారత క్రికెట్ భవిష్యత్ గంభీర్ చేతిలో ఉంది. మరి అతడు దీనిని సవాల్ తీసుకుని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడా? లేక చేజార్చుకుంటాడా? అనేది చూడాలి.

Tags:    

Similar News