కెప్టెన్ డౌట్.. స్టార్ హిట్టర్ ఔట్? ఆ ఐపీఎల్ టీంకు అన్నీ షాకులే

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, 360 డిగ్రీల హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ గాయాలకు గురైన సంగతి తెలిసిందే.

Update: 2024-01-08 09:26 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన ఆ జట్టుకు మూడేళ్లుగా అన్నీ కష్టాలే.. రికార్డు స్థాయిలో ఐదుసార్లు టైటిల్ గెలిచినా.. మూడేళ్లుగా దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది.. ఆటగాళ్లు ఫామ్ కోల్పోయారు.. కెప్టెన్ కు వయసు పెరుగుతోంది.. మొత్తంగా జట్టులో స్పిరిట్ లోపించింది.. దీనికితోడు స్టార్ ఆల్ రౌండర్ ను వదులుకుంది.. అట్టిపెట్టుకున్నవారు నిరాశపరిచారు.. కోట్లు పెట్టి కొనుకున్నవారు నిరుత్సాహపరిచారు. దీంతో లీగ్ లో దారుణమై ప్రదర్శన. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే సీజన్ కు కెప్టెన్ ను మార్చింది.

వారిద్దరూ ఆడడం కష్టమేనా?

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, 360 డిగ్రీల హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ గాయాలకు గురైన సంగతి తెలిసిందే. టి20 కెప్టెన్ గా ఏడాదిరన్నర నుంచి జాతీయ జట్టు బాధ్యతలు మోస్తున్న హార్దిక్ ఇటీవలి వన్డే ప్రపంచ కప్ లో గాయపడ్డాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు అతడిని ఎంపిక చేయలేదు. ఈ నెలలో జరిగే అఫ్గానిస్థాన్ సిరీస్ కూ హార్దిక్ ను పరిగణించలేదు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ అప్పగించారు. అతడు ఆసీస్, దక్షిణాఫ్రికాలతో సిరీస్ లలో జట్టును గెలిపించాడు. అయితే, దక్షిణాఫ్రికా సిరీస్ లో చివరి మ్యాచ్ లో పాదం గాయానికి గురయ్యాడు. కోలుకునే దశలో ఉన్న సూర్య.. ఎప్పటినుంచి మైదానంలోకి అడుగుపెట్టేది నిన్నటివరకు తెలియదు. ఇప్పుడు ఇంకో సమస్య వచ్చిపడింది.

సూర్య.. హెర్నియా

సూర్యకుమార్ యాదవ్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. అతడు శస్త్రచికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నట్లు సమాచారం. పూర్తిగా కోలుకునేందుకు 8 నుంచి 9 వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ మొదలుకానుంది. సూర్య కుమార్ రెండు నెలలు మైదానంలో దిగే పరిస్థితి లేదు. దీంతో అతడు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడు.

లీగ్ మొత్తానికే దూరం..?

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకే కాదు.. సూర్యను లీగ్ మొత్తానికి దూరంగా ఉండాలని బీసీసీఐ ఆదేశించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. మేలో ఐపీఎల్ పూర్తికాగానే జూన్ లో టి20 ప్రపంచ కప్ ఉంది. దీనికోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లనూ మళ్లీ తీసుకొచ్చారు. అలాంటప్పుడు సూర్యను ఐపీఎల్ ఆడించకపోవచ్చు. పూర్తిగా కోలుకుని ప్రపంచ కప్ నకు అందుబాటులో ఉండాల్సిందిగా బీసీసీఐ ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఐపీఎల్ లో సూర్య ముంబై ఇండియన్స్ కు ఆడుతున్నాడు. ఈ ఏడాది ముంబై.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకుని కెప్టెన్ చేసింది. కానీ, హార్దిక్ గాయంతో బాధపడుతున్నాడు. అతడు ఐపీఎల్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ,సూర్యను ఐపీఎల్ ఆడించే ఉద్దేశం లేని బీసీసీఐ హార్దిక్ ను ఆడిస్తుందా? అనేది చూడాలి. అందులోనూ సూర్య కంటే హార్దిక్ కు గాయాల బెడద ఎక్కువ. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News