హెచ్‌.సీ.ఏ పెద్దలకు షాక్‌... ప్రక్షాళన స్టార్ట్ చేసిన సుప్రీం!

ఇందులో భాగంగా.. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్లబ్‌ లపై జస్టిస్‌ నాగేశ్వరరావు వేటు వేశారు.

Update: 2023-08-01 09:47 GMT

గతకొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌.సీ.ఏ)లో ప్రక్షాళన మొదలైందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, హెచ్‌.సీ.ఏ ఏకసభ్య కమిటీ సభ్యుడు లావు నాగేశ్వరరావు వర్క్ స్టార్ట్ చేశారని తెలుస్తోంది.

అవును... బహుళ క్లబ్‌ లతో హెచ్‌.సీ.ఏ ను శాసిస్తున్న క్రికెట్‌ పెద్దల కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఇందులో భాగంగా.. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్లబ్‌ లపై జస్టిస్‌ నాగేశ్వరరావు వేటు వేశారు. హెచ్‌.సీ.ఏ ఎన్నికల్లో ఒక దఫా లేదా మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయా క్లబ్‌ లు, వాటి ఎగ్జిక్యూటివ్‌ కమిటీలపై నిషేధం విధించారు.

వివరాళ్లోకి వెళ్తే... హెచ్‌.సీ.ఏ ఎపెక్స్‌ కమిటీకి ఈ ఏడాది ఫిబ్రవరి 14న జస్టిస్‌ నాగేశ్వరరావు కమిటీని నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు గానూ సుప్రీంకోర్టు నియమించింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను గాడినపెట్టే బాధ్యత ను నాగేశ్వరరావు స్వీకరించారు.

దీంతో రంగం లోకి దిగిన కమిటీ... 80 క్లబ్‌ లను తమ అధీనం లో పెట్టుకున్న 12 మంది, వారి కుటుంబ సభ్యులు హెచ్‌.సీ.ఏ ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించింది. ఇదే క్రమంలో హైదరాబాద్ లోని జీ.హెచ్‌.ఎం.సీకి చెందిన 21 క్లబ్‌ లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు పేర్కొంది. దీంతో జస్టిస్‌ నాగేశ్వరరావు దీని పై సుదీర్ఘ విచారణ జరిపారు!

దీంతో జస్టిస్‌ నాగేశ్వరరావు ఉత్తర్వుల నేపథ్యంలో రానున్న హెచ్‌.సీ.ఏ ఎన్నికల్లో మొత్తం 215 క్లబ్‌ లకు గానూ 158 క్లబ్ లు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోన్నాయి. ఇదే సమయంలో తమ క్లబ్బుల పరిస్థితి గురించి స్పందించిన జీ.హెచ్‌.ఎం.సీ వాదన ను జస్టిస్‌ నాగేశ్వరరావు తోసిపుచ్చారు. క్లబ్‌ లకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంలో జీ.హెచ్‌.ఎం.సీ విఫలమైందని అన్నారు.

Tags:    

Similar News