బెంగళూరులో కోహ్లి టెస్టు డకౌట్.. మరో 3 డక్ లు.. టీమ్ ఇండియా 34/6

ఈ తీరు చూస్తుంటే నాలుగు రోజుల మ్యాచ్ జరిగేందుకే అవకాశం ఉన్న బెంగళూరు టెస్టు భారత్ చేజారే ప్రమాదం కనిపిస్తోంది.

Update: 2024-10-17 07:22 GMT

ఆడుతున్నది సొంత దేశంలో.. పైగా బెంగళూరులో.. బ్యాట్స్ మెన్ కు స్వర్గధామంలాంటి పిచ్.. కానీ.. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా తీవ్రంగా తడబడుతోంది. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ పై దుమ్మురేపిన భారత బ్యాట్స్ మెన్ కివీస్ పై బ్యాట్లెత్తేశారు. స్వదేశంలో ఇటీవలి కాలంలో ఒక్క ఓవర్ లో చేసిన పరుగులు ఒక సెషన్ అంతా ఆడి కూడా చేయలేకపోయారు. పైగా ఆరు వికెట్లు కోల్పోయారు. ఈ తీరు చూస్తుంటే నాలుగు రోజుల మ్యాచ్ జరిగేందుకే అవకాశం ఉన్న బెంగళూరు టెస్టు భారత్ చేజారే ప్రమాదం కనిపిస్తోంది.

8 ఏళ్ల తర్వాత వన్ డౌన్ లో వచ్చి

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లిలో మునుపటి సత్తా తగ్గిందా..? జట్టుకు భారంగా మారుతున్నాడా..? కనీసం పరుగులు చేయడం కూడా అతడికి సాధ్యం కావడం లేదా..? టి20 ప్రపంచ కప్ (ఫైనల్స్ తప్ప).. శ్రీలంక తో వన్డే సిరీస్, బంగ్లాతో టెస్టు సిరీస్.. ఇప్పుడు న్యూజిలాండ్ టెస్టు ఏది చూసినా కోహ్లి ఫామ్ అత్యంత దారుణంగా ఉందని తెలిసిపేతోంది. న్యూజిలాండ్ తో తాజా టెస్టులో కోహ్లి వన్‌ డౌన్‌ లో బ్యాటింగ్‌ దిగి డకౌట్ అయ్యాడు. 8 ఏళ్ల తర్వా విరాట్ వన్ డౌన్ లో వచ్చాడు. శుబ్ మన్ గిల్ కు మెడ పట్టేయడంతో టెస్టుకు దూరం కావడంతో కోహ్లి వన్ డౌన్ ఆడాల్సి వచ్చింది.

బెంగళూరు గడ్డపై..

2008 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్బీబీ) జట్టుకు ఆడుతున్నాడు విరాట్ కోహ్లి. అంటే బెంగళూరు చిన్న స్వామి మైదానం అతడికి కొట్టిన పిండి. అలాంటిచోట టెస్టు మ్యాచ్ ఆడుతూ తేలిపోయాడు విరాట్. కనీసం ఖాతా తెరవలేకపోయాడు. తొమ్మిది బంతులు మాత్రమే క్రీజులో నిలిచాడు. అయితే, కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌ లో గ్లెన్‌ ఫిలిప్స్ అద్భుత క్యాచ్‌ కారణంగానే కోహ్లి పెవిలియన్‌ చేరాడు. కాగా, టి20లు, వన్డేల్లో వన్ డౌన్ లో వచ్చే కోహ్లి టెస్టుల్లో మాత్రం నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. 2016లో వెస్టిండీస్‌ పై వన్‌ డౌన్‌ లో వచ్చాడు. నాడు రెండు ఇన్నింగ్స్ లలో 3, 4 పరుగులు మాత్రమే చేశాడు. వందకు పైగా టెస్టులాడిన కోహ్లి నాలుగు టెస్టుల్లోనే వన్ డౌన్ లో వచ్చాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 97 పరుగులు సాధించాడు. అత్యధికం 41 పరుగులు. ఇక బెంగళూరు టెస్టు ద్వారా కోహ్లి ఓ చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లికిది 38వ డక్‌. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో కివీస్ పేసర్ టిమ్‌ సౌథీ (38)తో కోహ్లి సమంగా నిలిచాడు. వీరి తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ (33) ఉన్నాడు. మురళీ ధరన్ (59) క్రికెట్ లో అత్యధిక సార్లు డకౌటయ్యాడు.

భారత్ పేలవ ప్రదర్శన..

న్యూజిలాండ్ తో బుధవారమే ప్రారంభం కావాల్సిన తొలి టెస్టు వర్షం కారణంగా మొదటి రోజు జరగలేదు. గురువారం మొదటినుంచే పేస్‌ కు అనుకూలంగా మారింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం భారత్ కు పెద్ద దెబ్బగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ (2) కోహ్లి (0)కి తోడు కుర్రాడు సర్ఫరాజ్‌ ఖాన్ (0) పరుగుల ఖాతా తెరవలేదు. అనవసర దూకుడుకు పోయి ఔటయ్యాడు. ఇక సొంతగడ్డపై ఆడుతూ కేఎల్ రాహుల్ (0) దారుణంగా విఫలమయ్యాడు. టెస్టు జట్టులో తన చోటే ప్రశ్నార్థకం చేసుకున్నాడు. లంచ్ సమయానికి టీమ్ ఇండియా 34 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కోహ్లి, సర్ఫరాజ్, రాహుల్ కు తోడు ఆల్ రౌండర్ జడేజా కూడా డకౌటయ్యాడు. ఇక భారం అంతా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ అశ్విన్ పైనే ఉంది.

Tags:    

Similar News