16 గంటల ప్రయాణంలో భారత క్రికెటర్లు ఏం చేశారంటే?
బార్బడోస్ లో తుఫాను కారణంగా భారత జట్టు అక్కడే ఆగిపోయింది.
17 ఏళ్ల అనంతరం టి20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందం.. 13 ఏళ్ల తర్వాత వరల్డ్ చాంపియన్ గా నిలిచిన సంబరం.. 11 ఏళ్ల అనంతరం కప్ కొట్టిన ఉత్సాహం.. ఏదైతేనేం.. టీమిండియా ఆటగాళ్ల సంబరాలు మామూలుగా లేవు. విజేతలుగా నిలిచి మూడు, నాలుగు రోజులైనా వారి కళ్లలో అదే ఆనందం.. ప్రపంచ కప్ తో బుధవారం బ్రిడ్జిటౌన్ నుంచి బయల్దేరిన భారత ఆటగాళ్లు గురువారం తెల్లవారుజామున ఢిల్లీలో కాలిడింది. దీంతోపాటే ఈ ఉదయం ప్రధాని మోదీని కలిసింది. కాగా, దీనికిముందు విమానంలో భారత హంగామాను బీసీసీఐ ట్వీట్ చేసింది.
కప్పుకో సీటు..?
బార్బడోస్ లో తుఫాను కారణంగా భారత జట్టు అక్కడే ఆగిపోయింది. దీంతో బీసీసీఐ మన క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాన్ని పంపింది. ఆ విమానంలో ప్రపంచ కప్ కోసం ప్రత్యేక సీటు కేటాయించారా? అన్నట్లు కప్ ను అందులో ఉంచారు. ఇక ఒక్కో క్రికెటర్ ప్రపంచ కప్ ను పట్టుకుని ఒక్కో విధంగా పోజులిచ్చారు. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అయితే.. నీ కోసమే కదా ఎన్నాళ్లుగానో ఎదురుచూసింది అని ప్రపంచ కప్ ను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని భావోద్వేగంగా మాట్లాడాడు.
కోహ్లి కోహినూర్ వజ్రంలా అపురూపంగా
స్టార్ బ్యాటర్, ప్రపంచ కప్ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ తో కప్ గెలిచేందుకు కారణమైన విరాట్ కోహ్లి అయితే.. ప్రపంచ కప్ ను ఓ కోహినూర్ వజ్రంలా అపురూపంగా చూశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో నాలుకను బయటపెట్టి.. వెనుక సూర్యకుమార్ పట్టుకోగా.. కప్ ను విమానం సీటుపై పెట్టి చూశారా? సాధించాం.. అన్నట్లుగా పోజులిచ్చాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. ప్రపంచ కప్ ను పైకెగరేసి.. బంతిని క్యాచ్ చేసినట్లు క్యాచ్ చేశాడు. యువ పేసర్ అర్షదీప్ కప్ తో సెల్ఫీ దిగాడు. మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన పేసర్ బుమ్రా అయితే.. తన కుమారుడికి కప్ ను చూపుతూ ఏదో చెప్పాడు. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్.. ‘‘ఇదిగో ప్రపంచ కప్ మా దగ్గరే ఉండు’’ అన్నట్లుగా సైగలు చేశాడు. ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్పిన్నర్ చాహల్ కూడా ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిని కావడం తన లక్ అని సంతోషపడడం విశేషం. మొత్తానికి భారత క్రికెటర్ల ప్రపంచ కప్ సంబరం అంబరాన్ని అంటింది.