దక్షిణాఫ్రికాపై ఒక్క రోజులో 525 పరుగులు.. టీమిండియా నెవ్వర్ బిఫోర్ రికార్డు
పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా వాళ్లు ఒక్క రోజులో 300, 400 కొడితేనే అబ్బో అనుకునేవారం.
మరికొద్దిసేపట్లో దక్షిణాఫ్రికాపై టి20 ప్రంపచ కప్ ఫైనల్.. పొట్టి ఫార్మాట్ లో పదిహేడేళ్లుగా భారత్ కప్ కోసం ఎదురుచూస్తోంది. కానీ, ఇంతలోనే దక్షిణాఫ్రికాపై 500 పరుగులు ఎలా చేసిందనేగా? మీ అనుమానం..? జరుగుతున్నది టి20 కదా..? మరి అన్ని పరుగులు ఎలా సాధ్యమయ్యాయి..? అనే కదా.. సందేహం? ఔను.. మీరు వింటున్నది నిజమే..
కొట్టింది అబ్బాయిలు కాదు..
టెస్టు క్రికెట్ లో ఒక్క రోజులో 500 పరుగులు దాదాపు అసాధ్యం. పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా వాళ్లు ఒక్క రోజులో 300, 400 కొడితేనే అబ్బో అనుకునేవారం. అయితే, దాదాపు రెండేళ్ల కిందట ఇంగ్లండ్ ఏకంగా 500 కొట్టేసింది. అది కూడా పాకిస్థాన్ లో. అయితే, భారత్ సహా మరే జట్టుకూ ఈ స్థాయిలో ఆడడం సాధ్యం కాదు. ఎందుకంటే.. ఇంగ్లండ్ బజ్ బాల్ (బంతిని బాదడమే పని) వ్యూహంతో ఆడుతుంది కాబట్టి దానికి సాధ్యమైంది.
మన అమ్మాయిలు కొట్టేశారు..
భారత పురుషుల జట్టుకు సాధ్యం కానిదానిని మహిళలు చేసి చూపారు. మహిళా టెస్టు క్రికెట్ లో రికార్డు స్కోరు నమోదు చేశారు. చెన్నైలో శుక్రవారం దక్షిణాఫ్రికాతో మొదలైన ఏకైక టెస్టులో తొలి రోజే 525 పరుగులు బాదేశారు. కుర్ర ఓపెనర్ షెఫాలీ వర్మ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేయగా.. స్మృతి మంధాన సెంచరీ చేసింది. మొత్తం మీద మన జట్టు 5.35 రన్ రేట్ తో పరుగులు చేయడం విశేషం. షెఫాలీ (205; 197 బంతుల్లో 23×4, 8×6) టెస్టుల్లో తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మార్చింది. స్మృతి (149; 161 బంతుల్లో 27×4, 1×6) కూడా విరుచుకుపడింది. జెమీమా రోడ్రిగ్స్ (55; 94 బంతుల్లో 8×4), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (69), రిచా ఘోష్ (86) రాణించారు. హర్మన్, జెమీమా ఔట్ అయ్యాక భారత్ 603/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
90 ఏళ్ల రికార్డు బద్దలు
మహిళల క్రికెట్ లో 90 ఏళ్ల చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్. ఆస్ట్రేలియా ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై 575/9 (డిక్లేర్డ్) పరుగులు చేసింది. కాగా, 2022 డిసెంబరు 1న రావల్పిండిలో జరిగిన టెస్టులో పాకిస్థాన్ పై ఇంగ్లండ్ ఒకే రోజులో 506 పరుగులు చేసింది. పురుషుల టెస్టు క్రికెట్ లో ఒక్క రోజులో ఇదే అత్యధిక స్కోరు.