50 మ్యాచ్ లు పూర్తి.. ఇంకా 20.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో దిగ్గజాలు ఔట్?
ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తే ముంబై ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. మిగిలిన నాలుగు మ్యాచ్ లలోనూ నెగ్గినా 14 పాయింట్లే అవుతాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడింట రెండు వంతులు పూర్తయింది. 17వ సీజన్ లో గురువారం ఉప్పల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సరిగ్గా 50వది. ఇంకా 20 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం 10 జట్లకు గాను ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడుతుంది. ఇప్పటివరకు కోల్ కతా నైట్ రైడర్స్ 9 మ్యాచ్ లు ఆడగా, ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఆడింది. మిగతా 8 జట్లు పదేసి మ్యాచ్ లు పూర్తిచేసుకున్నాయి. ఇక పాయింట్ల విషయానికి వస్తే పది మ్యాచ్ ల్లో 8 గెలిచిన రాజస్థాన్ 16 పాయింట్లతో టాప్ లో ఉంది. 9లో 6 నెగ్గిన కోల్ కతా రెండో స్థానంలో, లఖ్ నవూ సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ (10లో 6) మూడో, నాలుగో ప్లేస్ లో కొనసాగుతున్నాయి.
చాంపియన్లకు కష్టమేనా?
ఐపీఎల్ ను అత్యధికంగా ఐదుసార్లు గెలుచుకున్న జట్లు ముంబై ఇండియన్స్. చెన్నై సూపర్ కింగ్స్. ఈ సారి రెండు జట్లూ కెప్టెన్ల మార్పుతో బరిలో దిగాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై కెప్టెన్సీని దిగ్గజ ఆటగాడు ధోనీ వదులుకోగా, యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ పగ్గాలు అందుకున్నాడు. అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయిన రోహిత్ శర్మను కాదని గుజరాత్ నుంచి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను తెచ్చుకుంది ముంబై. అయితే, ఈ ఆలోచన వికటించింది. మరోవైపు ప్రస్తుత సీజన్ లో చెన్నై పది మ్యాచ్ లకు గాను 5 గెలిచింది. పది పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
ఇక ముంబై పరిస్థితి మరీ ఘోరం. పది మ్యాచ్ లకు మూడే నెగ్గింది. మరో విఫల జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా ఇన్నే మ్యాచ్ లు నెగ్గినా ముంబై మెరుగైన రన్ రేట్ కారణంగా 9వ స్థానంలో నిలిచింది. ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తే ముంబై ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. మిగిలిన నాలుగు మ్యాచ్ లలోనూ నెగ్గినా 14 పాయింట్లే అవుతాయి. రన్ రేట్ (-0.272)లోనూ బాగా వెనుకబడి ఉంది.
చెన్నైకి మిణుకుమిణుకు..
టోర్నీలో ఏ దశలో అయినా పుంజుకోగల సత్తా చెన్నై సొంతం. ఆ జట్టుకు ఇప్పటికైతే ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయాయయని చెప్పలేం. 4 మ్యాచ్ లు నెగ్గితే 18 పాయింట్లు అవుతాయి. అయితే, ఇది అంత సులభం కాదు. రన్ రేట్ (+0.627) మెరుగ్గా ఉండడమే కాస్త ఊరట. హైదరాబాద్ (రన్ రేట్ +0.072) మిగతా అన్నిమ్యాచ్ లలో ఓడడం వంటి అసాధారణ సమీకరణాలు జరిగితే చెన్నై ముందంజ వేస్తుందని చెప్పొచ్చు.
క్రిక్ ట్రాకర్ ఏమంటోంది..?
క్రిక్ ట్రాకర్ ప్రకారం ప్రస్తుత లీగ్ లో ప్లే ఆఫ్స్ చేరేందుకు రాజస్థాన్ కు 95 శాతం చాన్స్ ఉంది. కోల్ కతాకు 85 శాతం, లఖ్ నవూకు 60 శాతం, హైదరాబాద్ కు 55 శాతం అవకాశాలున్నాయని అంచనా వేసింది. కాగా, చెన్నై (38 శాతం)కి ఇంకా చాన్సుందని తెలిపింది. ఢిల్లీ క్యాపిటల్స్ (30 శాతం), గుజరాత్ టైటాన్స్ (17 శాతం), పంజాబ్ కింగ్స్ (17 శాతం), ముంబై (2 శాతం), బెంగళూరు (1శాతం)పై మాత్రం పూర్తిగా ఆశలు వదిలేసింది.