ఐపీఎల్ వేలంలో ఈసారి ఈ 10 మందిదే హవా!
ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధానంగా ఈ ఏడాది సంచలనాలు సృష్టించిన ఆటగాళ్లు హాట్ కేకుల్లా అమ్ముడవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధానంగా ఈ ఏడాది సంచలనాలు సృష్టించిన ఆటగాళ్లు హాట్ కేకుల్లా అమ్ముడవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా 10మంది విదేశీ ఆటగాళ్లపై హాట్ హాట్ చర్చ నడుస్తుంది. ఈ సమయంలో ఆ పదిమంది ఆటగాళ్లు ఎవరు.. ఎవరు ఏ విషయంలో సంచలనం అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
రచిన్ రవీంద్ర:
మినీ క్రికెట్ పండుగ ఐపీఎల్ కోసం వేళానికి సమయం దగ్గరపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొంతమంది సంచలన విదేశీ ఆటగాళ్లలో ఈ వరల్డ్ కప్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచిన వారిలో రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) ఒకరనేది తెలిసిన విషయమే. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో 600కిపైగా పరుగులు రాబట్టాడు. అందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఓపెనర్ గా రావడంతోపాటు స్పిన్నర్ గా బౌలింగ్ చేసే రచిన్ రవీంద్ర ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో హాట్ టాపిక్ గా మారాడు.
డారిల్ మిచెల్:
ఇదే సమయంలో మరో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ కూడా ఈసారి హాట్ కేకుల్లో ఒకరని చెప్పుకోవాలి. అత్యంత కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే డారిల్ మిచెల్.. వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడేస్తాడు. ఇతడి వికెట్ దక్కించుకోవడం కోసం బౌలర్లు చెమటోడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న డారిల్ కు 2022లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన అనుభవం కూడా ఉండటం అదనపు అడ్వాంటేజ్.
జిమ్మీ నీషం:
ఇక మరో న్యూజిలాండ్ ఆటగాడు జిమ్మీ నీషం కూడా ఈసారి భారీ ధర పలికే అవకాశం ఉందని అంటున్నారు. వన్డే ప్రపంచ కప్ లీగ్ స్టేజ్ లో ఆసీస్ నిర్దేశించిన 389 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరో స్థానంలో వచ్చిన నీషం కేవలం 39 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కేవలం 5 పరుగుల తేడాతో కివీస్ ఓడినప్పటికీ.. నీషం పోరాటం మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. ఆ ఇన్నింగ్స్ ఇతడికి బాగా కలిసి రావొచ్చు.
వాండర్ డసెన్:
ఇక దక్షిణాఫ్రికా నుంచి మిడిలార్డర్ బ్యాటర్ వాండర్ డసెన్ కూడా ఈసారి హాట్ కేకులా అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. వన్డే ప్రపంచ కప్ లో 10 మ్యాచుల్లో 448 పరుగులు చేసిన డసెన్.. రెండు సెంచరీలు కూడా చేశాడు. నిలకడ కలిగిన ఆటగాడిగా పేరున్న డసెన్ కు రాజస్థాన్ రాయల్స్ తరఫున 2022 సీజన్ లో ఆడిన అనుభవం ఉంది.
గెరాల్డ్ కొయిట్జీ:
ఇదే సమయంలో దక్షిణాఫ్రికా నుంచి మరో కీలక ఆటగాడు ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయిట్జీ పైకూడా అందరి దృష్టీ ఉందని చెప్పుకోవాలి. పేస్ సంచలనంగా మారిన గెరాల్డ్... వన్డే వరల్డ్ కప్ లో కేవలం 8 మ్యాచుల్లోనే 20 వికెట్లు తీశాడు. 140 కి.మీకిపైగా వేగంతో బంతులను సంధించడమే కాకుండా.. బంతుల్లో వేరియేషన్స్ చూపించడంలో దిట్ట.
ట్రావిస్ హెడ్:
వన్డే ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా ఆరోసారి నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ సంచలన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో 102.61, టీ20లో 134.15 స్ట్రైక్ రేట్ కలిగిన ట్రావిస్ హెడ్... కేవలం బ్యాటర్ గానే కాకుండా బౌలర్ గానూ రాణించగల ఆటగాడు! 2016-17 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు.
మిచెల్ స్టార్క్:
చివరిసారిగా 2014-15 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్ ఆడిన మిచెల్ స్టార్క్... ఇటీవల వన్డే ప్రపంచ కప్ లో ఆసీస్ ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అందులో భాగంగా పది మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. ప్రధానంగా పవర్ ప్లే ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తాడు.
వనిందు హసరంగ:
గతేడాది జరిగిన వేలంలో రూ. 10.75 కోట్లు పలికిన హసరంగ.. ఈసారి కూడా మంచి ధరనే సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేయడంతోపాటు.. లోయర్ ఆర్డర్ లో భారీ షాట్లను అలవోకగా కొడతాడు. ప్రధాన స్పిన్నర్ గా కీలకమైన వికెట్లూ తీయగలడు.
దిల్షాన్ మదుషంక:
శ్రీలంక యువ కెరటం దిల్షాన్ మదుషంక బౌలింగ్ లో వైవిధ్యం చూపిస్తే బ్యాటర్లను కట్టడి చేయడంలో దిట్ట. వన్డే ప్రపంచ కప్ లో కేవలం 9 మ్యాచుల్లోనే 21 వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్శించాడు. ఈ వరల్డ్ కప్ లో శ్రీలంక తరుపున ఇతడొక్కడే స్టార్ కావడం గమనార్హం. ఈసారి వేలంలో తప్పకుండా ఇతడిపై ఫ్రాంచైజీలు దృష్టిపెట్టడం ఖాయం అనే చెప్పుకోవాలి.
అజ్మతుల్లా ఒమర్జాయ్:
ఈ వరల్డ్ కప్ లో అఫ్గానిస్థాన్ తన ఆటతో అందరి దృష్టినీ ఆకర్షించింది. సంచలన విజయాలు నమోదు చేసింది. ఈ టీం నుంచి అజ్మతుల్లా ఒమర్జాయ్ భారీ షాట్లను కొట్టగలిగే బ్యాటర్ మాత్రమే కాకుండా... మీడియం పేసర్ కూడా కావడంతో ఆల్ రౌండర్ లిస్ట్ లో ఇతడికి ప్రాధాన్యత దక్కొచ్చని అంటున్నారు.
ఇలా ఈ ఏడాది సంచలనంగా మారిన టాప్ 10 విదేశీ ఆటగాళ్లపై ప్రాంఛైజీల దృష్టి ఉండొచ్చని క్రికెట్ పండితులు చెబుతున్నారు.