స్నేహితుడి కోసం బీసీసీఐకి కపిల్ దేవ్ విజ్ఞప్తి... షా స్పందించాలి!!
ఈ పరిస్థితుల్లో అలనాటి క్రికెటర్ ఒకరు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందుల్లో ఉన్నారని అంటున్నారు. ఈ విషయాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుత రోజుల్లో క్రికెట్ అంటే అత్యంత ఎక్కువ సంపాదన కలిగిన క్రీడల్లో ఒకటి. ఇక భారత్ వంటి దేశాల్లో ఒక్కసారి క్రికెటర్ గా దేశం కోసం ఆడితే లైఫ్ సెటిల్ ఐపోయినట్లే అని అంటుంటారు. కానీ నేటి ఈ వైభవానికి పునాదులు వేసిన ఆ రోజుల్లో మాత్రం ఆ అవకాశం లేదు, నాటి ఆర్థిక పరిస్థితులు నేటి పరిస్థితులకు పూర్తిగా భిన్నం.
ఈ పరిస్థితుల్లో అలనాటి క్రికెటర్ ఒకరు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందుల్లో ఉన్నారని అంటున్నారు. ఈ విషయాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై ఆయన సహచరులు, టీంఇండియా వెటరన్స్ తమ వంతు సాయం చేస్తున్నప్పటికీ... అత్యంత రిచ్ క్రికెట్ బోర్డుల్లో ఒకటైన బీసీసీఐ కూడా స్పందించాల్సిన బాధ్యత, అవసరం ఉందని అంటున్నారు.
అవును... టీంఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (71) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఏడాది కాలంగా ఆయన లండన్ లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ లో బ్లడ్ క్యాన్సర్ తో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడి తాజా పరిస్థితిపై టీంఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన కపిల్ దేవ్... అన్షుమన్ గైక్వాడ్ తో కలిసి తాను చాలా మ్యాచ్ లు ఆడినట్లు తెలిపారు. అతడిని ఇలాంటి స్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నారు. ఈ సందర్భంగా... తనతో పాటు సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, మదన్ లాల్, వెంగ్ సర్కార్, కీర్తి ఆజాద్, మోహిందర్, రవిశాస్త్రి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో మన మాజీ హెడ్ కోచ్ కోసం బీసీసీఐ కూడా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని కపిల్ దేవ్ కోరారు. అయితే తామెవరినీ బలవంత పెట్టడం లేదు కానీ... ఈ దేశం కోసం ఎన్నోసార్లు కఠినమైన ఫాస్ట్ బౌలర్లకు ఎదురునిలబడి ముఖం, చాతిపై దెబ్బలు తిన్నాడని.. అలాంటి వ్యక్తి కోసం నేడు మనమంతా నిలబడాల్సిన సమయం వచ్చిందని కపిల్ తెలిపారు. ఇప్పుడు కపిల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అదేవిధంగా... నేటితరం ఆటగాళ్లు బాగా సంపాదిస్తున్నారని, సపోర్ట్ స్టాఫ్ కి కూడా వేతనాలు బాగానే ఉన్నయని చెప్పిన కపిల్.. తమ కాలంలో బోర్డులో తగినన్ని నిధులు లేవని.. నాటి పరిస్థితి వేరుగా ఉండేదని తెలిపారు. ఈ సమయంలో మాజీ ఆటగాళ్ల సంరక్షణ బాధ్యతను బోర్డు తీసుకోవాలని.. బీసీసీఐ ఓ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.
ఈ సమయంలోనే... అన్షుమన్ గైక్వాడ్ కుటుంబం అంగీకరిస్తే తమ పెన్షన్ డబ్బులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కపిల్ తెలిపాడు. కాగా... అన్షుమాన్ 1974 - 87 మధ్య భారత్ జట్టు తరుపున 40 టెస్టులు, 15 వన్డే లు ఆడాడు. అనంతరం భారత జట్టుకు రెండుసార్లు హెడ్ కోచ్ గా పని చేశారు. మరి భారత జట్టుకు ఇన్ని సేవలందించిన వ్యక్తి విషయంలో బీసీసీఐ స్పందిస్తుందా.. జై షా రియాక్ట్ అవుతారా అనేది వేచి చూడాలి!