6 ఏళ్ల తర్వాత కోహ్లీ బౌలింగ్.. రియాక్షన్ వైరల్!
ఈ సమయంలో హార్దిక్ వేయాల్సిన మిగిలిన మూడు బంతులను కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీతో పూర్తి చేయించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ బంతి అందుకోగానే.. ప్రేక్షకులంతా గట్టిగా అరుస్తూ ఎంకరేజ్ చేశారు.
అత్యంత రసవత్తరంగా సాగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లలో టీం ఇండియా ప్రస్తుతం నాలుగో మ్యాచ్ ఆడుతుంది. ఇప్పటికే 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపైనా.. 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘాన్ పైనా గెలిచిన టీం ఇండియా... 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పైనా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు నాలుగో మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఒక అరుదైన సంఘటన జరిగింది.
అవును... వరల్డ్ కప్ లో తన నాలుగో మ్యాచ్ లో భాగంగా గురువారం బంగ్లాదేశ్ తో పోటీపడుతుంది ఇండియా. ఈ క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. ఈ సందర్భంగా తొమ్మిదో ఓవర్లో అరుదైన సంఘటన జరిగింది. అందులో భాగంగా... స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడటంతో కోహ్లీ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్ లో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. ఫాలో రనప్ లో హార్దిక్ పాండ్యా బౌండరీని ఆపే క్రమంలో జారిపడ్డాడు. దాంతో అతని ఎడమ కాలి మడమకు తీవ్ర గాయమైంది. నొప్పితో సరిగా నిలబడలేక విలవిలలాడిన హార్దిక్ కు టీమిండియా ఫిజియోలు ప్రథమ చికిత్స అందించారు. అయినా అతను నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో బయటకు తీసుకెళ్లారు.
ఈ సమయంలో హార్దిక్ వేయాల్సిన మిగిలిన మూడు బంతులను కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీతో పూర్తి చేయించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ బంతి అందుకోగానే.. ప్రేక్షకులంతా గట్టిగా అరుస్తూ ఎంకరేజ్ చేశారు. ఈ సమయంలో మూడు బంతులు బౌలింగ్ చేసిన కోహ్లీ.. 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. గంటకు 103 కిలో మీటర్ల వేగంతో కోహ్లీ బౌలింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కాగా... విరాట్ కోహ్లీ చివరిసారిగా 2017లో బౌలింగ్ చేశాడు. శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీ చివరిసారిగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో 2 ఓవర్లు వేసిన కోహ్లీ 12 పరుగులు ఇచ్చాడు. అంతక ముందు 2014లోనూ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 7 ఓవర్లు బౌలింగ్ చేశాడు కోహ్లీ. ఆ స్పెల్ లో బ్రెండన్ మెక్ కల్లం ను ఔట్ చేశాడు. వన్డేల్లో ఇప్పటి వరకు కోహ్లీ 4 వికెట్ల తీసాడు. ఈ క్రమంలో సుమారు 6 సంవత్సరాల తర్వాత మరోసారి విరాట్ బౌలింగ్ చేశాడు.