32 ఏళ్లకు.. టీమిండియా హెడ్ కోచ్ గా హైదరాబాదీ?

దిగ్గజ బ్యాట్స్ మన్, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టి20 ప్రపంచ కప్‌ తో ముగియనుంది.

Update: 2024-05-15 12:30 GMT

ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు.. ఒక్క సిరీస్ ఆడినా ప్రత్యర్థి దేశ బోర్డుకు రూ.కోట్లలో లాభం.. ఏక కాలంలో రెండు, మూడు అంతర్జాతీయ స్థాయి జట్లనూ ఎంపిక చేయగల సామర్థ్యం.. దాదాపు రూ.లక్ష కోట్ల లీగ్.. ఇదీ భారత క్రికెట్ సత్తా.. అలాంటి జాతీయ జట్టుకు హెడ్ కోచ్ అంటే.. మామూలు మాటలు కాదు. ఇప్పుడు ఈ గొప్ప చాన్స్ మూడు దశాబ్దాల తర్వాత హైదరాబాదీ దిగ్గజ క్రికెటర్ కు దక్కనుంది. తన సొగసైన ఆటతో భారత క్రికెట్ పై ముద్ర వేసిన ఆ బ్యాట్స్ మన్ గనుక టీమిండియా హెడ్ కోచ్ అయితే అదొక మైలురాయి సందర్భంగా మిగిలిపోతుంది.

ఒక దిగ్గజం స్థానంలో

దిగ్గజ బ్యాట్స్ మన్, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టి20 ప్రపంచ కప్‌ తో ముగియనుంది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ కోసం వెదుకులాట మొదలుపెట్టింది. దరఖాస్తులు ఆహ్వానించింది. చాలామంది ఈ పదవికి పోటీ పడడం ఖాయం. ఈ కోవలో ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరందరికంటే మాత్రం అతడొక్కడి పేరు ఇంకా బాగా నానుతోంది.

హలో లక్ష్మణా..?

పైన చెప్పుకొన్న వారందరి కంటే జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ (ఎన్సీఏ), హైదరాబాదీ సొగసరి బ్యాట్స్ మన్ వంగీపురం వెంకటసాయి లక్ష్మణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లక్ష్మణ్‌ దరఖాస్తు చేసుకుంటే హెడ్ కోచ్‌ పదవి అతడిదే. 49 ఏళ్ల లక్ష్మణ్‌ మూడేళ్లుగా ఎన్సీఏ డైరెక్టర్‌ గా కొనసాగుతున్నాడు.

ఇండియా-ఎ, అండర్‌-19 ఆటగాళ్ల పురోగతిని పర్యవేక్షిస్తున్నాడు. ద్రవిడ్‌ లేని సమయంలో సీనియర్‌ జట్టుకు అసియా క్రీడలు, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ లలో కోచ్ గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ సిరీస్ లకూ కోచింగ్ చేశాడు. రోహిత్‌, కోహ్లి, జడేజా, షమి వంటి టీమిండియా స్టార్లతో ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉంది. వీరంతా ఇంకా రెండేళ్లు ఆడడం ఖాయం. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌.. పాత, కొత్త భారత క్రికెట్‌ కు వారధిగా ఉండొచ్చు.

గంభీర్ ముందుకొస్తాడా..?

మంచి వ్యూహ నిపుణుడు, క్రికెట్ బుర్ర ఉన్నప్పటికీ కోపిష్టిగా పేరున్న మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుంటాడా? అనే చర్చ సాగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్ కు రెండు టైటిళ్లు అందించిన గంభీర్ కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో సత్సంబంధాలు లేవు. రోహిత్ శర్మతో మాత్రం మంచి స్నేహం ఉంది. ఇక లాంగర్ కూడా మంచి వ్యూహకర్తే. అతడి హయాంలోనే ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్‌ గెలుచుకుంది. యాషెస్‌ కూడా సాధించింది.

ఇదీ అర్హత..

భారత క్రికెట్ హెడ్ కోచ్ కోసం కొన్ని అర్హతలను నిర్దేశించారు. దరఖాస్తుదారులకు కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి. వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి. కొత్త కోచ్‌ టి20 ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే జూలై 1న బాధ్యతలు చేపట్టి.. 2027 డిసెంబరు 31 వరకు ఉంటాడు. కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం లేదా ఓ టెస్టు జట్టుకు రెండేళ్లు కోచ్‌ గా పనిచేసిన అనుభవం ఉండాలి.

27 ఆఖరు..

టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 27తో ముగుస్తుంది. ‘ద్రవిడ్‌ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే..’ అన్న నిబంధనతోనే బీసీసీఐ ఉద్దేశం తెలిసిపోయింది. ద్రవిడ్ కూడా దరఖాస్తు చేయడం కష్టమే. అంతేకాదు దీర్ఘకాలిక కోచ్‌ కోసం చూస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పడాన్ని బట్టి చూస్తే బోర్డు కూడా కొత్త కోచ్ గురించి ఆలోచిస్తోంది అని స్పష్టం అవుతోంది.

2027 ఆఖరి వరకు.. అంటే.. మూడన్నరేళ్లు ద్రవిడ్‌ కోచ్ గా కొనసాగడం కష్టమే. 2021 నుంచి ప్రధాన కోచ్‌ గా ఉన్న ద్రవిడ్ పదవీ కాలం రెండేళ్లు. అది వన్డే ప్రపంచకప్‌తో ముగిసింది. దక్షిణాఫ్రికా పర్యటన, టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో కొత్త కోచ్‌ ను నియమించడానికి తగినంత సమయం లేక అతడినే కొనసాగించారు.

కొసమెరుపు: టీమిండియా 1983-87 మధ్యలో హైదరాబాద్ కు చెందిన ఆర్ఆర్ మాన్ సింగ్ కోచ్ గా పనిచేశారు. ఆ తర్వాత 1991-92లో అబ్బాస్ అలీ బేగ్ కోచ్ గా వ్యవహరించాడు. మళ్లీ ఇన్నేళ్లకు లక్ష్మణ్ కోచ్ అయ్యే చాన్సుంది.

Tags:    

Similar News