ఢిల్లీ వర్సెస్ లక్నో... ఆందోళనలో ఒకరు, ఆత్మవిశ్వాసంతో మరొకరు!
ఇక ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఆఖర్లో ఉంది ఢిల్లీ
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 26 మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ లక్నో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా స్టేడియం ముస్తాబైంది. ఈ సీజన్ లో ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత.. లక్నో వరుసగా హ్యాట్రిక్ విజయాలు నందు చేసింది. ఇక ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఆఖర్లో ఉంది ఢిల్లీ.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న లక్నో... తన చివరి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను 33 పరుగుల తేడాతో ఓడించి అధిక విశ్వాసంతో ఈ మ్యాచ్ లోకి ప్రవేశిస్తుందనే చెప్పాలి. లక్నో బ్యాటర్స్ లో గత మ్యాచ్ లో మార్కస్ స్టోయినిస్ 58 పరుగులతో ఫాం ను అందుకోగా.. నికోలస్ పూరన్ - ఆయుష్ బడోని చివరి వరకు కీలక ఇన్నింగ్స్ లు ఆడారు.
ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే... అందరి దృష్టి స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్ పైనే ఉన్నప్పటికీ... అసాధారణమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది యష్ ఠాకూర్. ఆ మ్యాచ్ లో అతడు అద్భుతమైన స్పెల్ ని అందించాడు. ఇందులో భాగంగా... తన 4 ఓవర్ల కోటాలో ఒక మెయిడెన్ ఓవర్ వేసి 5 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఢిల్లీ విషయానికొస్తే... ఇక్కడ బౌలర్లను గత మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లు చితక్కొట్టేశారు. ఇదే సమయంలో ముంబై బ్యాటర్లు సైతం 233 పరుగులు బాదడం కూడా ఆ బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని చెబుతోంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగితేనే పరిస్థితిలో కాస్త మార్పు రావొచ్చు... అలాకానిపక్షంలో మరో భారీ స్కోరు కన్ ఫాం అనే భావించాలి!
హెడ్-టు-హెడ్ రికార్డ్ లు!:
లక్నో, ఢిల్లీ ఇప్పటి వరకు మూడు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. అయితే... వీటన్నింటిలో లక్నో విజయం సాధించింది. ఇక, ఢిల్లీపై లక్నో అత్యధిక స్కోరు 195 కాగా, లక్నోపై ఢిల్లీ అత్యధిక స్కోరు 189.
పిచ్ రిపోర్ట్!:
ఈ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ వేదికపై చాలా తక్కువ టీ20 మ్యాచ్ లు జరిగగా.. వాటిలో పేసర్లు 65 వికెట్లు, స్పిన్నర్లు 47 వికెట్లు తీశారు. ఇక ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 155 పరుగులు కాగా... ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్ లో లక్నో ఆటగాడు యశ్ ఠాకూర్ 3.5 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే!