ఒకరు కాదు.. ఇద్దరు.. టీమిండియా హెడ్ కోచ్ లు
ఇప్పుడు ద్రవిడ్ పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త కోచ్ ఎంపిక చేపడుతున్నారు.
ఓ పది పదిహేనేళ్ల కిందటి వరకు టీమిండియాకు కోచ్ ఒక్కరే ఉండేవారు. ఫీల్డింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ అని వేర్వేరుగా ఉండేవారు కాదు. కానీ, ఐపీఎల్ కారణమో, టి20 ప్రభావమో, అధిక భారం పడకూడదనో అన్ని విభాగాలకూ కోచ్ లను పెట్టి వారిపై హెడ్ కోచ్ ను నియమిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక కోచ్ పదవిలో రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి వంటి దిగ్గజాలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ద్రవిడ్ పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త కోచ్ ఎంపిక చేపడుతున్నారు.
ఇతడితో పాటు అతడూ
టీమిండియా ప్రధాన కోచ్ గా ప్రధానంగా వినిపిస్తున్న పేరు గౌతమ్ గంభీర్. మాజీ ఓపెనర్ కు అందరికంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిన్నటివరకు అనుకున్నారు. అయితే, ఇప్పుడు మరో మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్ కూడా బీసీసీఐ ఇంటర్వ్యూకు వెళ్లాడు. ఇప్పటికే గంభీర్ తన ప్రణాళికలను వివరించాడు. రామన్ కూడా రోడ్ మ్యాప్‌ను సమర్పించినట్లు తెలిసింది. ఇక గంభీర్ ఐపీఎల్ లో లక్నో, కోల్ కతాల ఫ్రాంచైజీలకు మెంటార్ గా పనిచేశాడు. రామన్ భారత్-ఎ, అండర్-19తో పాటు మహిళల జట్టు కోచ్ గా వ్యవహరించాడు.
పోటీ గట్టిగానే..
గంభీర్ కంటే పదేళ్ల సీనియర్ అయిన రామన్ కూడా పోటీకి రావడంతో ఎవరిని తీసుకోవాలనే సంక్లిష్ట పరిస్థితి బీసీసీఐకి ఎదురైంది. మధ్యే మార్గంగా ఇద్దరి సేవలనూ వాడుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. గంభీర్ ను హెడ్ కోచ్ గా, రామన్ ను బ్యాటింగ్ లేదా టెస్టు కోచ్ గా నియమించాలని చూస్తోంది.
టి20 వరల్డ్ కప్ ముగిశాక.. వరుసగా 15 నెలలు భారత్ వన్డేలు, టెస్టులే ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి. మరోవైపు ద్రవిడ్ స్థానంలో జూలై 1 నుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. బీసీసీఐ పది రోజుల్లో కొత్త కోచ్ ను ప్రకటించాల్సి ఉంటుంది.