147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు!
700 వికెట్లు తీసిన ఏకైక పేసర్ గా అండర్సన్ ప్రస్తుతం ఓవరాల్ గా అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు
మూడు దశాబ్దాల కిందట ఓ బౌలర్ 400 వికెట్లు తీయడమే గొప్ప.. రెండు దశాబ్దాల కిందట ఆస్ట్రేలియా గ్రేట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 500 వికెట్లు పడగొడితే అబ్బో అనుకున్నారు.. ఓ పన్నెండేళ్ల క్రితం శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు మైలురాయిని చేరితే అహోఒహో అని కీర్తించారు. వీరి దరిదాపుల్లోకి మరో బౌలర్ వస్తాడా? అని అనుకున్నారు. కానీ, ఆ అనుమానాలను పటాపంచలు చేశాడు ఓ ‘పేస్ బౌలర్’.
41 ఏళ్ల వయసులో..
ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. 41 ఏళ్ల అండర్సన్ టెస్టుల్లో 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 2002లో కెరీర్ మొదలుపెట్టి ఇప్పటికీ ఆడుతున్న అతడు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు సాధించిన తొలి పేసర్ కావడం విశేషం. మురళీధరన్ (800), షేన్ వార్న్ (709) సైతం 700 పైగా వికెట్లు తీసినా, వీరిద్దరూ స్పిన్నర్లు కావడం గమనార్హం. ఇక అండర్సన్ 187 టెస్టులు ఆడాడు. ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో శనివారం ఉదయం భారత్ తొలి ఇన్నింగ్స్ లో కుల్దీప్ యాదవ్ వికెట్ పడగొట్టడం ద్వారా అండర్సన్ 700వ వికెట్ సాధించాడు. స్వింగ్ కింగ్ గా పేరున్న అండర్సన్ 22 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. 2003 మేలో తొలి టెస్టు ఆడాడు. అంటే సరిగ్గా 21 ఏళ్ల కిందట.
సచిన్ రికార్డును చేరతాడా..?
700 వికెట్లు తీసిన ఏకైక పేసర్ గా అండర్సన్ ప్రస్తుతం ఓవరాల్ గా అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ కు చెందిన బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ (200) మొదటి స్థానంలో ఉన్నాడు. మరొక్క 13 టెస్టులు ఆడితే అండర్సన్ ఈ రికార్డును సమం చేసే అవకాశం ఉంది. అయితే, మరికొద్ది రోజుల్లో అండర్సన్ 42 ఏళ్లు పూర్తిచేసుకోనున్నాడు. మరి అతడిని 200 టెస్టులు ఆడే అవకాశం ఇస్తారా? అంటే.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సచిన్ రికార్డు పట్ల అసూయనే దీనికి కారణమనేది ఓ అభిప్రాయం.
రెండోస్థానం గ్యారంటీ..
ఆడిన టెస్టుల సంఖ్యలోనే కాకుండా.. అత్యధిక వికెట్ల జాబితాలోనూ అండర్సన్ రెండో స్థానంలో నిలవడం గ్యారెంటీ. మరో 10 వికెట్లు తీస్తే వార్న్‌ను అధిగమించే అవకాశం ఉంది. కెరీర్ లో 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన అండర్సన్.. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 7/42.
కొసమెరుపు: గత ఏడాది క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ కు చెందిన మరో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 604 వికెట్లు తీశాడు. అండర్సన్-బ్రాడ్ ద్వయం టెస్టుల్లో వెయ్యి పైగా వికెట్లు పడగొట్టింది. ఇద్దరు పేసర్లు ఒకే తరంలో ఆడుతూ ఈ రికార్డును చేరడం గొప్ప విషయం. ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్-మెక్ గ్రాత్ కూడా వెయ్యి వికెట్లు తీసినా.. వీరిలో వార్న్ స్పిన్నర్, మెక్ గ్రాత్ పేసర్. ఇక ఇప్పటి పేసర్లలో అండర్సన్ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు.