పాక్ టుర్ పై బీసీసీఐ కీలక నిర్ణయం!... బంతి ఐసీసీ కోర్టులో!?
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఈ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్.. ఆ దేశానికి వెళ్తోందా? అనే చర్చ తెరపైకి వచ్చింది. కారణం... చివరిసారిగా 2008లోనే భారత్... పాక్ టూర్ చేసింది. గడిచిన 16 ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే రెండు జట్లూ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది!
అవును... 2025 ఫిబ్రవరి నుంచి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ వేదిక కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి ముసాయిదా ప్రకారం మార్చి 1న లాహోర్ లోని గడ్డాఫీ స్టేడియంలో భారత్ - పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే... ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ జట్టు పాక్ కు వెళ్లడానికి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) నిరాకరించినట్లు ఏ.ఎన్.ఐ. పేర్కొంది.
ఇదే సమయంలో... ఈ టోర్నీని తటస్థ వేదికల్లో నిర్వైంచాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ని కోరనుందని అంటున్నారు. ఈ మేరకు దుబాయ్ లేదా శ్రీలంకలలో నిర్వహిస్తే తాము టోర్నీలో పాల్గొంటామని చెప్పనున్నట్లు పేర్కొంది! మరోపక్క వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీని నిర్వహించేందుకు పాకిస్థాన్ ఏర్పాట్లు చేసుకొంటోంది.
8 జట్లతో కూడిన ఈ టోర్నీ షెడ్యూల్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త్వరలో ఖరారు చేయనుంది. ఇందులో భాగంగా... లాహోర్ లో ఏడు మ్యాచ్ లు, రావల్పిండిలో అయిదు, కరాచీలో మూడు మ్యాచ్ లు నిర్వహించేందుకు పాక్ బోర్డు ప్లాన్ చేసిందని అంటున్నారు. ఈ క్రమంలోనే భారత్ - పాక్ హై వోల్టేజ్ మ్యాచ్ ను మార్చి 1న లాహోర్ లో నిర్వహించాలని అనుకున్నారని తెలుస్తోంది.
అయితే... పాకిస్థాన్ వెళ్లేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని తెలుస్తోన్న వెళ పాక్ ఎలా రియాక్ట్ అవుతాదనేది వేచి చూడాలి. కారణం... తమ దేశానికి భారత్ వస్తుందని, ఫలితంగా ఆర్థికంగా దేశానికి మేలు జరుగుతుందని పాక్ ఎన్నో ఆశలు పెట్టుకుందని అంటున్నారు.
కాగా... పాకిస్థాన్ లో భారత్ టూర్ చివరిసారిగా 2008లో జరిగింది. అనంతరం... 2012 - 13లో చివరిసారిగా రెండు జట్ల మధ్య క్రికెట్ సిరీస్ జరిగింది. మరోపక్క 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు పాకిస్థాన్ మాత్రం భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్ కతా వేదికల్లో ఆ జట్టు మ్యాచ్ లు ఆడింది.