రాకెట్ విడిచిన స్పెయిన్ టెన్నిస్ బుల్!

బుల్ ఫైట్ అంటే స్పెయిన్ అందరికీ గుర్తొస్తోంది అదే దేశం నుంచి సరిగ్గా 20 ఏళ్ల కిందట దూసుకొచ్చాడు రఫెల్ నాదల్.

Update: 2024-10-10 11:00 GMT

మట్టి కోర్టులో తిరుగులేని ఆ టెన్నిస్ రాకెట్ ఇక కనిపించదు.. ప్రపంచ పురుషుల టెన్నిస్ చరిత్రలో ఎందరో గొప్ప ఆటగాళ్లు.. మరెందరో మేటి ఆటగాళ్లు.. కానీ, బంతిని అతడిలా బలంగా కొట్టగల ప్లేయర్ మరొకరు కనిపించలేదు.. మరీ ముఖ్యంగా మట్టి కోర్టును తన ఇంటికి కట్టేసుకున్న మొనగాడు ఇంకొకడు పుట్టడు.. స్పెయిన్ నుంచి మహిళా, పురుష టెన్నిస్ ప్లేయర్లు వచ్చారు.. టైటిల్స్ కొట్టారు. సెర్గీ బ్రుగెరా, అరంటా శాంచెజ్ వికారియో, ముగురుజా వంటివారున్నారు. కానీ, అతడు మాత్రం వీరందరినీ మించిన వాడు.

స్పెయిన్ బుల్..

బుల్ ఫైట్ అంటే స్పెయిన్ అందరికీ గుర్తొస్తోంది. అదే దేశం నుంచి సరిగ్గా 20 ఏళ్ల కిందట దూసుకొచ్చాడు రఫెల్ నాదల్. తన పవర్ గేమ్ తో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక స్పెయిన్ నుంచి వచ్చినా.. నాదల్ ను ఫ్రాన్స్ ఆటగాడు అనాలేమో.. ఎందుకంటే.. ఫ్రెంచ్ ఓపెన్ లో అతడి దూకుడు అలా ఉండేది. మట్టి కోర్టుపై జరిగే ఈ గ్రాండ్ స్లామ్ లో నాదల్ ది తిరుగులేని రికార్డు. ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్‌ టైటిళ్లు సాధించగా ఇందులో 14 ఫ్రెంచ్‌ ఓపెన్ టైటిల్సే. రెండుసార్లు ఆస్ట్రేలియన్, రెండుసార్లు వింబుల్డన్ నెగ్గాడు. యూఎస్ ఓపెన్ ను నాలుగుసార్లు గెలుచుకున్నాడు. మొత్తం మీద అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కొట్టిన టెన్నిస్ ప్లేయర్లలో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక సెలవ్..

కొంత కాలంగా గాయాలతో బాధపడుతున్న నాదల్ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కు గుడ్ బై చెప్పాడు. వచ్చే నెలలో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తనకు చివరిది అని ప్రకటించాడు. నాదల్ 1986 జూన్ 3న స్పెయిన్‌ లో పుట్టాడు. 15 ఏళ్ల వయసుకే.. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌ లోకి వచ్చాడు. 19 ఏళ్లకే తొలి టైటిల్‌ (2005-ఫ్రెంచ్‌ ఓపెన్) కొట్టాడు. వాస్తవానికి ఓ దశలో నాదల్ జోరు చూస్తే అత్యధిక గ్రాండ్ స్లామ్ లు (25) కొట్టేవాడిలా కనిపించాడు. కానీ గాయాలు అతడి కెరీర్ ను దెబ్బతీశాయి.

ఆ ముగ్గరిలో మిగిలింది

రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), నొవాక్ జకోవిచ్ (సెర్బియా), రఫెల్ నాదల్ 20 ఏళ్లుగా వీరి ముగ్గురి మధ్యనే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తిరిగాయి. ఫెదరర్ 20, జకోవిచ్ 24, నాదల్ 20 గ్రాండ్ స్లామ్ లు గెలిచారు. మొత్తం 80 గ్రాండ్ స్లామ్ లలో 64 వీరివే అన్నమాట. ఫెదరర్ కొన్నేళ్ల కిందట రిటైర్ కాగా.. నాదల్ కూడా తప్పుకొన్నాడు. ఇక జకోవిచ్ మాత్రమే మిగిలాడు.

Tags:    

Similar News