టీమిండియా లెజెండ్.. కెప్టెన్సీ పోయేందుకు కారణం ఎవరు?

బీసీసీఐ (అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ) ససేమిరా అనడం.. దీంతో కోహ్లి వన్డే, టి20 రెండింటి సారథ్యం వదులుకోవడం అందరికీ తెలిసిందే.

Update: 2023-12-06 14:30 GMT

"పట్టు విడుపులు ఉండాలి" ఈ మాట బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు చెప్పిన మాట. టీమిండియా కెప్టెన్ గా సచిన్ ఉన్న సమయంలో కొన్ని నిర్ణయాలను కచ్చితంగా తీసుకునేవాడు. అవసరమైతే విభేదించేవాడు. ఆ తర్వాత సచిన్ కెప్టెన్సీలో విఫలమై పగ్గాలు వదిలేశాడు. ఆటగాడిగా కొనసాగాడు. అందుకే పట్టు విడుపులు ఉండాలి అని గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఇది ఎంతైనా వాస్తవమే. అందులోనూ టీమిండియా కెప్టెన్సీ అంటే మామూలు మాటలు కాదు.. ఎంతటి దిగ్గజ ఆటగాడికైనా అది ఒక ముళ్ల కిరీటమే... ఈ విషయం బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను అడిగితే చెబుతాడు. గొప్ప గొప్ప క్రికెటర్లు కెప్టెన్ గా సక్సెస్ కాలేరు. నాయకత్వం అనేది ఓ కళ. దానికి లక్ కూడా కలసిరావాలి.

రెండేళ్ల కిందట ఏం జరిగింది?

టీమిండియా చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరంటే వెంటనే వచ్చే పేరు సౌరభ్ గంగూలీ. జట్టుకు దూకుడు నేర్పిన నాయకుడు అతడు. ఒక తరం ఆటగాళ్లను తీర్చిదిద్దాడు కూడా. అలాంటి గంగూలీ రెండేళ్ల కిందట బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టీమిండియా పెద్ద కుదుపునకు గురైంది. అదే కెప్టెన్సీ వివాదం. టి20 ఫార్మాట్ సారథ్యం వదిలేస్తానని స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి చెప్పడం, వన్డేల్లో మాత్రం కెప్టెన్ గా ఉంటానని చెప్పడం.. బీసీసీఐ (అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ) ససేమిరా అనడం.. దీంతో కోహ్లి వన్డే, టి20 రెండింటి సారథ్యం వదులుకోవడం అందరికీ తెలిసిందే. అయితే, మరికొద్ది రోజులకే టెస్టు కెప్టెన్సీనీ త్యజించేశాడు కోహ్లి. ఇదంతా 2021 చివర్లో.. 2022 ప్రారంభంలో జరిగింది.

కోహ్లి వర్సెస్ గంగూలీ

గంగూలీ, కోహ్లి ఇద్దరిదీ దూకుడు స్వభావమే. ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తారు. ఆధిపత్య ధోరణితో వెళ్తారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయినప్పుడే కోహ్లితో పొసగడం సాధ్యమేనా? అనే భావన కలిగింది. చివరికి అదే జరిగింది. కోహ్లి కెప్టెన్సీ వదులుకోగా.. గంగూలీ కూడా పెద్దగా సాధించింది ఏమీలేదు. బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో టర్మ్ ఎంపిక కాలేకపోయాడు. కోహ్లితో రెండేళ్ల కిందట జరిగిన పరిణామాల గురించి నోరిప్పాడు.

రెండేళ్ల తర్వాత నోరిప్పిన

టీ20 కెప్టెన్‌ గా కోహ్లిని తప్పించడంలో తన పాత్రలేదని గంగూలీ అంటున్నాడు. 2021 లో జరిగిన టి20 ప్రపంచ కప్‌ తర్వాత కోహ్లి టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. దీంతోనే గంగూలీతో వైరం ఉందన్న వదంతులు వచ్చాయి. వన్డే, టెస్టు కెప్టెన్‌ గా కొనసాగాలనుకున్నానని.. టి20 కెప్టెన్‌ గా వైదొలగాలనుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని బీసీసీఐ కోరలేదని కోహ్లి తెలిపాడు. ఇది కలకలం రేపింది. అప్పట్లోనే దీనిపై గంగూలీ మాట్లాడాడు. ఇప్పుడు రెండోసారి స్పందించాడు. కెప్టెన్‌ గా విరాట్‌ ను తప్పించడంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. టీ 20 కెప్టెన్‌ గా కొనసాగాలని కోరానని అంటున్నాడు. "టి20ల్లో నాయకత్వం వహించాలనే ఆసక్తి కోహ్లికి లేదని.. దీంతోనే మొత్తం పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి వైదొలిగితే మేలని సూచించా" అని వివరించాడు. అయితే, ఇదే సందర్భంలో అన్ని ఫార్మాట్లలో జట్టుకు నాయకత్వం వహించడానికి రోహిత్‌ శర్మ ఆసక్తి ప్రదర్శించలేదని, తాను ఒప్పించానని గంగూలీ తెలపడం గమనార్హం.

మరిప్పుడు ఏం జరిగింది?

పరిమిత ఓవర్ల ఫార్మాట్ (టి20, వన్డేలు)లో ఇద్దరు కెప్టెన్లు వద్దనేది బీసీసీఐ ఆలోచన. అందుకనే టి20 కెప్టెన్సీతో పాటే వన్డే కెప్టెన్సీ కూడా వదిలేయని కోరినట్లు గంగూలీ తెలిపాడు. కానీ, బీసీసీఐ ఇప్పుడు ఏం చేస్తోంది? టి20లు, వన్డేలకు వేర్వేరే కెప్టెన్లనే నియమించింది. దక్షిణాఫ్రికా టూర్ కు టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ ను, వన్డేలకు కేఎల్ రాహుల్ ను సారథులుగా నియమించింది. మరి కోహ్లి విషయంలో అప్పట్లో అలా ఎందుకు చేసిందనేది ప్రశ్న?

Tags:    

Similar News