టి20 రికార్డుల్లో మరో సూపరో‘హిట్’.. ఎవరికీ సాధ్యం కానివే..
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, టీమిండియా కెప్టెన్సీలు రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య మ్యూజికల్ చైర్ ను తలపించింది.
టీమిండియా టి20 ప్రపంచ కప్ వేట ఘనంగా మొదలైంది.. తొలి (2007) ప్రపంచ కప్ తర్వాత మళ్లీ విజేతగా నిలవని పేలవ రికార్డు వెంటాడుతుండగా.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. అందులోనూ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఇదే చివరి టి20 ప్రపంచకప్. ఇప్పటికే టి20లకు ‘వీరిద్దరూ అనవసరం’ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత ఏడాది ఓ దశలో పక్కనపెట్టారు కూడా. అయితే, ఎందుకనో మరోసారి జట్టులోకి తీసుకున్నారు సెలక్టర్లు. తిరుగులేని ఆటగాళ్లు కావడంతో రోహిత్, కోహ్లిల గురించి ఎంత తక్కువ విమర్శలు చేస్తే అంత మంచిది.
మిస్టర్ కెప్టెన్
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, టీమిండియా కెప్టెన్సీలు రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య మ్యూజికల్ చైర్ ను తలపించింది. గత ఏడాది టి20ల నుంచి దాదాపు తప్పించినంత పనిచేసిన రోహిత్ శర్మను మళ్లీ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించడమే కాక, కెప్టెన్సీ కూడా ఇచ్చారు. రోహిత్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ లాక్కున్న హార్దిక్ పాండ్యాను సారథిగా తప్పించారు. ప్రపంచ కప్ లో రోహిత్ కు కెప్టెన్సీ ఇచ్చి, హార్దిక్ ను వైస్ కెప్టెన్ చేశారు.
ఈ రెండు రికార్డులు..
బుధవారం ఐర్లాండ్ తో టి20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థిని 96 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ 52 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్ గా తప్పుకొన్నాడు. అనంతరం రిషభ్ పంత్ (36 నాటౌట్) లక్ష్యాన్ని పూర్తి చేశాడు. కాగా, ఇది టి20ల్లో కెప్టెన్ గా రోహిత్ కు 42వ విజయం. మరే భారత కెప్టెన్ కూడా ఇన్ని మ్యాచ్ ల్లో టీమిండియాను గెలిపించలేదు. ఇప్పటివరకు ఈ ఘనత ధోని (41) పేరిట ఉంది.
300 అంతర్జాతీయ విజయాలు
టి20 కెప్టెన్ గా అరుదైన రికార్డు మూటగట్టుకున్న రోహిత్.. 300 అంతర్జాతీయ విజయాల్లో భాగమైన ఆటగాడిగానూ నిలిచాడు. దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలకు మాత్రమే ఈ ఘనత సాధ్యమైంది.
4000 పరుగులు దాటేశాడు
ఐర్లాండ్ తో మ్యాచ్ ద్వారా 152 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లాడిన రోహిత్.. 4 వేల పరుగుల మైలురాయినీ చేరుకున్నాడు. 144 ఇన్నింగ్స్ లో అతడీ ఘనత సాధించాడు. టి20ల్లో రికార్డు స్థాయిలో 5 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు రోహిత్. ఈ ప్రపంచ కప్ లో అతడు మరో సెంచరీ కొడతాడేమో..? అది కూడా ఆదివారం పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లోనే సాధిస్తాడేమో?