కుర్రాళ్లూ.. ఆ షాట్లేమిటి..? వికెట్ పారేసుకోవడమేంటి..?
బంగ్లాదేశ్ పై గురువారం నాటి మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ లో అదరగొట్టింది.. ఫీల్డింగ్ లో దుమ్మురేపింది.. బ్యాటింగ్ లో చెండాడింది
బంగ్లాదేశ్ పై గురువారం నాటి మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ లో అదరగొట్టింది.. ఫీల్డింగ్ లో దుమ్మురేపింది.. బ్యాటింగ్ లో చెండాడింది. ఒకవిధంగా చెప్పాలంటే బంగ్లాకు మనకు పదేళ్ల తేడా ఉంది అన్నట్లుగా ఆటాడుకుంది. బ్యాటింగ్ లో అయితే మరీ పసికూనపై విరుచుకుపడినట్లు ఆడారు మన బ్యాట్స్ మెన్. అసలే పుణె పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. అందులోనూ బంగ్లాదేశ్ బౌలింగ్. ఇంకేం..? ఆకలి మీద ఉన్న పులిలా చెలరేగారు. అయితే, ఇందులో ఇద్దరు యువకుల షాట్లు మాత్రం చర్చనీయాంశం అయ్యాయి. మంచి పునాది ఏర్పడి.. భారీ స్కోరు సాధించే అవకాశం ఉండగా వారు ఆ షాట్లు ఆడి వికెట్లు పోగొట్టుకున్నారు. దీనిపై దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు.
అర్ధ శతకం తర్వాత..
టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ ఈ ఏడాది అద్భుత ఫామ్ లో ఉన్నాడు. బంగ్లాతో మ్యాచ్ లో అతడు అర్ధ సెంచరీ కొట్టాడు. కళాత్మక షాట్లతోనే విధ్వంసం రేపే అతడు చెత్త షాట్ ఆడి బంగ్లాకు వికెట్ ఇచ్చేశాడు. గిల్ 53 పరుగుల వద్ద ఉండగా..
బంగ్లా స్పిన్నర్ మెహిదీ హసన్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టాడు. సిక్స్ రాబడదామనే ఉద్దేశంలో ఔటయ్యాడు. మరో బ్యాట్స్ మన్, పాకిస్థాన్ పై చక్కటి ఇన్నింగ్స్ తో అర్థ సెంచరీ కొట్టిన శ్రేయస్ అయ్యర్ (19) కూడా ఇంతే. వాస్తవానికి అయ్యర్ ఔటయ్యేటప్పటికే టీమిండియా గెలుపు ఖరారైంది. మరో ఎండ్ లో విరాట్ కోహ్లి చెలరేగి ఆడుతున్నాడు. అయ్యర్ కూడా నిలదొక్కుకున్నాడు. కానీ, మెహదీ హసన్ బౌలింగ్ లో అడ్డంగా షాట్ ఆడి లాంగాన్ లో క్యాచ్ ఇచ్చాడు. టీమిండియా మ్యాచ్ గెలిచినప్పటికీ.. వీరిద్దరి షాట్లు మాజీలు, ముఖ్యంగా గావస్కర్ కు కోపం తెప్పించాయి.
ఓపిక లేకుంటే ఎలా..?
అయ్యర్ ముంబై బ్యాట్స్ మన్. సహజంగా ముంబైకర్ల పక్షపాతి అయిన గావస్కర్.. నిన్నటి మ్యాచ్ లో అయ్యర్ షాట్ ను తప్పుబట్టాడు. అయ్యర్ ఓపిక కోల్పోయాడని మండిపడ్డాడు. ఇక గిల్ హాఫ్ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడని.. కాస్త శాంతించాల్సిందని సూచించాడు.
కోహ్లిని చూసి నేర్చుకోండి..
గిల్, అయ్యర్ భారత భవిష్యత్ స్టార్లు. అందుకనే వీరిద్దరూ కోహ్లీని చూసి నేర్చుకోవాలని గావస్కర్ సూచించాడు. కోహ్లి చాలా అరుదుగా వికెట్ ఇస్తాడని.. అంటే తన వికెట్ కు అతడు ఇచ్చే విలువను చూసి నేర్చుకోవాలని పేర్కొన్నాడు. కోహ్లి 70-80 స్కోరు వద్ద ఉన్నప్పుడు సెంచరీ చేసేందుకు అవకాశం ఉందని గ్రహించాడు. దాన్ని వదులుకోకూడదని భావించాడు. అందులో తప్పేముంది? రోజూ సెంచరీ చేసే అవకాశం రాదు కదా..? మంచి ఆరంభాన్ని సెంచరీగా ఎలా మలచాలనే విషయాన్ని కోహ్లిని చూసి నేర్చుకోవాలి... అని గావస్కర్ హితబోధ చేశాడు.
అయ్యర్ సెంచరీలేవి..?
గిల్ ఈ ఏడాది ఐదారు సెంచరీలు కొట్టాడు. అయ్యర్ మాత్రం గాయాల నుంచి కోలుకుని వచ్చాడు. దీన్ని కూడా గావస్కర్ ప్రస్తావించాడు. ''గిల్ సెంచరీలు చేస్తున్నాడు. అయ్యర్ నుంచి శతకాలు లేవు. నంబర్ 4లో అవకాశం వచ్చినప్పుడు.. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న సందర్భంలోనూ.. పదును లేని బౌలింగ్ అటాక్‌లోనూ వికెట్ ఇవ్వడం అంటే అది బ్యాట్స్ మన్ తప్పిదమే. అవకాశాలు మళ్లీ మళ్లీ రావు అయ్యర్. అది గుర్తుంచుకో'' అంటూ గావస్కర్ విశ్లేషించాడు.