మీరు మా దేశానికి రారెందుకు? పాకిస్థానీకి సూర్యకుమార్ ఏం చెప్పాడు?
దీంతో సూర్యకుమార్ స్పందిస్తూ.. "సోదరా.. ఈ సంగతి ఆటగాళ్ల చేతుల్లో లేదు" అని చెప్పాడు.
విభేదాలు ఎన్నయినా ఉండనీ..? ఆ దేశంతో శత్రుత్వం ఉండనీ..? ఈ తరం భారత అభిమానులు ఓ అవకాశం కోల్పోయారు.. అదేమంటే.. పాకిస్థాన్ లో భారత్ పర్యటన. దాయాది దేశంలో మన జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే చూసే చాన్స్ కోల్పోయారనే చెప్పాలి. బహుశా 2008 తర్వాత.. అంటే 16 ఏళ్లలో భారత జట్టు పాక్ వెళ్లేదు. 2008లో ఆసియా కప్ లో ఆడింది. కరాచీలో జరిగిన ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడింది. ఇక పొరుగు దేశం గడ్డపై భారత్ టెస్టులు ఆడి 20 ఏళ్లయింది.
కోహ్లి మిస్.. రోహిత్ జస్ట్..
ఇప్పుడున్న టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ తప్ప భారత ఆటగాళ్లెవరూ పాకిస్థాన్ వెళ్లలేదు. రోహిత్ కూడా 2008లో 20 ఏళ్ల కుర్రాడిగా పాక్ లో పర్యటించాడు. కోహ్లి సహా మరే ప్రస్తుత టీమ్ ఇండియా ప్లేయర్ కూడా పాక్ గడ్డపై ఆడలేదు. అంటే.. ఒక తరం ఆటగాళ్లంతా పాకిస్థాన్ లో పర్యటించలేదు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈసారి ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కు దక్కాయి. కానీ, భారత్ 2008లో జరిగిన 26/11 కాల్పులు తర్వాత పాక్ లో పర్యటించేది లేదని చెప్పేసింది. ఆ దేశాన్ని కూడా ఆహ్వానించడంలేదు. ఈ నేపథ్యంలోనే భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.
సూర్యకు ప్రశ్న.. సమాధానం ఇదే..
పాకిస్థాన్ ఓ వైపు చాంపియన్స్ టోర్నీ నిర్వహణ ఏర్పాట్లలో ఉంది. అయితే , తమ జట్టును పంపబోమని బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు (ఐసీసీ) తేల్చిచెప్పింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్ లను వేరే దేశం (హైబ్రిడ్ మోడల్)లో జరపాలని ఐసీసీ కోరినా పాక్ నిరాకరించింది. కాగా, ఈ దీనిపై టీమ్ ఇండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు పాకిస్థానీ నుంచి ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న అతడు రింకూ సింగ్ మరికొందరు ఆటగాళ్లతో కలిసి బయటకు వెళ్లాడు. వారికి పాకిస్థాన్ కు చెందిన అభిమాని ఎదురుపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘‘మీరు మా దేశానికి ఎందుకు రావడం లేదో చెప్పండి’’ అని అడిగాడు. దీంతో సూర్యకుమార్ స్పందిస్తూ.. "సోదరా.. ఈ సంగతి ఆటగాళ్ల చేతుల్లో లేదు" అని చెప్పాడు.