మబ్బు చాటు సూర్యను వెలుగులోకి తెచ్చిన గంభీర్.. ఈ బంధం ప్రత్యేకం

మొన్నటి టి20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అంతకుముందు కెప్టెన్సీ కూడా చేశాడు.

Update: 2024-07-26 23:30 GMT

ఇప్పుడంటే అందరూ భారత టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ ను అహో ఒహో అని ఆకాశానికెత్తేస్తున్నారు.. కానీ, అతడు 2008 నుంచే రంజీల్లో ఆడుతున్నాడు. అప్పటికి అతడికి 17-18 ఏళ్లు ఉంటాయేమో..? కానీ, దాదాపు 15 ఏళ్లపాటు సూర్యను ఎవరూ గుర్తించలేదు. మీడియం పేస్ వేసే బ్యాటింగ్ ఆల్ రౌండర్ గానే సూర్యను భావించారు. అతడిలో హార్డ్ హిట్టర్ ఉన్నాడని.. మ్యాచ్ లను మలుపు తిప్పే మెరుపు ఇన్నింగ్స్ ఆడతాడని ఎవరూ ఊహించలేదు. కానీ.. టైమ్ వస్తే ఎవరైనా లైమ్ లైట్ లోకి వస్తారు. ఇప్పుడు సూర్య విషయంలో ఇదే జరుగుతోంది. ఎప్పుడో 16 ఏళ్ల కిందటే ముంబైకి రంజీల్లో ఆడిన అతడు.. ఓ దశలో ఆటగాళ్లను తిడతాడంటూ రంజీ జట్టు సభ్యులు వ్యతిరేకించడంతో కెప్టెన్సీ కోల్పోయిన అతడు.. ఇప్పుడు ఏకంగా భారత జట్టుకే కెప్టెన్ అయ్యాడు. అది కూడా కెప్టెన్ రేసులో ముందున్న హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ ను వెనక్కునెట్టి సారథ్యం దక్కించుకున్నాడు. మరి దీనంతటికీ కారణం ఎవరు?

అంతా అతడి చలవే..

మొన్నటి టి20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అంతకుముందు కెప్టెన్సీ కూడా చేశాడు. ఫామ్ లోనూ ఉన్నాడు.దీంతో శ్రీలంకతో టి20 సిరీస్‌ కు పాండ్యానే భారత కెప్టెన్ అని అనుకున్నారంతా. కానీ, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ.. సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్సీ వరించింది. ఇటీవలి కాలంలో భారత క్రికెట్ లో ఇదే అత్యంత ఆశ్చర్యకర ఎంపిక అని చెప్పాలి. అయితే, దీనంతటికీ కారణం.. కొత్త హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌. శనివారం నుంచి లంకతో సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించబోతున్న సూర్య మరో రెండేళ్లు కనీసం కెప్టెన్ గా ఉంటాడని భావించవచ్చు. ఈ క్రమంలో గంభీర్‌ తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని అతడు చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోష‌ల్ మీడియాలో పెట్టింది.

పదేళ్ల కిందట మలుపు..

సూర్యను 2008 నుంచి తాను గమనిస్తున్నట్లు టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ ఓసారి చెప్పాడు. అలాంటిది సూర్య వెలుగులోకి వచ్చింది 5 ఏళ్ల కిందటే. కానీ, 2014లో కోల్‌ క‌తా నైట్‌ రైడ‌ర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కెప్టెన్ గా ఉన్న గంభీర్ చొరవ చూపి సూర్యకు చాన్సిచ్చాడు. ఆ తర్వాతే అతడికి అవ‌కాశాలు మెరుగయ్యాయి. గంభీర్ కు త‌న‌కు ఎంతో ప్ర‌త్యేక‌ బంధం ఉందని.. తాను ఎలా ఆడ‌తానో, ఎలా ఆలోచిస్తానో అత‌డికి తెలుసని సూర్య వివరించాడు.

గంభీర్ కెప్టెన్సీనే కాదు కోచింగూ తెలుసు

కోచ్‌ గా గంభీర్ ఎలా ప‌నిచేస్తాడోనన్నది త‌న‌కు తెలుసని సూర్య తెలిపాడు. తమ ఇద్ద‌రి కాంబినేష‌న్‌ లో ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయోన‌న్న ఆస‌క్తి ఉంద‌న్నాడు. తాను కెప్టెన్ గా లేని స‌మ‌యంలోనూ మైదానంలో నాయ‌కుడిగా ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని సూర్య చెప్పాడు. ఎంతో మంది కెప్టెన్లను ద‌గ్గ‌రనుంచి చూస్తూ.. వారినుంచి ఎంతో నేర్చుకున్న‌ట్లు వివరించాడు. ఇప్పుడు తనకే బాధ్య‌త‌లు రావ‌డం ఆనందంగా ఉందన్నాడు. గొప్ప బాధ్యతను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.

Tags:    

Similar News