హిస్టరీ క్రియేట్ చేసిన టీమిండియా.. 48 ఏళ్ల వరల్డ్ కప్ లో మొదటిసారి
ఈ విజయంతో వరల్డ్ కప్ చరిత్రలో గడిచిన 48 సంవత్సరాలుగా మరే జట్టుకు సాధ్యం కాని వరుస విజయాల అరుదైన రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది.
మైదానం ఏదైనా.. ప్రత్యర్థి జట్టు ఎవరైనా ఫలితం మాత్రం టీమిండియానే మ్యాచ్ గెలిచేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎనిమిది మ్యాచ్ ల్లో వరుస విజయాల్ని సాధిస్తూ మాంచి ఊపు మీద ఉన్న టీమిండియా తాజాగా మరో ఘన విజయాన్ని సాధించటమే కాదు..అసమానమైన రికార్డుతో.. హిస్టరీని క్రియేట్ చేసిందని చెప్పాలి. తాను ఆడుతున్న తొమ్మిది మ్యాచ్ లోనూ ప్రత్యర్థి నెదర్లాండ్స్ జట్టును మట్టి కరిపించటం ద్వారా.. ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాల్ని సాధించి సెమీస్ కు దూసుకెళ్లిన జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది.
దీపావళి వేళ.. ఆదివారం నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో వరల్డ్ కప్ చరిత్రలో గడిచిన 48 సంవత్సరాలుగా మరే జట్టుకు సాధ్యం కాని వరుస విజయాల అరుదైన రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది. తాజా మ్యాచ్ లో ఐదుగురు భారత బ్యాటర్లు 50 పరుగల కంటే ఎక్కువ చేయటం విశేషం.
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ అలా జరగలేదు. ముగ్గురు టీమిండియా బ్యాటర్లు హాఫ్ సెంచరీలు.. ఇద్దరు సెంచరీలు సాధించటం విశేషం. మొత్తం 50 ఓవర్ల మ్యాచ్ లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్ ను ఐదుగురు బ్యాటర్లు సాధించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. వరల్డ్ కప్ కాకుండా జరిగిన మ్యాచ్ లో ఐదుగురు బ్యాటర్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించినా.. ప్రపంచకప్ టోర్నీలో మాత్రం ఆ రికార్డు ఎవరి మీదా లేదు.
2008లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాటర్లు ఐదుగురు హాఫ్ సెంచరీ సాధించారు. 2013, 2020ల్లో జరిగిన మ్యాచ్ లలో భారత్ పై ఆసీస్ బ్యాటర్లు అర్థశతకాలతో చెలరేగిపోయారు. కానీ.. ప్రపంచకప్ టోర్నీలో మాత్రం ఇలాంటివి చోటు చేసుకున్నది లేదు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ బౌలర్లు టీమిండియా బ్యాటర్లు ఊచకోత కోశారు. యాభై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 410 పరుగులు చేయటం గమనార్హం. ఇందులో కేఎల్ రాహుల్ 63 బంతుల్లో 102 పరుగులు చేస్తే.. శ్రేయస్ అయ్యర్ 94 బంతుల్లో 128 పరుగులు.. రోహిత్ శర్మ 61.. శుభమన్ గిల్ 51.. విరాట్ కోహ్లీ 51 పరుగులు తీయటంతో.. ఈ భారీ స్కోర్ సాధ్యమైంది. ఈ తరహాలో బ్యాట్ ఝుళిపించిన జట్టు ఏదీ ప్రపంచకప్ టోర్నీలో లేదని చెబుతున్నారు.