11 మందిలో ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లు.. నిన్నటి మ్యాచ్ లో విశేషం
చూస్తూ ఉంటే మున్ముందు టీమిండియాలో రైట్ హ్యాండర్ల కంటే లెఫ్ట్ హ్యాండర్లే అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది
చూస్తూ ఉంటే.. మున్ముందు టీమిండియాలో రైట్ హ్యాండర్ల కంటే లెఫ్ట్ హ్యాండర్లే అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అదేంటో గాని టీమిండియాలో ఎడమ చేతివాటం బ్యాట్స్ మన్ చాలా తక్కువ. ఎప్పుడో ఐదేళ్లకో పదేళ్లకో గాని ఓ మంచి బ్యాట్స్ మన్ రారు.. సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్ గత 25 ఏళ్లలో భారత క్రికెట్ జట్టుకు ఆడిన లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్. వీరంతా వేర్వేరు సమయాల్లో ఆడారు. గంగూలీ, యువరాజ్ సూపర్ సక్సెస్ అయ్యారు. రైనా, ధావన్ పరిమిత స్థాయిలో మెరుపులు మెరిపించారు. ఓ ముప్పై ఏళ్ల కిందట వినోద్ కాంబ్లీ రూపంలో అద్భుతమైన ప్రతిభ ఉన్నక్రికెటర్ వెలుగులోకి వచ్చినా.. అతడి ప్రస్థానం నాలుగైదేళ్లకు ముగిసింది.
నిఖార్సయిన లెఫ్టీ కోసం వెదుకులాట
ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం టీమిండియాకు నిఖార్సయిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ లేడు. అందులోనూ ఓపెనింగ్ లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉంటే ప్రత్యర్థి జట్లకు కష్టాలే. వారి కోసం ఫీల్డింగ్ సెట్ చేయడం, అందుకుతగ్గట్లు బంతులేయడం బౌలర్లకు తలకుమించిన భారం. కానీ, టీమిండియాకు ఈ సౌలభ్యం లేదు. ధావన్ వైఫల్యం తర్వాత ఐదేళ్లుగా టెస్టుల్లో అసలు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మనే కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే జట్టుకు ఎడమ చేతివాటం బ్యాట్స్ మన్ అవసరం ఉందంటూ మాజీలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొరత తీరగా వచ్చారు కుర్రాళ్లు..
కరువుతో అల్లాడిన నేలపై ఎడతెరపి లేని పిడుగుల వాన పడినట్లు టీమిండియాలోకి దూసుకొస్తున్నారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్. ఒకరూ ఇద్దరు కాదు.. ఓపెనింగ్ నుంచి ఆల్ రౌండర్ల వరకు పదుల సంఖ్యలో లెఫ్ట్ హాండర్లు జట్టులోకి వచ్చేందుకు ''పరుగులు'' పెడుతున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవల్సింది ఓపెనర్ యశస్వి జైశ్వాల్, హైదరాబాదీ తిలక్ వర్మ. జైశ్వాల్ వెస్టిండీస్ తో సిరీస్ లో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. అతడికి వన్డే, టి20ల్లోకీ రావడం ఖాయం. ఇక తిలక్ వర్మ నిన్నటి మ్యాచ్ లో దుమ్మురేపాడు. అలవోకగా సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు.
ఇదీ ''ఎడమ చేతివాటం'' జాబితా
జైశ్వాల్, తిలక్ స్థాయిలోనే ప్రతిభ ఉన్నవాడు తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్. ఐపీఎల్ ఫైనల్లో అతడి ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లాస్ తో పాటు దూకుడూ సుదర్శన్ సొంతం. టీమిండియా తలుపు తడుతోన్న మరో కెరటం ఇతడు. మరోవైపు ఐపీఎల్ లో కోల్ కతా తరఫున దుమ్మురేపాడు రింకూ సింగ్. అతడి మెరుపులతోనే కోల్ కతా ఆ మాత్రమైనా పోటీ ఇవ్వగలిగింది. అందుకనే రింకూకు జాతీయ జట్టులోకి పిలుపొచ్చింది. ముంబై ఆటగాడు శివమ్ దూబె రెండేళ్ల కిందట భారత్ కు ఆడాడు. ఈసారి ఐపీఎల్ లో చెన్నై టైటిల్ గెలవడంలో శివమ్ పాత్ర కీలకం. కోల్ కతా ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఇప్పటికే తానేంటో చాటాడు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది ఉన్నారు. బౌలర్లలో అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జైదేవ్ ఉనద్కత్ ఇప్పటికే జట్టులో సభ్యులు. అర్జున్ నాగ్వాస్ వాలా వంటి పలువురు యువ పేసర్లు జట్టులోకి వచ్చేందుకు పోటీపడుతున్నారు.
నిన్నటి మ్యాచ్ లో ఇదీ చిత్రం..
వెస్టిండీస్ తో గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా తుది జట్టులో ఐదుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లున్నారు. వారు.. ఇషాన్ కిషన్, తిలక్, అర్షదీప్, కుల్దీప్, అక్షర్ పటేల్. వీరంతా బ్యాటింగ్ కూ దిగారు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో జైశ్వాల్ ను ఆడిస్తారని భావించారు. కానీ అతడికి చాన్స్ దొరకలేదు. సంజూ శాంసన్ బదులు జైశ్వాల్ ఆడి ఉంటే అప్పుడు ఆరుగురు బ్యాట్స్ మెన్ ఎడమచేతి వాటం అయ్యేవారు. అంటే 11 మందిలో మెజార్టీ బ్యాట్స్ మెన్ ఎడమచేతి వాటం వారన్నమాట. ఒకప్పుడు ఒక్క లెఫ్టీ కూడా లేకుండా మ్యాచ్ ఆడిన జట్టేనా ఇది అని ఆశ్చర్యపోవడం వీరాభిమానుల వంతైది.
కొసమెరుపు..: టీమిండియా ఐదేళ్లుగా టెస్టుల్లో మంచి విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు ఆరేడు నెలలుగా జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచ కప్ లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఇప్పుడిప్పుడే కోలుకుని అడుగులేస్తున్న పంత్ వచ్చే ఏడాది ఐపీఎల్ కల్లా కోలుకునే అవకాశం ఉంది. అతడు ఫిట్ నెస్ సాధిస్తే టీమిండియాలోకి ఎంపికవడం పెద్ద కష్టమేం కాదు. అంటే అప్పుడు ఎడమచేతివాటం వారి మధ్య మరింత పోటీ ఖాయం. చూస్తూ ఉంటే.. మున్ముందు టీమిండియాలో రైట్ హ్యాండర్ల కంటే లెఫ్ట్ హ్యాండర్లే అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.