ఈ వీర 'గంభీర' మనిషి.. టీమిండియా కోచ్ గా రాణించగలడా..?

2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్ లను టీమిండియా గెలుచుకోవడంలో అత్యంత కీలకపాత్ర గంభీర్ దే

Update: 2024-06-18 11:34 GMT

అతడు బ్యాట్ చేతిలో ఉంటే పోరాట యోధుడే.. కానీ, మైదానంలో దుందుడుకు.. అతడు వ్యూహాల పరంగా చాణక్యుడే.. కానీ, ఇప్పటి జట్టులోని ఆటగాళ్లతో కలిసిపోగలడా...? చూసేందుకు గంభీరంగా కనిపించే అతడు చేతల్లో ఎలాంటి ఫలితాలు చూపిస్తాడో..? టీమిండియా హెడ్ కోచ్ గా వస్తాడాని భావిస్తున్న మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మంగళవారం క్రికెట్ సలహా మండలి ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఇప్పటికే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపులో ఉండడం, ఈ నెలాఖరుకు అతడు దిగిపోవాల్సి ఉండడం.. రేసులో గంభీర్ మాత్రమే ఉండడంతో అతడికే అవకాశాలు అని తెలిసిపోతోంది.

ఎలా నడిపిస్తాడో?

2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్ లను టీమిండియా గెలుచుకోవడంలో అత్యంత కీలకపాత్ర గంభీర్ దే. ఆ రెండు కప్ ల ఫైనల్స్ లో గంభీర్ అద్భుత ఇన్నింగ్స్ లు ఆడాడు. మరికొన్ని విలువైన ఇన్నింగ్స్ లు కూడా ఆడిన అతడు ఓ దశలో కెప్టెన్సీకి అర్హుడిగానూ కనిపించాడు. కానీ, ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ లో కోల్ కతా, లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కు గంభీర్ మెంటార్ గా వ్యవహరించాడు. ఈ ఏడాది కోల్ కతా చాంపియన్ గా నిలవడంతో గంభీర్ పేరు మార్మోగింది. కాగా, 2012, 2014 సీజన్లలో కోల్ కతాకు టైటిల్స్ అందించింది గంభీరే. ఇప్పుడు టీమిండియాకు హెడ్ కోచ్ గా రానున్న అతడు జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

నాడు కోహ్లితో ఢీ..

ఒకే రాష్ట్రానికి చెందినవారు అయినప్పటికీ.. గంభీర్, టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లికి ఒకరంటే ఒకరికి పడదనే అభిప్రాయం ఉంది. గతంలో ఇద్దరూ మైదానంలోనే వాదనకు దిగారు. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసిపోయారనేది వేరే విషయం. అయితే, వ్యక్తిత్వ పరంగా ఇద్దరూ దూకుడుగా ఉండే వ్యక్తులే. కోహ్లి కనీసం మూడేళ్లయినా టీమిండియాకు ఆడతాడు. కెప్టెన్ రోహిత్ రెండేళ్లలో తప్పుకొనే చాన్సుంది. ఈ నేపథ్యంలో గంభీర్ కోచ్ గా మూడేళ్లు లేదా నాలుగేళ్లు.. అసలు ఎప్పటివరకు ఉంటాడో చూడాలి.

Tags:    

Similar News