డీఆర్ఎస్ లేకుండానే టీమిండియా మ్యాచ్.. ఫలితం మారి ఉంటే

మైదానంలో అంపైరింగ్ తప్పిదాలను నివారించేందుకే 2008లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) తీసుకొచ్చారు.

Update: 2023-12-15 07:56 GMT

ఆధునిక క్రికెట్ లో పోటీ బాగా పెరిగింది. ఆటగాళ్ల ఫిట్ నెస్ ప్రమాణాల నేపథ్యంలో మ్యాచ్ లో ఒక్క నిర్ణయం చాలు.. ఫలితాన్ని తారుమారు చేసేందుకు అనే పరిస్థితి నెలకొంది. ఈ కారణాలతోనే అంపైరింగ్ లో ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంపైర్లు పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే అందుకు బాధ్యులను చేస్తున్నారు. గతంలో ఇలా ఉండేది కాదు. మైదానంలో అంపైరింగ్ తప్పిదాలను నివారించేందుకే 2008లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) తీసుకొచ్చారు. దీన్ని తెలుగులో నిర్ణయ సమీక్ష పద్ధతిగా పేర్కొంటారు.

బ్యాట్స్ మెన్ గేమ్ లో..

వన్డేల్లో రూల్స్ మార్పుతో, టి20ల రాకతో క్రికెట్ బ్యాట్స్ మెన్ గేమ్ గా మారిపోయింది. బౌలర్లు బలవ్వాల్సిన పరిస్థతి నెలకొంది. ఎంతటి ప్రతిభావంతుడైన బౌలర్ అయినప్పటికీ.. ఫీల్డింగ్ పరిమితులు ఉంటే ఏం చేయగలడు. ఇక క్రికెట్ లో గతంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్ మన్ కే ఎక్కువ. మరికొన్నిసార్లు బ్యాట్స్ మన్ ఔటైనప్పటికీ అంపైర్ తప్పిదంతో బయటపడే వీలుంటుంది. మరిలాంటి పరిస్థితుల్లో బౌలర్లకు మేలు చేస్తుంది డీఆర్ఎస్. ఎల్బీడబ్ల్యూ, బంతి వికెట్ ఎడ్జ్ తీసుకున్న సందర్భాల్లో దీనిని అడుగుతూంటారు. టి20ల్లో ప్రతి జట్టుకు 2 డీఆర్ఎస్ చాన్సులుంటాయి.

మొన్న కరెంటు లేనిచోట

టీమిండియా స్వదేశంలో గత నెలలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఇందులో ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో నిర్వహించిన మ్యాచ్ లో స్టేడియంలోని ఓ వైపున కరెంటు లేని సంగతి తెలిసిందే. బిల్లులు కట్టకపోవడంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఇక ఆ సిరీస్ తర్వాత మూడు టి20ల సిరీస్ కోసం టీమిండియా దక్షిణాఫ్రికా వెళ్లింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. రెండో మ్యాచ్ లో మంచి స్కోరే చేసినా పరాజయం పాలైంది. ఇక జొహన్నెస్ బర్గ్ లో గురువారం జరిగి మూడో టి20 లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచారు. మరీ ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్ల ధాటికి దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరైంది. డేవిడ్ మిల్లర్ (35) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

అది బెడిసికొట్టి ఉంటే..

గురువారం నాటి మ్యాచ్ లో టీమిండియా మొదట 201 పరుగులు చేసింది. మంచి హిట్టర్లున్న దక్షిణాఫ్రికాకు ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు. అయితే, భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని నిలువరించారు. అప్పటికీ మిల్లర్ దూకుడు చూపాడు. జడేజా వేసిన 9వ ఓవర్లో రెండు సిక్సులు కొట్టి ఊపు మీదకు వచ్చాడు. అయితే, ఆ ఓవర్ నాలుగో బంతిని అద్భుతంగా వేశాడు జడేజా. మిల్లర్ డిఫెన్స్ ఆడబోగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ జితేశ్ శర్మ చేతుల్లో పడింది. జితేశ్ క్యాచ్ అప్పీల్ చేసినా అంపైర్ ఇవ్వలేదు. అయితే, ఆ సమయంలో డీఆర్ఎస్ పనిచేయకపోవడతో రివ్యూకు వెళ్లే అవకాశం లేకపోయింది. మిల్లర్ కూడా క్రీజు విడిచి వెళ్లలేదు. అప్పటికి అతడి స్కోరు 18. ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతడు చెలరేగి ఉంటే మ్యాచ్ ఫలితమే మారిపోయేది. కానీ, భారత బౌలర్ల పట్టుదలతో అందుకు అవకాశం లేకపోయింది. కాగా.. ఇంకొంత సేపటి తర్వాత డీఆర్ఎస్ తిరిగి అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ మిల్లర్ చెలరేగి తన జట్టును గెలిపించి ఉంటే ‘‘డీఆర్ఎస్’’ అందుబాటులో లేకపోవడం, అంపైరింగ్ పొరపాటు పెద్ద చర్చనీయాశం అయ్యేది.

Tags:    

Similar News