తొలి టెస్టు పేసర్ సొంతగడ్డపై.. రెండోది కీపర్ సొంతగడ్డపై..

అందులోనూ సొంతగడ్డపై.. ఇంకా విశేషం ఏమంటే.. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో తొలి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.

Update: 2024-02-01 12:30 GMT

భారత క్రికెట్ జట్టు చాలా కాలం తర్వాత సుదీర్ఘ టెస్టు సిరీస్ ఆడుతోంది. అందులోనూ సొంతగడ్డపై.. ఇంకా విశేషం ఏమంటే.. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో తొలి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఎప్పటికో గాని రాని అవకాశం ఇది. బీసీసీఐ రొటేషన్ ప్రకారం భారత్ లో టెస్టులను కేటాయిస్తుంది. ఈ లెక్కన మరో ఐదేళ్లకు గాని తెలుగు గడ్డపై టెస్టు మ్యాచ్ లు చూడలేమని భావించవచ్చు. లేదా ఏమైనా మార్పులు జరిగితే చెప్పలేం.

ఇక్కడ అతడు..

హైదరాబాద్ లో ఇంగ్లండ్ తో గత నెల 25 నుంచి టెస్టు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇది తొలి. టీమిండియాలో నాలుగేళ్లుగా కీలక పేసర్ గా ఎదిగిన మొహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ సొంతగడ్డ అనే సంగతి తెలిసిందే. అయితే, హైబారాబాద్ ఉప్పల్ మైదానంలో చివరిసారిగా 2018 అక్టోబరులో టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పట్లో వెస్టిండీస్ తో టీమిండియా తలపడింది. అప్పటికి సిరాజ్ టీమిండియాకు ఎంపికవలేదు. అంటే.. గత నెల ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ అతడికి సొంతగడ్డపై తొలి టెస్టు అన్నమాట. కాగా, ఈ మ్యాచ్ లో సిరాజ్ ప్రదర్శన నిరాశపరిచింది. రెండో ఇన్నింగ్స్ లో అతడికి బౌలింగ్ ఆలస్యంగా ఇచ్చారు. మొత్తమ్మీద సొంతగడ్డపై టెస్టు వికెట్ తీయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులిచ్చిన సిరాజ్ రెండో ఇన్నింగ్స్ లో 7 ఓవర్లలో 22 పరుగులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే సిరాజ్ కు బౌలింగ్ ఇవ్వకుంటే మ్యాచ్ ఆడించడం ఎందుకని రిటైర్డ్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ప్రశ్నించాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడం, సిరాజ్ ప్రదర్శన నిరాశాపరచడంతో అతడిని రెండో టెస్టు ఆడిస్తారా? అనే సందేహం కలుగుతోంది.

అక్కడ అతడు..

తెలుగు రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద నగరం విశాఖపట్టణం. విభజిత ఏపీ ప్రభుత్వ ప్రాధామ్యాల్లో ఇది రాజధాని. అలాంటిచోట శుక్రవారం నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ నగరం టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (కేఎస్ భరత్) సొంత నగరం. 30 ఏళ్ల భరత్ ఇప్పుడు దేశంలో నంబర్ వన్ టెస్టు కీపర్. నిరుడు ఫిబ్రవరిలో టెస్టు అరంగేట్రం చేసిన అతడు ఇప్పుడు సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇప్పటివరకు భరత్ ఆరు టెస్టుల్లో ఇండియాకు ఆడాడు. గమనార్హం ఏమంటే.. హైదరాబాద్ టెస్టులో భరత్ ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ తో పోటీని తట్టుకుని స్పెషలిస్టు వికెట్ కీపర్ గా జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. తొలి ఇన్నింగ్స్ లో 41, రెండో ఇన్నింగ్స్ లో 28 పరుగులు చేశాడు. వికెట్ల వెనుక కూడా చురుగ్గా వ్యవహరించాడు. ఇప్పుడు సొంతగడ్డపై జరిగే టెస్టులోనూ రాణిస్తే అది అతడికి చిరస్మరణీయం అవుతుంది.


Tags:    

Similar News