ఐపీఎల్ లో దండగ నుంచి దంచుడు స్థాయికి..

ఈ సీజన్ లో మాత్రం చెలరేగిపోతున్నారు.

Update: 2024-04-09 12:30 GMT

టి20 క్రికెట్ అంటేనే ధనాధన్ బ్యాటింగ్.. అంతర్జాతీయ మ్యాచ్ అయినా.. లీగ్ క్రికెట్ అయినా ఇదే సూత్రం. అంతా బ్యాట్స్ మెన్ రాజ్యం.. ఇక భారత్ వంటి బ్యాటింగ్ పిచ్ లు ఉండే దేశంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఊచకోతకు అడ్డుంటుందా..? అందుకనే హార్డ్ హిట్టర్ లను, మెరుపు బ్యాట్స్ మెన్ లను ఏరికోరి తీసుకుంటాయి ఫ్రాంచైజీలు. అది విదేశీ బ్యాటర్లయినా.. స్వదేశీ కుర్రాళ్లయినా..? కానీ, ఇలాంటి కొందరు గతంలో తమపై పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. ఈ సీజన్ లో మాత్రం చెలరేగిపోతున్నారు.

ఈశాన్య భారతం నుంచి టీమిండియా దిశగా..?

రియాన్ పరాగ్.. అసోం క్రికెటర్. నాలుగైదేళ్లుగా దేశవాళీల్లో ఇతడి పేరు మార్మోగుతోంది. దూకుడైన బ్యాటర్ గానే కాక పనికొచ్చే స్పిన్నర్ కూడా. మంచి ఫీలర్డ్ అయిన పరాగ్ ను రాజస్థాన్ రాయల్స్ తమ జట్టులోకి తీసుకుంది. కానీ, పరాగ్ మాత్రం నిరుటి వరకు తీవ్రంగా నిరాశపరిచాడు. అతడి ఆట కంటే మైదానంలో హావభావాలు అభిమానులను చిర్రెత్తించేవి. క్యాచ్ పడితే హడావుడి.. బ్యాటింగ్ కు దిగితే బిల్డప్.. చేసే పరుగులు మాత్రం తక్కువే. ఇలాంటివాడిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ రాజస్థాన్ ఫ్రాంచైజీ మీద విమర్శలు వచ్చేవి. అయితే, ఈ సీజన్ లో పరాగ్ చెలరేగిపోతున్నాడు. గత ఐదు సీజన్లలో 54 మ్యాచ్‌లు ఆడిన పరాగ్.. 600 పరుగులే చేశాడు. సగటు 20 మాత్రమే. ఇప్పుడు మాత్రం నాలుగు మ్యాచ్‌ లలోనే 92.5 సగటుతో 185 పరుగులు బాదాడు. 43, 84 నాటౌట్, 54 నాటౌట్ ఇవీ అతడి తాజా స్కోర్లు. ఈ ఏడాది రంజీ ట్రోఫీ, లిస్ట్-ఎ, టీ20ల్లో వరుసగా అర్ధ శతకాలు బాదిన పరాగ్.. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే బహుశా ఈశాన్య రాష్ట్రాల నుంచి టీమిండియాకు ఆడిన తొలి క్రికెటర్ అవుతాడేమో?

దూబే.. దుమ్ము రేపుతున్నాడు

శివమ్ దూబె.. ముంబైకి చెందిన ఈ ఎడమచేతివాటం యువ క్రికెటర్ ఎప్పుడో ఐదారేళ్ల కిందట ఒకే ఓవర్లో 5 సిక్స్ లు కొట్టి వెలుగులోకి వచ్చాడు. కొన్నాళ్ల కిందట ఐపీఎల్ లోనూ అదరగొట్టాడు. దీంతో టీమిండియాలోకి వచ్చాడు. కానీ, అవకాశాలను నిలుపుకోలేదు. ఆరేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న దూబె.. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ విఫలం కావడంతో బెంగళూరు వదిలించుకుంది. తర్వాత రాజస్థాన్ రాయల్స్‌ తరఫునా మెరవలేదు. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు వచ్చాక మాత్రం దూబె దశ తిరిగింది. మీడియం పేస్ బౌలింగ్ కూడా వేసే అతడు.. ఇప్పుడు బ్యాటింగ్ పైనే ఫోకస్ పెట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా చెన్నై ఇప్పడు అతడిని వాడుకుంటోంది బెంగళూరుపై 34, గుజరాత్‌ పై హాఫ్ సెంచరీ, సన్‌ రైజర్స్ మీద కీలక మ్యాచ్ లో 45 పరుగులు చేసిన దూబె.. కోల్ కతాతో ఆదివారం మ్యాచ్ లో 28 పరుగులు చేశాడు. అన్నిటికి మించి అతడు కొడుతున్న సిక్సర్లే హైలైట్. దీంతో దూబెను వచ్చే టి20 ప్రపంచ కప్ నకు తీసుకోవాలని యువరాజ్ సింగ్ వంటి దిగ్గజం సూచిస్తున్నాడు.

పరుగుల అభిషేకం..

2018లోనే అండర్ 19 క్రికెటర్ గా ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన అభిషేక్ శర్మ.. ఆపై నిలకడ తప్పాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్న ఇతడు ప్రస్తుత సీజన్ కు ముందు వరకు 47 మ్యాచ్‌ లలో 893 పరుగులే చేశాడు. పార్ట్‌టైం స్పిన్నర్‌ అయినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. 2021లో వార్నర్, రషీద్ ఖాన్, బెయిర్‌ స్టో, ధావన్ లాంటి స్టార్లను వదిలేసిన సన్ రైజర్స్ అభిషేక్ ను మాత్రం కొనసాగించింది. అంతేగాక విలియమ్సన్, వార్నర్ దూరమయ్యాక అతడిని కెప్టెన్ గానూ చేయాలని చూసింది. అతడికి ఇంత ప్రాధాన్యం అవసరమా? అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ విమర్శలకు చెక్ పెడుతూ ప్రస్తుత సీజన్ లో అభిషేక్ శర్మ చెలరేగుతున్నాడు. ముంబైపై ఉప్పల్ లో సన్ రైజర్స్ చేసిన 277 పరుగుల రికార్డు స్కోరుకు అభిషేక్ ఇన్నింగ్స్ (23 బంతుల్లోనే 63 పరుగులు) వెన్నెముక. ఇక

చెన్నై (12 బంతుల్లో 37) పైనా అతడు దూకుడుగా ఆడాడు. కాగా, అభిషేక్ హిట్టింగ్ స్టయిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. గుడ్డిగా బాదడం కాకుండా బంతిని చూసి మరీ కొడుతున్న తీరు ముచ్చటేస్తోంది. వాస్తవానికి లీగ్ కు ముందు వ్యక్తిగతంగా వివాదంలో ఇరుక్కున్నాడు అభిషేక్ శర్మ. ఆ ప్రభావం ఏమీ లేకుండానే ఇప్పుడు దుమ్మురేపుతున్నాడు.

ఢిల్లీ తరఫున సన్నింగ్స్..

దక్షిణాఫ్రికాకు చెందిన ట్రిస్టన్ స్టబ్స్.. భీకరమైన బ్యాట్స్ మన్. వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న స్టబ్స్.. తొలి మ్యాచ్‌ లో విఫలమయ్యాడు. గత రెండు సీజన్లలో 4 మ్యాచ్‌ లలో 27 పరుగులే చేసిన నేపథ్యంలో స్టబ్స్ పని ఖతం అనుకున్నారు. కానీ, రాజస్థాన్‌ పై 23 బంతుల్లో 44, కోల్‌ కతాపై 34 బంతుల్లో 54 పరుగులతో స్టబ్స్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా, ముంబై ఇండియన్స్ పై 235 టార్గెట్ ఛేదనలో 25 బంతుల్లోనే 71 పరుగులు కొట్టాడు. కెప్టెన్ పంత్, ఇతర బ్యాట్స్ మెన్ విఫలమవుతున్న నేపథ్యంలో ఢిల్లీకి ఇప్పుడు స్టబ్స్ ఆట పెద్ద ఉపశమనం.

Tags:    

Similar News