టి20లకే కాదు.. వన్డేలకూ టీమిండియా స్టార్లు దూరం.. కారణం ఇదే!
టీమిండియా గత నెల చివర్లో ప్రపంచ కప్ గెలవగానే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించారు.
30 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో తొలిసారి ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది టీమ్ ఇండియా. చివరగా కపిల్ దేవ్, అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు ఉన్న సమయంలో ఐదు టెస్టులు ఆడి దారుణంగా పరాజయం పాలైంది. మళ్లీ వచ్చే నవంబరు నుంచి ఐదు టెస్టుల సిరీస్ కోసం అక్కడకు వెళ్లనుంది. ఇక మొన్ననే టి20 ప్రపంచ కప్ ముగించుకుని వచ్చిన మన జట్టు.. ప్రస్తుత జింబాబ్వేలో ఉంది. ఇందులో పాల్గొంటున్నది పూర్తిగా ద్వితీయ శ్రేణి జట్టు. మరోవైపు ఇది ముగియగానే రెగ్యులర్ ఆటగాళ్లతో శ్రీలంక వెళ్లనుంది.
వారిద్దరూ దూరమే..
టీమిండియా గత నెల చివర్లో ప్రపంచ కప్ గెలవగానే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, వీరితో పాటు ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ బుమ్రా కూడా వచ్చే నెలలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ఆడడం లేదు. దీంతో వన్డేలలో కేఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది.
టెస్టు సీజన్ ప్రభావం..
భారత జట్టు ఏడెనిమిది నెలల తర్వాత టెస్టు సిరీస్ ఆడనుంది. మార్చిలో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ముగిశాక మళ్లీ టెస్టులు ఆడలేదు. ఐపీఎల్ నుంచి ప్రపంచ కప్ వరకు అన్నీ టి20లే. కానీ, త్వరలో కొత్త టెస్టు సీజన్ మొదలుకానుంది. కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతుండడం, ఎలాగూ టీ20లు ఆడడం లేదు కాబట్టి.. టెస్టులకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంలో రోహిత్, కోహ్లిలు శ్రీలంకతో వన్డే సిరీస్ కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కాగా, 37 ఏళ్ల రోహిత్ డిసెంబరు-జనవరి నెలల్లో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి మ్యాచ్ లు ఆడుతూనే ఉన్నాడు. కోహ్లి మాత్రం ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడలేదు. వీరిద్దరూ తర్వాత ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ ఆడారు. ఇక లంకతో వన్డే సిరీస్ ముగిశాక భారత్.. బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు ఆడుతుంది. అప్పటికి రోహిత్, కోహ్లి జట్టుతో కలుస్తారు. అనంతరం న్యూజిలాండ్ తో మూడు టెస్టులు ఆడనున్న టీమ్ ఇండియా.. ఈ ఏడాది చివర్లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్తుంది.