ఇన్ స్టా పోస్ట్.. 2 కోట్ల లైక్స్.. సోషల్ మీడియా ‘కింగ్ కోహ్లి’.. తొలి ఇండియన్
ప్రపంచ ఫుట్ బాల్ లో పోర్చుగల్, అర్జెంటీనా స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ట్విటర్, ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సప్.. వీటన్నిటిలోనూ అత్యంత ఆదరణ పొందినది ఇన్ స్టా గ్రామ్. యూజర్ ఫ్రెండ్లీగా ఉండడమే కాక.. ఇందులోని ఫీచర్లు బాగుంటాయి. దీంతో యూత్ ఎక్కువగా ఇన్ స్టాకు కనెక్ట్ అవుతుంటారు. మరోవైపు క్రీడాకారులు, సినిమా స్టార్లు అందరూ ఇన్ స్టా ఖాతాలను కలిగి ఉంటారు. తమ అప్ డేట్ లను ఎప్పటికప్పుడు ఇందులో పోస్ట్ చేస్తుంటారు. ఇక మేటి స్పోర్ట్స్ స్టార్లయితే ఒక్క పోస్ట్ పెడితే కోట్లలో వ్యూస్ సొంతం చేసుకుంటారు. దీనికి తగిన చార్జి కూడా వసూలు చేస్తుంటారు. కాగా, భారత క్రీడాకారుల్లో సోషల్ మీడియాలో అత్యంత ఫాలోయింగ్ ఉన్నది ఎవరో తెలుసా?
రొనాల్డో, మెస్సీ తర్వాత
ప్రపంచ ఫుట్ బాల్ లో పోర్చుగల్, అర్జెంటీనా స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి ఫాలోయింగ్ కు తగ్గట్లే సోషల్ మీడియాలో ఫాలోవర్లూ ఉంటారు. అయితే, ప్రపంచంలో వీరి తర్వాత నిలిచేది భారత క్రికెట్ బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లి. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన విరాట్.. ఇటీవల టి20 ప్రపంచ కప్ గెలవడంలోనూ కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో విజయం వెనుక తన అర్ధసెంచరీదే కీలక పాత్ర. దీంతో కోహ్లి మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ గా నిలిచాడు. ఆ తర్వాత టి20 ఫార్మాట్ కు గుడ్‌బై చెప్పాడు. దీంతో వన్డే, టి20 ప్రపంచ కప్ లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న అతికొద్ది మంది భారత క్రికెటర్లలో ఒకడిగా రికార్డులకెక్కాడు.
ఆ సంతోష క్షణం...
గత శనివారం టి20 ప్రపంచ కప్ విజయం తర్వాత కోహ్లి సంబరాలు జరుపుకొన్నాడు. వ్యక్తిగతంగా ఈ టోర్నీ ఆసాంతం అతడు ఫెయిలయ్యాడు. ఫైనల్లో మాత్రమే రాణించాడు. మరోవైపు జట్టు కూడా కప్ గెలవడంతో కోహ్లి ఆనందం డబుల్ అయింది. ముందే నిర్ణయించుకున్నట్లుగా అంతర్జాతీయ టి20లకు గుడ్ బై చెప్పాడు.
ఇక మ్యాచ్ గెలిచాక కోహ్లి చేసిన ఇన్ స్టా గ్రామ్ పోస్టు రికార్డులను బద్దలు కొట్టింది. రోహిత్ తో ప్రపంచకప్ విజయానందం పంచుకుంటున్న ఆ ఫొటో వైరల్ అయింది. టి20 ప్రపంచ కప్ ట్రోఫీని జట్టుతో కలిసి రోహిత్ అందుకున్నప్పటిదే ఈ ఫొటో. దీనికి ఇన్ స్టాలో వారం రోజుల్లోనే 2.09 కోట్ల లైక్స్ వచ్చాయి. ఒక ఇండియన్ ఎవరైనా సరే.. చేసిన ఇన్ స్టా గ్రామ్ పోస్టుకు ఈ స్థాయిలో లైక్స్ రావడం ఇదే తొలిసారి. బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన పోస్ట్ ను మించి లైక్స్ వచ్చాయి. అంతేకాదు.. ఓ ఇన్ స్టా పోస్టుకు 2 కోట్ల లైక్స్ అందుకున్న తొలి ఆసియా ప్లేయర్ కూడా కోహ్లినే. ప్లేయర్ కాకుండా చూస్తే రెండోవాడు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులు చేసిన పోస్టుల్లో అత్యధిక లైక్స్ పొందిన టాప్-5 పోస్టులలో కోహ్లి తాజా ఇన్ స్టా పోస్ట్ (5వ స్థానం) కూడా ఉంది.