అతి విశ్వాసంతో వరల్డ్ చాంప్ కు షాక్.. అతి వీక్ టీమ్ చేతిలో

బ్రిస్బేన్ లో ఈ నెల 25న వెస్టిండీస్ –ఆస్ట్రేలియా రెండో టెస్టు మొదలైంది. ఇది గులాబీ బంతితో జరిగిన డే-నైట్ టెస్టు

Update: 2024-01-28 09:08 GMT

ఒకటేమో పరాయి గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్ ను అత్యద్భుతంగా ఆడి గెలుచుకున్న జట్టు.. మరోటేమో అసలు వన్డే ప్రపంచ కప్ నకే ఎంపిక కాని జట్టు.. ఒకటేమో టెస్టు చాంపియన్ షిప్ విజేత.. మరేటేమో ఆ టోర్నీ టేబుల్ లో అట్టడుగున నిలిచిన జట్టు.. ఈ రెండు జట్ల మధ్య టెస్టు మ్యాచ్ అంటే.. అదీ పింక్ బాల్ తో అయితే.. విజేత ఎవరనేది స్పష్టంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ఇక్కడే అద్భుతం జరిగింది. అత్యంత బలహీనమైన జట్టే.. అత్యంత పటిష్ఠమైన జట్టును ఓడించింది. ఇందులో చాంపియన్ జట్టు చేజేతులా చేసుకున్న పొరపాటే దానిని వెంటాడింది.

పాక్ ను స్వీప్ చేసినా..

ఇటీవల సొంతగడ్డపై పాకిస్థాన్ ను మూడు టెస్టుల సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీ వంటి స్టార్ పేసర్లున్న పాక్ జట్టుకు ఒక్క మ్యాచ్ లోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు ఆసీస్. బ్యాటింగ్ లో ఒకరు కాకుంటే ఒకరు రాణించగా, బౌలింగ్ లో కెప్టెన్ కమ్మిన్స్, హేజిల్ వుడ్ చెలరేగారు. దీంతో పాక్ ను ఆస్ట్రేలియా 3-0తో చుట్టేసింది. అదే ఊపులో వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ మొదలుపెట్టింది. తొలి టెస్టులో కరీబియన్లను చిత్తుచిత్తుగా ఓడిచింది.

మజామజాగా రెండో టెస్టు

బ్రిస్బేన్ లో ఈ నెల 25న వెస్టిండీస్ –ఆస్ట్రేలియా రెండో టెస్టు మొదలైంది. ఇది గులాబీ బంతితో జరిగిన డే-నైట్ టెస్టు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 311 పరుగులకు ఆలౌటైంది. జాషువా డిసిల్వా (79), కెవెన్ హడ్జ్ (71) రాణించారు. బౌలింగ్ లో వెస్టిండీస్ అదరగొట్టింది. 54 పరుగులకే ఐదు ఆస్ట్రేలియా వికెట్లను పడగొట్టింది. 161 పరుగులకు చేరేసరికి 7 వికెట్లు పడ్డాయి. అయితే, ఓపెనర్ ఖవాజా (75), కెప్టెన్ కమ్మిన్స్ (64 నాటౌట్), వికెట్ కీపర్ అలెక్స్ కేరీ ( 65) రాణించడంతో కోలుకుంది. కానీ, 289/9 వద్ద డిక్లేర్ చేసింది. అప్పటికి కమ్మిన్స్ క్రీజులో ఉన్నాడు. అయినప్పటికీ కోతలకు పోయి డిక్లేర్ చేసింది. 22 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ 193 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ ముంగిట 216 పరుగుల లక్యం నిలిచింది.

కొత్త కుర్రాడు వణికించాడు..

సొంత గడ్డపై స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ ను విండీస్ కొత్త కుర్రాడు షమార్ జోసెఫ్ వణికించాడు. కేవలం రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న అతడు కంగారూల పతనాన్ని శాసించాడు. 68 పరుగులకే 7 వికెట్లు పడగొట్టి తమ జట్టును విజేతగా నిలిపాడు. ఆసీస్ మాజీ కెప్టెన్, ఈ సిరీస్ ద్వారా ఓపెనర్ గా అవతారం ఎత్తిన స్టీవ్ స్మిత్ (91 నాటౌట్) ఓ ఎండ్ లో ఇన్నింగ్స్ ఆసాంతం నిలిచినా మరోవైపు షమారా జోసెఫ్ వికెట్లు పడగొడుతూ పోయాడు. చివరి ఏడు వికెట్లలో అతడే ఆరు తీశాడు. దీంతో 207 పరుగులకే ఆసీస్ ఆలౌటైంది. అనూహ్యంగా 8 పరుగుల తేడాతో ఓడిపోయింది.

కొసమెరుపు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ను ఓ వికెట్ ఉండగానే 22 పరుగుల దూరంలో డిక్లేర్ చేసింది. అదికూడా కెప్టెన్ కమ్మిన్స్ అర్ధ సెంచరీ చేసి ఊపులో ఉండగా.. ఎలాగూ పదో వికెట్ వరకు ఆడి ఉంటే వెస్టిండీస్ స్కోరును సమం చేయడమో, దాటడమో, కొద్దిగా దగ్గరకు రావడమో జరిగేది. కానీ, అతి విశ్వాసానికి పోయి డిక్లేర్ చేయడం చివరకు ఓటమిని తెచ్చిపెట్టింది. మరో విశేషం ఏమంటే.. ఈ సిరీస్ లో ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఏడుగురు కొత్తవారితో వెస్టిండీస్ బరిలో దిగింది.

Tags:    

Similar News