15 మందిలో నలుగురు టాప్ ఆటగాళ్లకు గాయాలే.. అయినా ప్రపంచ కప్ నకు
ప్రపంచ కప్ ను అత్యధికంగా గెలుచుకున్న జట్టు ఆస్ట్రేలియా. వరుసగా మూడుసార్లు (హ్యాట్రిక్) నెగ్గిన జట్టు కూడా అదే
ఆ జట్టు ఎప్పుడైనా ప్రపంచ కప్ హాట్ ఫేవరెట్టే.. అత్యధిక సార్లు టైటిల్ కొట్టిన జట్టు కూడా.. ఈసారి కూడా మంచి బ్యాటింగ్ బలంతో.. గొప్పదైన బౌలింగ్ దళంతో.. మేటి ఆల్ రౌండర్లతో బరిలో దిగుతోంది. గత మంగళవారం 15 మందితో కూడిన జట్టను ప్రకటించింది. అయితే, ఒకరిద్దరు కాదు వీరిలో నలుగురు టాప్ ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. మరొక ఒకరిద్దరు ఆటగాళ్ల ఫిట్ నెస్ పైనా సందేహాలున్నాయి. ఒక ఆల్ రౌండర్ అయితే కెరీర్ ఆసాంతం గాయాలే. ఇప్పుడు మాత్రం అతడు పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడు. తర్వాతి సంగతి ఏమిటనేది చూడాలి.
ప్రపంచ కప్ ను అత్యధికంగా గెలుచుకున్న జట్టు ఆస్ట్రేలియా. వరుసగా మూడుసార్లు (హ్యాట్రిక్) నెగ్గిన జట్టు కూడా అదే. 1999 నుంచి 2015 వరకు ఐదు కప్ లలో నాలుగు ఆ జట్టే కొట్టేసింది. 1996లో ఫైనలిస్టుగా నిలిచింది. 1988లో భారత్ లో జరిగిన కప్ లో తొలిసారి విశ్వవిజేతగా ఆవిర్భవించిది. 2011లో క్వార్టర్స్ లోనే భారత్ చేతిలో ఓడింది. మళ్లీ వచ్చే నెల నుంచి జరిగే కప్ లో ఆడేందుకు వస్తోంది. కాగా, మంగళవారం ప్రకటించిన జట్టులో గాయాలతో బాధపడుతున్నప్పటికీ కెప్టెన్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మేటి పేసర్ మిచెల్ స్టార్క్, మెరుపు ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కు చోటిచ్చింది.
ఇంతమందికి గాయాలా?
స్మిత్ ఆసీస్ బ్యాటింగ్ మూలస్తంభం. కమ్మిన్స్, స్టార్క్ కొత్త బంతిని పంచుకునే పేసర్లు. భారత అల్లుడైన మ్యాక్స్ వెల్ విన్యాసాలు ఐపీఎల్ లో చూసినవే. వీళ్లంతా తుది జట్టులో కచ్చితంగా ఉండే ఆటగాళ్లు. కానీ, అందరికీ గాయాలు. యాషెస్ సిరీస్‌లో మణికట్టుకు గాయాలైన కమిన్స్, స్మిత్ ఇప్పటికీ కోలుకుంటున్నారు. గజ్జల్లో గాయంతో స్టార్క్.. చీలమండ నొప్పితో మ్యాక్స్‌వెల్ ఇబ్బంది పడుతున్నారు. కాగా, కమిన్స్ గురువారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ జట్టులో ఉన్నాడు. మ్యాచ్‌లు ఆడడం అనుమానమే.
టీమిండియాతో వన్డే సిరీస్ కు..
ప్రపంచ కప్ నకు ముందే ఆసీస్ జట్టు భారత్ తో వన్డే సిరీస్ ఆడనుంది. వీరు ఆ సిరీస్ కూ ఎంపికయ్యే అవకాశముంది. వాస్తవానికి ప్రపంచ కప్‌కు జాతీయ జట్టును ప్రకటించడానికి ముందు దక్షిణాఫ్రికా, భారత్‌లో ఆస్ట్రేలియా 8 వన్డేలు ఆడాల్సి ఉంది. తర్వాత ప్రపంచకప్‌లో రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టాప్ ఆటగాళ్లు కోలుకోవడానికి సమయం ఉందని భావిస్తున్నారు. కాగా, ఈనెల 28 వరకు ప్రపంచ కప్ జట్టులో మార్పులు చేసుకునే వీలున్న సంగతి తెలిసిందే.
కొసమెరుపు.. కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆష్టన్ అగర్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రేవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్మిత్, స్టార్క్, మార్కస్ స్టాయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపాలతో కూడిన ఆస్ట్రేలియా జట్టులో మరికొందరు గాయాలతో ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లున్నారు. అయితే, అవి చిన్నవే. ముఖ్యంగా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్. అతడు గతంలో గాయాలతో ఏళ్లకు ఏళ్లు జట్టుకు దూరమయ్యాడు. యాషెస్ సిరీస్ తో తిరిగొచ్చినా మళ్లీ గాయపడకుండా ఉంటాడా? అనేది అనుమానమే.